ఆత్మీయ అతిథి
ఎక్కడో ఒక నింగి నేల
వైపు కుంగింది
శూన్యం నుంచి రాలిన
తారక ఒకటి
పుడమి వైపు జారింది
వడివడి నడిచిన పయనం
గమ్యం చేరకనే ఆగింది
మరుమల్లెల తోటలో
మల్లికలు కొన్ని
సౌరభాలు అద్దుకున్నాయి
పుష్పరాజాలు గులాబీలు
పరిమళాలు తాగుతున్నాయి
నిశబ్ద పీఠికలో తెలియని
అలికిడి ఏదో
సవ్వడి చేస్తోంది
గుంభనమై నిలిచిన
ఊడలమర్రి
చేతులు చాచి
ఆడుతున్నది
ఎదను తడిమేందుకు మల్లికలు ఆరాట పడుతున్నాయి
పాదాలను చుంబించేందుకు
గులాబీలు ఎదురు చూస్తున్నాయి
భారంగా శ్వాసించిన
పుడమి
తనలో సర్దుబాటు
చేసుకుంటున్నది
తన గుండియలో
చోటునిచ్చి
విశ్రమించమని
కోరుతున్నది
ఆత్మీయ అతిథివి
నీవేనంటూ
స్వాగతం పలుకుతున్నది
No comments:
Post a Comment