గడియారం నవ్వింది
హోరుమని వీస్తున్న తూఫాను
గాలికి దయ్యాల్లా ఊగుతున్న చెట్లు
హాహాకారం చేస్తున్నాయి...
ఎందుకో చిన్న బోయిన పున్నమి
చంద్రుడు మబ్బు చాటున
ముసుగేసుకున్నాడు...
గుడ్డి దీపాల వెలుగులను
కూడా మింగేయాలని
చిమ్మ చీకటి నోరు తెరిచి
విశ్వరూపం చూపిస్తోంది...
ఏదో తెలిసిన సందడి
నా వీనులను లీలగా తాకుతోంది
అవును అది చిరుమువ్వల సవ్వడే
అది చెవులలో ఏదో మంత్రం
వేస్తోంది...
చెవిపై ఏదో నెమలి ఈక
నాట్యం చేస్తున్న గిలిగింత...
ఏదో వెచ్చని శ్వాస మెల్లగా
ఊపిరిలో కరిగిపోతున్న
పులకింత...
బాగా పరిచయమున్న
స్వరమేదో ఆచేతనమైన మెదడులోకి
చేరి చేతన పుట్టించిన కలవరింత...
ఎక్కడో సముద్రుడు ఒళ్ళు
విరుచుకున్నట్టున్నాడు
ఓ పెద్ద అల విరుచుకుపడిందేమో
గుండెల్లో ఒక్కసారిగా సునామీ
పొంగింది..
కళ్ళు తెరిచి కాలగమనం వైపు
దృష్టి సారిస్తే
దుష్ట రాక్షసి గడియారం
నన్ను చూసి ఫక్కున నవ్వింది...
No comments:
Post a Comment