అమ్మ పాదాల చెంత
సాయం సమయం
వర్షం ఆగకుండా కురుస్తోంది
నాకేం ఇబ్బంది అనిపించలేదు
అక్కడే నిలబడి ఆ ప్రాంతాన్ని
తదేకంగా చూస్తున్నా...
నా చెంపల మీదుగా జారుతున్న
వాన నీటిలో
నా కన్నీరు కూడా కలిసిపోయిందని
నాకు తెలుస్తూనే ఉంది..
నాతో ఉన్న నావాళ్లు మతపరమైన
కార్యక్రమం చేసుకుంటున్నారు
నా మనసు అదేమీ పట్టించుకోవటం
లేదు...
ఏదో తెలియని బాధ గుండెను
మెలియపెడుతోంది
తల భారమైన భావన తెలిసిపోతూనే
ఉంది...
తడిచిన నా కళ్ళు దృష్టిని
మరల్చుకోలేదు
ఆర్తిగా ఆవేదనగా ఒకే చోట
లగ్నమై నిలిచాయి...
ఆ చోటు అమ్మ విశ్రమిస్తున్న
చోటు
అది అమ్మ సమాధి
ఆ సమాధి పొరలలోనే అమ్మ
నిదురిస్తోంది...
మనసు ఎంత భావుకమైనా
నాకు తెలుసు ఆ మట్టిలో
అమ్మ లేనే లేదని
అమ్మ దేహం ఎప్పుడో మట్టిలో
కలిసిపోయిందని...
అయినా అక్కడ అమ్మ నిద్ర
పోతోందనే మనసు నమ్ముతోంది
అమ్మ ఆప్యాయంగా పిలుస్తున్నట్టే
అనిపించింది...
మనసుకు సర్ది చెప్పి
రెండు అడుగులు వెనక్కి
వేసా
అమ్మ పాదాల చెంత చదును
చేసిన నేల కనిపించింది
నేనూ ఇక్కడే విశ్రాంతి
తీసుకుంటే బావుంటుందని అనిపించింది
అంటే ఆమ్మ పాదాల చెంత ఆ
ఖాళీ స్థలం నాదేనని తీర్మానించుకున్నా...
పక్కనే ఉన్న నా కొడుకుతో
మెల్లని స్వరంతో చెప్పా
డాడీ నేను మరణించాక
నన్ను ఈ ప్రాంతంలోనే సమాధి
చేయాలని
అలా అన్నప్పుడు తన ముఖంలోని
భావాలను చూడాలని అనిపించలేదు
ధైర్యం చాలలేదేమో...
అమ్మకు మనసులోనే వీడ్కోలు
చెప్పి స్మశానం లోనుండి బయటికి అడుగులు వేసా భారంగా
కలుస్తాం అమ్మా త్వరలోనే
అని మనసులో అనుకుంటూ...
No comments:
Post a Comment