Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 23 September 2021

పిచ్చోళ్ళు...

 

పిచ్చోళ్ళు...



పుట్టుకతోనే మెదడు సక్రమంగా లేక మానసిక వికలాంగులుగా మారినవారిని పిచ్చోళ్ళు అని ముద్ర వేస్తోంది ఈ లోకం.. ఎందుకో నాకు ఈ లోకంలో అందరూ పిచ్చోళ్లని అనిపిస్తోంది.మెదడు పనిచేయని వ్యక్తి తనున్న స్థితిని అత్యంత ఉన్నతమైనదని భావించి ఏదో తెలియని అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తాడు. పాపం పిచ్చోడు కదా అని జాలి చూపిస్తాం.. కానీ లోకంలో అందరూ ఈ జాలికి అర్హులేనని అంటాను నేను.. ఎందుకంటే ఇక్కడ అందరూ పిచ్చోళ్ళే... కొందరికి మతం పిచ్చి. ప్రపంచంలో ఉన్నతమైన మతం తనదే అని అనుకుంటూ ఇతర మతస్థులను పురుగులా చూసే మనస్తత్వం పిచ్చిగాక మరేంటి? ఇక కులపిచ్చోళ్ల లెక్క అంతా ఇంతా కాదు.. ఇంకో రకం పిచ్చోళ్ళున్నారు, వీళ్ళ పిచ్చితనం పేరు డబ్బు. డబ్బు పిచ్చి ఉన్నవాళ్లు తమచుట్టూ గిరిగిసుకుని మిగతా మనుషులను పిచ్చోళ్ల కింద జమకడతారు, వాళ్ళు మాత్రం డబ్బు పిచ్చిలో తూలుతూ రక్త సంబంధాలను గిరాటు వేస్తారు. కొందరికి కామ పిచ్చి. మొగుడు బయటికి వెళ్ళగానే ప్రియుడితో కులికే పెళ్ళాం, బయటికి వెళ్లి పక్క చూపులు చూసే మొగుడూ పిచ్చోళ్ళే.. నేను మాత్రమే నిజం, మిగతా అందరూ ద్రోహులేనంటూ నేను అనే సంద్రంలో కొట్టుకుపోయేవాళ్ళు కూడా పిచ్చోళ్ళే.. బాగా చదివానని ఒకడు, అందంగా ఉన్నానని మరొకరు ఇలా ఒకరేంటి అందరూ ఏదో ఒక పిచ్చిలో తన్మయత్వం పొందుతున్నారు. పుట్టుకతో పిచ్చి ఉన్నవారిని పిచ్చోళ్ళు అంటూ తమ పిచ్చికి మాత్రం అందమైన పేర్లు తగిలించుకుని సంబరపడుతున్నారు. వీళ్లందరినీ ఆరోగ్యవంతులైన మనుషులుగా భావించే నాది మాత్రం పిచ్చికాదా? నేనూ ఏదో ఒక పిచ్చిలో బతుకుతూనే ఉంటా. ఇప్పుడు చూడండి పిచ్చి పిచ్చిగా ఏదో రాసేసాను, ఇది ఏ పిచ్చోళ్ళో చదివి లైక్ చేస్తారని ఆశించటం నా పిచ్చికాక మరేంటి?

చీకటి దీపం

 

చీకటి దీపం



నిశ్శబ్దం ప్రశాంతత కాదు

అది వేయి ఏనుగుల ఘీంకారావం...

మౌనం ఆహ్లాదకరం కానే కాదు

అది మనసులో ఒక రగిలే యుద్ధ తంత్రం...

చిరునవ్వు ప్రతిసారీ సంతోషం కాదు

అది వెలిగే దీపం అడుగున అంధాకారం...

నిష్క్రియాతత్వం పలాయనవాదం కాదు

అది విధి ఆడే చదరంగం...

కనిపించే ప్రతిదీ సత్యం కాదు

అది అందమైన అబద్ధానికి ప్రతిబింబం...

ఏ దేహమూ చిరంజీవం కాదు

అది ఏ క్షణమైనా ఆరిపోయే చీకటిదీపం...

ఎవ్వరి జీవితమూ శాశ్వతం కానేకాదు

అయినా ఈ మనుషులకు

ఎందుకింత ఆరాటం...

Monday, 13 September 2021

తప్పెవరిది?

 

తప్పెవరిది?



