సరదాగా నీతో
సరదాగా నీతో కాసేపు
గొడవపడిన వేళ
పరిహాసముగా మొదలై
మాటా మాటా పెరిగితే
బుంగమూతితో నువ్వు
అలకలు నటియించితే
ఎంత మహదానందం నా
మనసుకు
మనస్విని నేను
నేనే మనస్వినిని
నా పేరెందుకు
నీరాతల్లో
నాకెందుకు స్థానం నీ
కవితల్లో
నీ నోట ఈ మాటలు
పువ్వులుగానే తాకుతాయి
నా మనసుకి
నిజమే
నువ్వే మనస్విని
మనస్వినివి నువ్వే
మరి నువ్వెవరు
నువ్వు నాదానివైతే
మనస్విని నాది కాదా
సర్వహక్కులు నాకు లేవా
నా భావమే మనస్విని అని
తెలిసినా
అభ్యంతరం చెప్పే నీ
ఉడుకుతనం
ఎంత ముచ్చటగా ఉంటుంది
నేను కాక ఇంకెవరైనా
ఉన్నారా
ఉంటే చెప్పు నేను
హెల్ప్ చేస్తా
అంటున్న నీ మోములో
మాటలను తిరస్కరించే
భావాలు
నాకు మాత్రం తెలియనివా
అయినా
నీ ఉక్రోషం నాకు ఇష్టం
నీ అలక నాకు ప్రాణం
సరదాగా నీతో ఆడుకోవటం
నాకు
మరీ మరీ ఇష్టం
మనస్వినీ
No comments:
Post a Comment