నా ప్రాణం నిదురిస్తోంది..
ఓ కోయిలా
ఏమిటే నీ గోలా
రోజూ కూస్తూనే ఉన్నావుగా
ఈ ఒక్క ఘడియ సడి చేయక ఉండలేవా
నీ గానామృతం నాకు ప్రియమే
సవ్వడి చేయకు ఈపూట
ఇక్కడ నాకంటే ప్రియమైన
నా సఖి నిద్దురోతోంది....
అదిగో
అక్కడ మసీదులనుంచి
మంద్రమైన స్వరంతో
పిలుపేదో వినిపిస్తోంది
ఓ చిరుగాలీ
ఆ పిలుపును నాకే పరిమితం
చేయ్
నా గుండె గడపను తాకిన ఆ
స్వరాన్ని నా ఇంటి గడపలోకి మోసుకుపోకు
గదిలో నా ప్రాణానికి
నిద్రాభంగం అవుతదేమో...
తన ప్రశాంతతే నాకు
అన్ని నమాజులకంటే
ప్రియం గనుక...
No comments:
Post a Comment