మీడియా వార్తల కవరేజి తీరు చూస్తే సామాన్య ప్రేక్షకుడిగా నాకు మండిపోతోంది. చిన్నారిపై అఘాయిత్యం, హత్య, మరెన్నో దారుణాలు వదిలేసి ఒక సినిమా హీరో యాక్సిడెంట్ వార్తను విపరీతంగా కవర్ చేస్తున్నారు. గంటకోసారి హెల్త్ బులెటిన్, అతను కళ్ళు తెరిచాడా లేదా తుమ్మాడా , పక్కకు కదిలాడా వంటివి ప్రతిదీ అప్ డేట్ చేస్తున్నారు.. ఆ చిన్నారి హత్యాచారం గాని మరో దారుణం గానీ అంతగా ప్రాధాన్యతకు నోచుకోలేదు.. అయితే ఇది మొదటి సారి కాదు. సినిమా వాళ్ళ ఇష్యూ ఉన్నప్పుడు మీడియా సంస్థలు నిజంగానే ఇతర వార్తలను పక్కకు పడేస్తున్నాయి.. ఇదేం పద్దతి ఛానల్స్ వాళ్లకు జనం గోడు పట్టదా? ఎంతసేపూ ఆ సినిమా వాళ్ళ గోలేనా అని సోషల్ మీడియాలో రాసుకుని ఆవేశపడిపోతుంటాం... అయితే దీనికి కారణం ఏంటి? మీడియా ఇలా ఎందుకు చేస్తోంది? మీడియాకు సామాన్యుడి బాధ పట్టదా అని  అంటే ఎందుకు పట్టదు జనం చూస్తున్నారు గనుకే ఆ వార్తలకు ప్రాధాన్యత పెరుగుతోందని అంటాను నేను. సుధీర్ఘకాలంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసిన అనుభవంతో చెబుతున్నా జనం అలాంటి వార్తలే చూస్తున్నారు.. సినిమావాళ్ళ వార్తలకే TRP వస్తోంది ఇది నిజంగా నిజం. వారం వారం రేటింగ్ తీరు విశ్లేషస్తే సినిమా సంబంధిత వార్తలకే ఎక్కువ రేటింగ్ వస్తోంది. మినిట్ టు మినిట్ రేటింగ్ చూస్తే సినిమా క్లిప్పింగ్ తో ఒక్క నిమిషం వార్త నడిచినా దానికే రేటింగ్ వస్తోంది. పక్కా న్యూస్ ఛానెల్ లో సినిమా వార్తలు, సినిమా గాసిప్స్, సినిమా ట్రైలర్లు, కొత్త పాటల క్లిప్పింగ్స్ తో నడిచే కార్యక్రమాలు ఎందుకు ప్రసారం చేస్తున్నారు. జస్ట్ తమ TRP పెంచుకోవడానికే... ఇక హీరోలకు యాక్సిడెంట్ అయితే కళ్లప్పగించి చూసేయడం ప్రేక్షకులకు చాలా ఇష్టం.ఆ హీరోకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ముందు మీడియా పాయింట్ పెట్టి మరీ కవరేజ్ ఇస్తున్నారంటే వాళ్ళకేమన్నా పిచ్చా... కానేకాదు జనం విరగబడి చూస్తున్నారు గనుకే ఆ వార్తలను నడుపుతున్నారు.. విషయం ఏమీ లేకున్నా కురచబట్టలు వేసుకున్న ఓ ముద్దు గుమ్మ పిక్స్ తో గాసిప్ నడిపినా చొంగ కార్చుకుని చూసే ప్రేక్షకుడు ఇతర వార్తలు రాగానే ఛానల్ మార్చేస్తాడు.. ఇక ఇంట్లో భార్యాభర్తల పంచాయితీ, అక్రమ సంబంధాల వార్తలకు మంచి మైలేజీ వస్తోంది.. ఏ ఛానల్ కైనా TRP ముఖ్యం. అది ఉంటేనే యాడ్స్ వస్తాయి. నాకు తెలిసి ప్రజాసేవకోసం ఎవరూ ఛానల్ పెట్టలేదు, అది పక్కా వ్యాపారం. మరి వ్యాపారి అమ్ముడుపోయే సరుకు గురించే ఆలోచిస్తాడుగా... సో...చెప్పొచ్చేదేమంటే ఓహ్... అని బట్టలు చింపుకోవద్దు, కొనేవాళ్ళు ఉన్నంతకాలం ఇక్కడ డిమాండ్ ఉన్న సరుకునే అమ్ముతారు అంతే...

