Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 2 October 2025

ఆహా హింస


ఆహా హింస

నీదేముంది పెద్దాయనా

అహింస అహింస అంటూ గొంతు చించుకున్నావ్...

ఎవరికి ఎక్కింది చెప్పు

ఎవరైనా అర్ధం చేసుకున్నారా...

హింసకు రెండు అక్షరాలు జోడించి

ఆహా హింస అంటూ

చెలరేగుతున్నారు అందరూ...

అహింస అంటూ నువ్వు ఎంత మొత్తుకున్నా పాపం హింసకే బలైపోయావుగా...

నువ్వెళ్ళిపోయాకనైనా

ఈ దేశం మారిందా చెప్పు...

సిద్ధాంతం అంటూ కొందరు

రాజ్యాధికారం కోసం కొందరు

రక రకాల కారణాలతో

అహింసకు పాతరేసి

ఆహా హింస అంటూ

చెలరిగిపోతున్నారే...

పరమత సహనం అంటూ మరో మాట చెప్పి పోయావ్

నీకేంటి ఎన్నైనా చెప్తావ్...

నీకు మాత్రం తెలియదా

శాంతి మంత్రం వల్లె వేసే ఈ మతాలన్నీ హింస నుంచే పుట్టినవి కావా...

జిహాద్ అని ఒకడు

ధర్మం కోసం మరొకడు

దేవుని రాజ్యం అంటూ ఇంకోడు

భాష వేరైనా

అందరూ నీ అహింసావాదాన్ని

నేలకేసి కొట్టి

ఆహా హింస అంటూ వికట్టహాసం చేయట్లేదా...

నువ్వు చెప్పావ్

నువ్వు పాటించావ్

అలా మేమూ చేస్తామని ఎలా అనుకున్నావ్ తాతయ్యా...

సరే జరిగిందేదో జరిగింది

మరు జన్మ అంటూ ఉంటే

మళ్ళీ అహింస అంటూ గొంతు చించుకోకు

ఆ గొంతే లేకుండా పోతుంది

జై హింస

జై జై హింస

ఆహా హింస

Tuesday, 9 September 2025

దేవుడు లేని లోకం

 

దేవుడు లేని లోకం

చిన్ని చిన్ని ఆశ

బలమైన ఆకాంక్షల సమరంలో ఊపిరులద్దుకున్న

ఓ స్వప్నం రెక్కలు విచ్చుకుంటోంది

దేవుడు లేని లోకంలో

విహరించాలనీ...

అందమైన తీయని పలుకుల పుస్తకాల మాటున పొంచి ఉన్న కసి కత్తులకు చిక్కకుండా ఎగిరిపోవాలనీ...

కల్పనలో తప్ప కానరాని దేవుడికోసం

దేవుడిలాంటి మనిషిని రాక్షసుడిగా మార్చిన

ఆ పుస్తకాల పేజీలో మగ్గిపోక

స్వచ్ఛమైన జగతిలో పాదం మోపాలనీ...

మనోనేత్రాలు శోధిస్తున్నాయ్

దేవుడు కాదు

దేవుడి లాంటి మనిషి ఎక్కడా అనీ...

మనసు రెక్కలు ఆరాటపడుతున్నాయ్ మనస్వినీ

దేవుడు లేని లోకంవైపు ఎగిరిపోవాలనీ...

Thursday, 15 August 2024

నిన్ను నువ్వు కాపాడుకో...

 

నిన్ను నువ్వు కాపాడుకో...

నాది శాంతి కాదు

నీది శాంతి కాదు

అదిగో వాడిదీ శాంతి కాదు...

నాది ఉన్మాదం

నీది అసహనం

వాడిది పన్నాగం...

కాగడా పెట్టి వెతికినా

భూతద్దంతో శోధించినా

ఏ మతంలోనూ శాంతి

కనిపించదు

అన్ని పుస్తకాలూ

రక్త చరిత్రకు దర్పణాలే...

ఇకనైనా మారు మనిశీ

మతం నీపై

ఉన్మాదమై

పంజా విసురుతోంది...

పారిపో

తప్పించుకో

ఉన్మాదపు కోరలనుంచి

నిన్ను నువ్వు కాపాడుకో...

 

Monday, 18 March 2024

పాపం దేవుడు

 

పాపం దేవుడు

దేవుడంటే భయం లేదు నాకు...

దేవుడిని సృష్టించిన మనుషులు

దేవుడిని విభజించిన

భక్తులు

వీరంటేనే ఎంతో భయం నాకు....

ఒకడంటాడు

నాదేవుడే గొప్పని

మరొకడంటాడు

నాదేవుడే శక్తిమంతుడని...

కులాలవారిగా

మతాలవారిగా

దేవుడిని పంచేసుకుంటూ

దేశాలకే దేవుడిని

పరిమితం చేసిన

ఈ మహా భక్తులంటేనే

భయం నాకు...

ఉన్నాడో లేడో తిలియదు గానీ

ఉంటే గింటే

మనుషుల పంపకాల మధ్య విలవిలలాడుతున్న

దేవుడంటే

పాపం

ఎంతో సానుభూతి నాకు...

