స్వప్నమంటే భయమే నాకు
ఏవో కాంతిపుంజాలు
మనుషులు కాని మనుషుల రూపాలు
బొమ్మలో మరబొమ్మలో
కదలాడుతున్న శిల్పాలు
కరిగిన అనుభవాల అనుభూతులో
మరిచిన జ్ఞాపకాల మరీచికలో
సాంత్వన మరిచిన మనసులో వేదనలో
కాలమనే ఘడియల హెచ్చరికలో
ప్రమాదమో ప్రమోదమో
కానరాని గుండె గుడి సవ్వడులో
మూసుకున్న కనురెప్పల సీమలో
కరాళ నృత్యం చేస్తున్న
జీవం లేని మనుషుల విన్యాసాలో
అన్నింటా నలుగుతున్న నేను
భయమేస్తోంది మనసా
కనులనిండా స్వప్నికలను నింపుకోవాలంటే..
No comments:
Post a Comment