నువ్వే హీరో
గుడ్డి దీపం
వెలుతురులోనే
చక్కబెట్టేసేయ్
నిశి పంజా విసిరేలోపే
అంతా సర్దేసేయ్
లోకం పోకడ చూసి
మనసు బాట మార్చేసేయ్
చీకటి అలుముకుంటే చేసేదేమీ
లేదు
కనులు మూయడం తప్ప...
అవును మనిషీ
నిజం తెలుసుకో
నిజం తెలిసి మసులుకో
నీదన్నది ఏమీ లేదు
జగతిలోనా
అంతా నీదేయన్నది ఒక
భ్రమగా మిగిలిపోతుంది...
అభిమానాలకు పొంగిపోకు
పలకరితలకు పులకించకు
కుశల ప్రశ్నలు నీకు
కాదు
సలాములన్నీ గులాములు
కాదు...
నీ పరపతికే నమస్కారం
నీ పలుకుబడికే అభిమానం
నీ సంపదకే వందనం
అన్నీ నీకేనని
మురిసిపోకు
నువ్వే గొప్పని
మిడిసిపడకు...
కలిమిలో నీ పంచన చేరిన
జనులు
లేమిలో నీ మోమును
చూడరు
కాసుల గలలలు
వినరాకపోతే
కరెన్సీ సువాసనలు నీలో
లేకపోతే
పొరబాటున సైతం
కన్నెత్తి చూడరు...
సర్దేసుకో మనిషీ
దీపముండగానే
మారిపో మనిషీ
అడుగులు ఆగక ముందే...
ఎవరు చూడరు నీ మనసును
ఎవరూ వినరు నీ గోడును
ఎవరూ గాంచరు నీ
ఆక్రందనను...
వసుధైక కుటుంబమని
కల్పనల్లో విహరించకు
విశాల జగతియని
విర్రవీగకు
కుచించుకు పోవును లోకం
నాలుగు గోడలే నీకు
లోకం...
మంచీ చెడుల వాదనలు
వద్దు
నీతీ నిజాయితీల రోదనలు
వద్దు
నీ జీవితం
నీ లోకం
మంచి చేసినా
చెడును ఆశ్రయించినా
నీ జీవితంలో
నువ్వే హీరో...
దీపముండగానే అన్నీ
సర్దుకుంటే
చీకటికి ముందే కనులు
విచ్చుకుంటే
కళ్ళు మిరుమిట్లు
గొలిపే కాంతి
పాదాక్రాంతం కాదా
మనస్వినీ
No comments:
Post a Comment