Monday, 9 October 2023

కొట్టుకుపోతున్నా

 

కొట్టుకుపోతున్నా

ఒక గమ్యం వైపే నడుస్తున్నా

ఒక లక్ష్యం నిర్దేశించుకున్నా

మనసుకు పగ్గాలేసుకున్నా

అలా కాదు

ఇలా నడవాలని

నాకు నేను మార్గం చూపుతున్నా

అలా కాదు

ఇలా ఆలోచించమని

మనసుకు పాఠాలు నేర్పుతూనే ఉన్నా

అదేంటో గానీ

అన్నీ మరిచిపోయి

కాలమనే ప్రవాహంలో

కొట్టుకుపోతూనే ఉన్నా...

Wednesday, 6 September 2023

కరిగిపోని శిలాక్షరాన్ని

 

 

కరిగిపోని శిలాక్షరాన్ని

మమతలు కురిపించే

మనసులో

నేను మమతల వెల్లువనే...

లెక్కలు వేసుకునే మెదడులో

నేను సైతాను రాజునే...

మనసు మమతలు కురిపిస్తే

మెదడు కొలమానాలు

చూస్తూ ఉంటుంది...

అలా ఎలా

మరిచిపోతుంది

నన్ను ఈ లోకం...

కాలంపై గీసిన

పిచ్చి గీతను కాను

కాలం అందంగా రాసుకున్న చెదిరిపోని

కరిగిపోని

శిలాక్షరాన్ని నేను...

Monday, 27 February 2023

ఇది విరామం మాత్రమే

 

ఇది విరామం మాత్రమే

నా అక్షరాలు అయిపోయాయని అనుకోవద్దు...

నా భావ ప్రపంచం

కుప్పకూలిందని

అంచనాలు వేసుకోవద్దు...

నేను మారలేదు

నా అక్షరాలూ మారలేదు...

కరుడు గట్టిన గుండెలో

అక్షరాలు మరింత పదును తేలుతున్నాయి...

ఎరుపెక్కిన నా మానసం

అగ్నికణంలా జ్వలించే

అక్షరాలకు ప్రాణం

పోస్తూనే ఉంది...

ఇది విరామమే గానీ

ముగింపు కాదు...

నా అక్షరం

నాతో పయనిస్తూనే ఉంది...

Sunday, 17 July 2022

పిచ్చివాడినైతే ఎంతబాగుండేది

 

పిచ్చివాడినైతే ఎంతబాగుండేది

కన్నుల నుంచి జారి పడిన స్వప్నాలను ఏరుకోలేను...

కనురెప్పల లోగిలిలో

మరో స్వప్నం నాటుకోలేను...

మోడుబారిన మనోవనంలో మరో అంకురం కోసం ఆరాటపడలేను...

ముళ్లబాట నాదారిలో

పూరెమ్మలు జల్లుకోలేను...

చీకటి పయనంలో

చిరుదీపమై వెలగలేను...

ఎగసిపడే హృదయానికి మత్తుమందు ఇవ్వలేను...

ఎంతబాగుండేది

నేను గతాన్ని పూర్తిగా మరిచిపోతే...

మాయామనుషుల లోకంలో అన్నీ మరిచి

పిచ్చివాడిగా మిగిలిపోతే ఎంత బాగుండేది...

Sunday, 10 July 2022

ప్రపంచమా ఉలిక్కిపడు

 

ప్రపంచమా ఉలిక్కిపడు

తిరుగుబాటు ఒక స్వప్నమనీ

ప్రజాగ్రహం ఇక రానే రాదనీ

విప్లవం పుస్తకాలకే పరిమితమనీ

వ్యక్తిపూజ శిరోధార్యమని

మత్తులోపడి మునిగిపోయిన యువతరమా ఉలిక్కిపడు

లంకేయుల సమరనాదం ప్రపంచాన్ని వణికిస్తోంది

కడుపు మండితే

జెండాలు ఎజెండాలు లేకున్నా తిరుగుబాటు తప్పదని పిడికిలి బిగిస్తోంది

ఏ నాయకుడు లేకున్నా తనే నాయకుడై నిలుస్తోంది

ఏ జెండా ఎగురకున్నా

లంకేషుడి జెండా తలదించుకున్నది

లంకేయుల స్పూర్తి

జగతికి దీపమై వెలుగుతోంది...

నిశిని జయించిన శశిని

నిశిని జయించిన శశిని

నన్ను నేను ప్రేమించినంత కాలం...

నాకు నేను నచ్చినంత కాలం...

నా నడత మీద నాకు నమ్మకం ఉన్నంత కాలం...

నా ప్రశాంతతను భగ్నం చేసే దమ్ము ఎవరికీ...

సదా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటా

నిశిని జయించే శశిలా...


