తుంటరి గాలి అల్లర్లు
మబ్బులు సగం మింగేసినా
చేవ చావని చందమామమను
చూడు
నిన్నెంత ఆకలిగా
చూస్తున్నాడో
చల్లగా కురుస్తున్న
వెన్నెలను చూడు
ఎంత దాహంగా నీ
దేహాన్ని తడుముతోందో
చల్లని వెన్నెలలో
స్నానం చేసినా
విరహంతో ఆవిర్లు
వదులుతున్న నీ దేహానికి
వింజామరలు వీస్తున్న
పిల్లగాలిని చూడు
ఎంత తమకంతో నిన్ను
అల్లుకుంటోందో
పెదాలను ముద్దాడుతూ
మెడవంపుల జారుతూ
నాభీ మండలంపై సయ్యాటలు
ఆడుతూ
చల్లదనాన్ని వీడి
ఆవిరిగా మారిన
ఆ కొంటె వాయువులో
ఉన్నది తీరని దాహమే
వెన్నెలను చేతులుగా
చాచిన
నెలవంకలోని ఆరాటం
దాహమే
ఒంటిని తడిమే
పిల్లగాలిదీ
అంతులేని దాహమే
జాబిల్లిపై నాకు కోపం
పిల్లగాలిపై నాకు అలక
నీ కురుల సయ్యాటలాడే
మరుమల్లెలపై అసూయ
నిత్యం దాహార్తినైన
నేను
నీ చెంత సాంత్వన కోసం
అభిలషించే వేళ
చందమామకు ఎందుకు ఆరాటం
పిల్లగాలికి ఎందుకు
ఉబలాటం
నువ్వూ నేనూ కలిసిన
వేళ
ఈ వెన్నెల ఎందుకు
తుంటరి గాలి అల్లర్లు ఎందుకు
మనస్వినీ
No comments:
Post a Comment