అమ్మమీద ఆన
చిన్న నాటినుంచి
అమ్మ చెబుతూనే ఉంది
దుప్పటి ఎంత ఉందో
కాళ్ళు అంతే చాచాలని
నీ స్థాయిని మించి
ఆలోచనలు చేయరాదని...
అమ్మ చెప్పింది
వింటున్నా అనే అనుకున్నా
అమ్మ మాట జవదాటలేదనే
అనుకున్నా
నా నడత
నా నడక
అమ్మ పలుకుల ఫలితమే
అని భ్రమించా...
ఇప్పుడు ఏమయ్యిందో ఏమో
అమ్మ మాట మరిచానో ఏమో
నడిచిన బాట వీడానో ఏమో
నిజమే నేను ఎందుకిలా
ఎందుకు ఇలా
ఆలోచిస్తున్నా
ఎందుకు గమ్యాన్ని
మార్చుకున్నా...
నిజమేనా
నేను మారానా
పూర్తిగా మారిపోయానా
నన్ను నేను
నమ్మలేకపోతున్నా
నిజమేదో
తెలుసుకోలేకపోతున్నా...
నాది కానిదానిపై మక్కువ
పెంచుకున్నానా
నా స్థాయికి మించి
ఆలోచిస్తున్నానా
ఆస్తులు అంతస్తులపై
వ్యామోహం కలిగిందా
బతకడంకోసమే డబ్బు
అన్నది నినాదమేనా...
చావు బతుకుల మధ్య
కొట్టుమిట్టాడుతున్న
జీవితానికి
పరుల ఆస్తి ఆక్సిజన్
అనుకుంటున్నానా
ఏదో జరిగిపోతోందని
భయపడిపోతున్నానా
ఇదంతా నిజమేనా...
నేనెప్పుడూ అలా అనలేదే
నేనెప్పుడూ అలా
ఆలోచించనే లేదే
ఎవరితోనూ అలా
చెప్పుకోలేదే
ఎవడో ఏదో కూస్తే పాపం
నాదేనా
ఎందుకిలా...
అమ్మ మీద ఆన
నేనదికాదు
నా వ్యక్తిత్వం అది
కాదు
ఎవరూ నమ్మినా
నమ్మకపోయినా
నేను అది కానే కాదు
నేనదే అయితే
అదే నిజమని అనుకుంటే
జీవితాన్నే త్యజిస్తా
మనస్వినీ...
No comments:
Post a Comment