Sunday, 12 September 2021

ధూళి మొహం మీద లేదు

 

ధూళి మొహం మీద లేదు



DHOOL CHEHRE PE THI...

AUR MAI AYINA SAAF KARTA RAHA...

Aye Galib mai aap se sahemath nahi...

అవును నేను మహానీయుడు మీర్జా గాలిబ్ తో విభేదిస్తున్నా.. మొహం మీద ధూళి ఉంటే నేను అద్దాన్ని తుడుస్తూనే ఉన్నా అని ఒక కవితలో గాలిబ్ అంటారు. గాలిబ్ జీవితాన్ని, ఆయన రచనలను లోతుగా అధ్యయనం చేస్తే ఆ ధూళి ఆయన మొహం మీద కాదు అప్పటి సమాజమే ధూళితో కలుషితమై ఉందని తెలుస్తుంది. సమాజం ఇప్పటికీ అలానే ఉందనేది వేరే విషయం.. భావ ప్రపంచంలో మునిగితేలిన గాలిబ్ తన రచనల ద్వారా సమాజంపై సమరమే చేశారు. కరుడు గట్టిన మత చాందసవాదం, రాచరికం, పేదరికం, మనుషులు అనబడే వికృత జీవుల మోసం అన్నీ కలిసి ఒక మహాశక్తిలా మారి గాలిబ్ ను జీవితంలో ఓడించాయి. ఈ ఓటమిలో పుట్టిన నిర్వేదంతోనే ఆయన ధూళి తన మొహం మీద ఉంటే నేను అద్దాన్ని తుడుస్తూ ఉన్నా అని విరక్తిగా రాసుకున్నారు. ఆయన దృష్టిలో అద్దం అంటే సమాజం.. గాలిబ్ నాటి సమాజం నేటికీ ధూళితో కప్పబడే ఉంది.. అందుకే బలంగా నమ్ముతా నేను నా మొహంపై ఎలాంటి ధూళి లేదనీ... అద్దాన్నే తుడుస్తూ ఉండాలనీ..

అందమైన స్వప్నం

 

అందమైన స్వప్నం


మౌనముద్రను దాల్చిన

వెండి కడలి పొంగులా అవి...

లేక

పసిడి వర్ణం అద్దుకున్న సుందర జలాశయమా అది...

అదిగో రాలిపడుతున్న తారకల శిథిలాలు వెండి ముత్యాలై మెరుస్తున్నాయి...

పాలనురగ మెత్తని దూది పింజమై గొడుగు పడుతోంది చూడు

ఎంత మనోహర దృశ్యమిది...

భార రహితమైన నేను

మెరుపులు చిందే చంద్రవంక నావలో

ఎందుకున్నాను...

నా పయనానికి ఇది శ్రీకారమా

లేక చివరి మజిలీకి సంకేతమా...

ఏమో ఏదో లోకం వైపు

నాకు తెలియకనే జారిపోతున్నానేమో...

చందమామ కథలు

మదిని ఎక్కించుకున్న పర్యవసానమా ఇది

లేక

భావుకత హద్దులు దాటిన

చిత్రవిచిత్ర వైనమా...

స్వప్నలోక విహారిని కదా

ఉందో లేదో తెలియని గమ్యంవైపు సాగిపోతూనే ఉన్నాను...

ఉన్నదా ప్రభూ నీ దివ్యలోకం

చెదిరిపోతుందా

నా అందమైన స్వప్నం...

Sunday, 5 September 2021

భస్మీపటలం

 

భస్మీపటలం



వేయి అక్షౌహిణుల పదఘట్టనల గర్జనలతో

భస్మీపటలమవుతున్న

మస్తిష్క మైదానం...

బీటలువారి కుప్పకూలుతున్న

మనోశిఖరం...

ఎక్కడో ఒక చీకటిఖడ్గం

వెన్నెలమ్మ తలనరుకుతున్న హాహాకారం....

అదిగో నల్ల రంగు పులుముకున్న ఆకాశాన్ని వీడి

నేల రాలుతూ ప్రాణం విడుస్తున్న

ఓ నక్షత్ర శిథిలం...

ఏమిటీ అయోమయం

మనసు ఫలకంపై ఎందుకీ

అల్లకల్లోలం...