పీడకలే నయం
అర్ధరాత్రి పీడకలతో
మెలకువ వచ్చింది
ఈ వయసులో పీడకల ఏంటా
అనుకున్నా
పీడనం అధికమైతే
పీడకలలేగా మిగిలేది
అని సరిపెట్టుకున్నా
కల తాలూకు భయాలు
మదినిండా
నిండుకుని తెలియని
వేదనతో
అటూ ఇటూ దొరలుతున్నా
ఏవో ఆలోచనలు
మెల్లమెల్లగా
చుట్టుముట్టాయి
ఆ ఆలోచనలు రోజూ ఉండేవే
నిత్యం నన్ను
వేధించేవే
గుండెకు మాయని గాయం
చేసేవే
క్రమంగా ఆలోచనలు
బలపడుతున్నాయి
ఏవేవో ఆలోచనలు
ముప్పిరిగొన్న భయాలు
కనులముందు జీవితం
కదలాడింది
నిష్క్రియా పర్వం
లీలగా కనిపించింది
చేతగానితనం
వెక్కిరించినట్లు నవ్వింది
మూసుకున్న ఇనుప
తలుపుల్లో
జీవితం బందీగా
కనిపించింది
చాలా భయం వేసింది
నిద్ర పట్టకున్నా
గట్టిగా కనులు
మూసుకున్నా
బలవంతంగానైనా
నిద్రపోవాలని
అసహనంగా కదులుతున్న
దేహం
మెల్లగా జారుతోంది
నిద్రలోకి
మరలా అదే స్వప్నాన్ని
ఆహ్వానిస్తూ
పీడించే జీవితం కన్నా
పీడకలే నయమనిపించింది
మనస్వినీ
No comments:
Post a Comment