Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 2 December 2021

స్వాప్నికుడు మా సత్తన్న....

 

స్వాప్నికుడు మా సత్తన్న....

 


స్వాప్నికుడి కన్నులే వెన్నెల కురిపిస్తాయి

ఆ కన్నులే అమావాస్యలా కమ్ముకుంటాయి..

స్వాప్నికుడి మొహమే చందమామలా నవ్వుతుంది

ఆ మొహమే కన్నీటి కలువలా విలపిస్తుంది

స్వప్నం సాకారమైనా

జారిపోయినా

ఆ వ్యక్తిత్వం స్వప్నించడం మానదు..

మా సత్తన్నను చూస్తే నాకు ఇలాగే అనిపించింది. తనలో నిత్య స్వాప్నికుడు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడని అనిపించింది. గత రెండేళ్లుగా ఆయనపై నాకు ఏర్పడిన అభిప్రాయం తనను చూడగానే కరిగిపోయింది.. సత్తన్నలోని స్వాప్నికుడు తన కలల లోకాన్ని ఆవిష్కరించకుండా ఉండలేడని అనిపించింది..

 

అరలక్ష జీతం వదిలేసి...

 

ఏబీఎన్ ఛానల్ లో క్రైమ్ బ్యూరో చీఫ్ గా పని చేస్తున్న మా సత్తన్న రెండేళ్ల కింద తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తా అని ప్రకటించాడు. అందరిలాగే నేనూ పిచ్చోడు ఇలా చేశాడేంటి అని అనుకున్నా. అక్షరాలా అరలక్ష జీతం, సమాజంలో హోదా అన్నీ వదిలేసి అడవి బాట పట్టాడు అని కొంచెం ఫీలయ్యా... తనని కలిసి అప్పటికే చాలా కాలం అయ్యింది.. శ్రీ శివసాయి నర్సరీ పేరుతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సత్తన్న fb పోస్టులను చూడటం తప్ప తనని కలిసే వీలు కుదరలేదు. మొత్తానికి అర్ధమయ్యింది ఏంటంటే సత్తన్న కష్టాల్లో ఉన్నాడని.. నేనూ అనిల్ సత్తన్నను కలవాలని అనుకున్నాం. అనిల్, సత్తన్న నేను ఒకప్పుడు క్రైమ్ జర్నలిజంలో ఒక రేంజ్ లో ఉన్నవాళ్ళమే. ఇప్పుడు అనిల్ కానీ నేను కానీ ఆర్ధికంగా రోడ్డు మీద ఉన్నాం.. మరి మేము కలవడం వల్ల సత్తన్నకు ఒరిగేదేమిటి అనుకోవచ్చు... కానీ మనసాగలేదు అగ్రజుడిని కలవాలని డీసైడ్ అయ్యి చిలుకూరు గ్రామంలో ఎక్కడో చిట్టడివిలో ఉన్న సత్తన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాం.

అక్కడ అడుగు పెట్టగానే ఎందుకో సత్తన్న కలలు వాడిపోయినట్టు కనిపించింది.. అక్కడ పంటలో జీవం లేదేమో అనిపించింది.. Fb లో కనిపించే పచ్చదనం... సందర్శకుల నవ్వులేవీ నాకు కానరాలేదు.. అయితే కొన్ని క్షణాలు పట్టలేదు తెలుసుకోవడానికి అక్కడ స్వప్నాలు మళ్ళీ మొలకలు వేస్తున్నాయనీ... వాడిన స్వప్నికలు మళ్ళీ పచ్చదనాలను

పులుముకుంటున్నాయని...

సత్తన్న మాటలు వింటుంటే అక్కడ ఎవరికీ తెలియని యజ్ఞం జరుగుతోందనీ...

తన సర్వం కోల్పోయి అప్పుల్లో మునిగిపోయినా ఇక్కడ సత్తన్న స్వప్నిస్తూనే ఉన్నాడు. అకాల వర్షాలు పంటను సర్వనాశనం చేసినా మనోధైర్యం కోల్పోని ఈ మహర్షి ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు. విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి భార్యాబిడ్డలతో సిటీకి దూరంగా అడవి లాంటి ప్రాంతంలో ఉంటూ, ఎన్నో అవస్థలు పడుతూనే సమాజానికి హాని కలిగించని కూరగాయలను అందించాలని తపన పడుతున్న ఈ స్వాప్నికుడు అందరికీ అర్ధం కాకపోవచ్చు కానీ తన కళ్ళను చదివిన నేను మాత్రం తనలోని పట్టుదలను పసిగట్టేసా... బంధువులు, మిత్రులు, తెలిసినవాళ్ళలో చాలామంది సత్తన్న మార్గాన్ని తప్పు పట్టేవారే.. టాటా చెబుతూ కార్ రివర్స్ చేస్తున్న నాకు చిన్న పిల్లాడిలా బోసి నవ్వులతో చేతులు ఊపుతున్న సత్తన్నలో

నేను గెలుస్తానురా అన్న ధీమా కనిపించింది.. ప్రకృతినే నమ్ముకున్న మా అగ్రజుడిని ఆ ప్రకృతి పులకరించి కరుణించాలని మనసారా ఆకాంక్షిస్తున్నా

1 comment:

  1. Really very happy to say,your post is very interesting to read.I never stop myself to say something about it.You’re doing a great job.Keep it 

    jyothi-nainwal - this site also provide most trending and latest articles

    ReplyDelete