Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 25 June 2016

ఈ పండగ నీదే

ఈ పండగ నీదే

ప్లాస్టిక్ పువ్వుల్లో వాసన ఎందుకు చూస్తావు
ఎండమావుల్లో నీటిని ఎందుకు వెతుకుతావు
లేని ఆనందం కోసం బాధను ఎందుకు ముద్దాడుతావు
ఒక్కరోజు ఆనందం కోసం ఏడాదంతా ఎందుకు ఏడుస్తావు  
సగటు మనిషిని నేను
సగటు ప్రశ్నలే నావి
ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని
ఎక్కడ రాసి ఉంది ఇలాగే ఉండాలని
ఇస్లాం ఇలా చెప్పిందా
దివ్య ఖురాన్ లో రాసి ఉందా
అలా చెప్పి ఉంటే
అలా రాసి ఉంటే
హితమెలా అవుతుంది నీకు
ఖురాన్ అవతరించిన మాసం
పవిత్ర రంజాన్
ఆచరించు దైవవాణిని
పాటించు నీ ధర్మాన్ని
సగటు మనిషీ మరిచిపోకు నీ వాస్తవాన్ని
పండగ చేసుకో
ఆనందంగా ఉండు
అందరితో కలిసిపో
అయితే
ఆ పండగ ఆనందం వెనుక
విషాదాన్ని ఎందుకు దాస్తున్నావు
చిరునవ్వుల సలాం మాటున
వేదనను ఎందుకు సమాధి చేస్తున్నావు
నిజం తెలుసుకో
నిజాయితీగా మసులుకో
ఇఫ్తార్ విందుకోసం పండ్లు ఫలాలే ఎందుకు
లేనివాటి కోసం అప్పులు ఎందుకు
పండగ రోజు కొత్త బట్టలే ఎందుకు
పర్వదినం పేరుతో కొత్త అప్పులు ఎందుకు
అప్పులకోసం అభిమానాన్ని తాకట్టు పెడతావెందుకు
ఒక్కరోజు వేడుక కోసం
సంవత్సరం పొడుగునా వేదన ఎందుకు
ఈ పండగ ఎందుకు చేసుకున్నానా అనే రోదన ఎందుకు
రంజాన్ నీ ఆనందం కోసమే
ఖురాన్ నీ జీవితం కోసమే
మనీతో ముడిపడి లేదు నీ ఆనందం
ఎక్కడో అప్పులు తెచ్చి
ఏదో అమ్ముకుని
ఆడంబరాలు చేయాలని లేదు ఖురాన్ లో
కొత్త బట్టలతోనే ఈద్ నమాజు అని
ఎక్కడా చెప్పలేదు దేవుడు
నిజాయితిగా దేవుడిని నమ్మి
చిరిగిన బట్టలున్నా సరే
ఈద్గాహ్ లో తలవంచు
కోటీశ్వరుడి మాట తెలియదు గానీ
ఆ దైవం నీ నమాజునే స్వీకరిస్తాడు
నీ ఇంట్లో షీర్ ఖుర్మా ఘుమఘుమలు లేకున్నా
ఆ దేవుడి పరిమళం నీతోనే ఉంటుంది
పండగ పేరుతో నీకు వేదన కలిగితే
అది దేవుడికీ వేదనే
నీకు సత్తా ఉంటే పదిమంది ఆనందంలో పాలు పంచుకో
లేమిలో నువ్వుంటే ఉన్నదే నిజమని నమ్ముకో
ఒక్కరోజు ఆనందంకోసం
నిత్యం వేదనలెందుకు
గుండెరగిలే అవమానాలెందుకు
సగటు ముస్లింగా నేను చెప్పేది నిజమేకదా  
మనస్వినీ 

No comments:

Post a Comment