అవును నాకు
పొగరే...
అమావాస్య నగరిలో
నెలవంక కన్నుగీటితే
నిశిచీకటి రాజ్యంలో
తొలిపొద్దు ఉదయిస్తే
గ్రీష్మతాపంలో
నవ వసంతం చివుర్లు
వేస్తే
ఎంత అందమైన అనుభవం
అద్భుతఘడియలకు
సాక్ష్యమై
పులకించదా మానసం
ఆ అనుభవం స్వంతమైతే
గర్వంతో ఉప్పొంగదా
హృదయం...
అవును
నాకూ గర్వమే
అంతకుమించి పొగరే...
ఎన్నో మనసులు
తపించిపోయినా
ఎందరెందరో కోరుకున్నా
ఎవరికీ దక్కనిది నాకు
దక్కింది...
కనుచూపు సోకితే
చాలనుకున్న వారికి కంటగింపుగా
ఆ కన్నుల వెన్నెల నాకు
స్వంతమయ్యింది
ఇది చాలదా గర్వించేందుకు...
అవును
నాకు గర్వమే
అంతకుమించి పొగరే...
పరులకు కలగా మిగిలిన
సిరిసంపద
నా ముంగిట నిలిచింది
కనులు మిరుమిట్లు
గొలిపే ఐశ్వర్యం
నాకు దాసోహమయ్యింది
కనులకే తెలియని
స్వప్నం
నిజమై నిలిచింది
గర్వించదా మరి నా మనసు...
నాకు దక్కిన సిరిసంపద
నేను పొందిన ఐశ్వర్యం
నువ్వూ
నీ మనసూ మమతలే కదా
మనస్వినీ ...
No comments:
Post a Comment