Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 18 June 2016

జీతం లేని కూలీ నాన్న

జీతం లేని కూలీ నాన్న

పార్కులో పిల్లలు ఆడుకుంటున్నారు
సిమెంటు బెంచి మీద కూర్చున్న తను
ఆ పిల్లలనే చూస్తున్నాడు
అప్పుడప్పుడే తెల్ల బడుతున్నగడ్డం
ముడతలుపడిన చర్మం
మాసిన బట్టలు
బాగా బతికిన మనిషే
చితికిపోయిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి
కంటి సుడుల మధ్య బొమ్మలు అస్పష్టంగా కనిపిస్తున్నా
ఆడుకుంటున్న పిల్లలనే చూస్తున్నాడు
కన్నీటి పొరలతో పోటీ పడుతూ
ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి
గతమంతా సినిమా రీళ్లలా
కనులముందు కదలాడుతోంది
ఎదిగిన పిల్లలు
వారి భవిష్యత్తు
తిండి బట్టలకోసం తాను పడ్డ పాట్లు
అన్నీ గుర్తుకు వస్తున్నాయి
పిచ్చుకలు గూడు అల్లుకున్నట్లు
జీవితంలో ఒక్కో మెట్టునూ తీర్చిదిద్దిన
చాతుర్యం మదిలో మెదలాడుతోంది
తాను ఒక ముద్ద తక్కువ తింటే
పిల్లల ఆకలి తీరుతుందనే ఆరాటం పలకరిస్తోంది
సమస్యలు చుట్టుముట్టినవేళ
ఒంటరిగా ఏడ్చిన
బాధామయ గుర్తులూ గుండెను తడి చేస్తున్నాయి
బైక్ మీద వెళుతూ
కారు డ్రైవ్ చేస్తూ
తెలియకుండానే కంటనీరు జారిన ఘడియలూ
మనసును మెలియపెడుతున్నాయి
అవసరమై పరులముందు చేయి చాచిన క్షణాలు
గుండెపై కత్తులు దించుతున్నాయి
ఎవరు చూసారు తన బాధని
ఎదలో రగిలే వేదనని
బాధ్యతల సమరంలో మనీ మిషిన్ గా మారి
తనవారి కంటనీరు దొరలకుండా
తనే శిథిలమవుతూ
కొవ్వొత్తిలా తరిగిపోతూ
అందరూ ఉన్నా ఒంటరిగానే పోరాటం చేస్తూ
నలిగిపోయిన ఆ మనషి రోదనను
ఎవరు వినగలిగారు
తను కంటనీరు పెడితే
తన కుటుంబం తట్టుకోలేదని
కన్నీటిని చిరునవ్వులో దాచుకునే
మానవతామూర్తి మనసును  
ఎవరు చదవగలిగారు
ఆలోచనలు సునామీలై
కన్నులు చెమ్మగిల్లిన
ఆ సగటు జీవి ఒక తండ్రి
ఇలలోని తండ్రులందరికీ
అసలుసిసలైన ప్రతినిధి
అవును
ఆయన ఒక నాన్న
ఒక తండ్రి
తాను పడే కష్టానికి వేదన తప్ప
పైసా జీతం కూడా తీసుకోని
నిరంతర కూలీ
తాము నిర్వీర్యమవుతూ
తనవారికి వెలుగుబాటలు పరుస్తున్న
నాన్నలందరికీ సలాం
మనస్వినీ

No comments:

Post a Comment