Tuesday, 5 July 2022

సమయాన్ని దోచుకుంటా

 

సమయాన్ని దోచుకుంటా



ఓ సమయమా

నువ్వెంత వేగంగా పయనించినా

ఎన్ని ఎత్తు పల్లాలు రుచి చూపినా

జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పినా

ఎన్ని ముళ్ళు గుండెలో గుచ్చినా

నీనుంచి అప్పుడప్పుడూ

మధురక్షణాలు దోచుకుంటూనే ఉంటా

నీ గాంభీర్యానికి చిరునవ్వులు అద్దుతూనే ఉంటా

నీ వేగానికి కళ్లెం వేస్తూనే ఉంటా

ఎందుకంటే నేను ఆనందాల దొంగను

నిన్ను కొల్లగొడుతూనే ఉంటా...

Tuesday, 21 June 2022

పుష్ప రాజసం

 

పుష్ప రాజసం


పుష్ప విలాపమా

పుష్ప విలాసమా

ఏదైతేనేమి

వానదెబ్బకు రాలి కిందపడినా

చెదిరిపోలేదు పుష్ప రాజసం...

వాడిపోలేదు దాని సోయగం

(నా తోటలో వర్షానికి కిందపడిన పువ్వులను ఇలా మొబైల్ లో క్లిక్ చేసా )

Monday, 20 June 2022

భ్రమరాన్ని కాను

 

భ్రమరాన్ని కాను



భ్రమరాన్ని కాను

విరిసిన ప్రతి పువ్వునూ కొరుకోను...

పోకిరి మేఘాన్ని కానే కాను

ఎక్కడ పడితే అక్కడ కురిసిపోను...

నన్ను నమ్మి నన్ను మెచ్చినది కాగితం పువ్వైనా

పరిమళాలు అద్దకుండా ఉండలేను...

ఆర్తిగా చేతులు చాచి ఆప్యాయ్యంగా చూసిన పుడమిపై

చినుకులా రాలకుండా ఉండలేను...

Saturday, 4 June 2022

నా మౌనం...

 

నా మౌనం...


 

నిన్ను ఓడించాలంటే

కుట్రలూ కుతంత్రాలు

చేయాల్సిన అవసరం లేదు...

అబద్ధాలతో చందమామ కథలు చెప్పాల్సిన పనిలేదు...

సానుభూతికోసం రానే రాని కన్నీటి బొట్టును రాల్చాల్సిన ఖర్మ పట్టనేలేదు...

ఎందుకు పోరాడాలి నీతో

నా మౌనం నిన్ను ప్రతి క్షణం

ఓడిస్తూనే ఉంటే...

Saturday, 28 May 2022

సైకత శిల్పాన్ని కాదు

 

సైకత శిల్పాన్ని కాదు



ఓ పిచ్చి కెరటమా

అలవోకగా నన్ను అల్లుకుని

ముంచిపోదామని అనుకున్నావేమో...

మునిగేందుకు శిలజాన్ని కాదు

కరిగేందుకు సైకత శిల్పాన్ని కాదు

ఆ సముద్రమంత లోతును మనసులో నింపుకున్న నేను

అవసరమైతే ఒక సునామినే...

నా ఒక్క అడుగు చాలదా నిన్ను

నా పాదాక్రాంతం చేసేందుకు...

Wednesday, 25 May 2022

అంకురం

 

అంకురం


వీలు కుదిరితే

వెనకకు పయనించాలని ఉంది...

కాలమనే కోటను చేధించి నా గతాన్ని తస్కరించాలని ఉంది

కనురెప్పల నుంచి జారిపడిన స్వప్నాలను

మళ్ళీ మనసునిండా దాచుకోవాలని ఉంది...

కాల గ్రంధంలో ఒక్కో పుటను తనిఖీ చేసి

మధురజ్ఞాపకాలను

సంగ్రహించాలని ఉంది...

వీలు కుదిరితే కాలాన్ని నిలిపేసి

నవజీవన అంకురానికి ప్రాణం పోయాలని ఉంది...

Saturday, 21 May 2022

ఉప్పెన

 

ఉప్పెన



వసంతం కురుస్తోంది

కురిసిపోనీ అనుకున్నా

ఉప్పెన ముంచుకొచ్చిందని

మునిగేదాకా తెలుసుకోలేకపోయా...

రాజమర్గమే కదా అని

నడక సాగిస్తూనే ఉన్నా

అడుగులు తడబడేదాకా

దారితప్పిన బాటసారినని తెలుసుకోలేకపోయా..

Tuesday, 10 May 2022

ఛల్కా హై జామ్... జిందగీకే నామ్...

 

ఛల్కా హై జామ్...

జిందగీకే నామ్...

బహారో ఫూల్ బర్సావో... మేరా మహబూబ్ ఆయాహయ్... మహమ్మద్ రఫీ తీయని స్వరం నుంచి మంద్రంగా జాలువారుతున్న గీతం.. టీవి తెరపై అరమోడ్పు కన్నులతో మత్తును వెదజల్లుతున్న వైజయంతీమాల ముగ్ధ  మనోహర రూపం... మా పెదాలను తాకుతున్న మధువు ను మించిన మైకం ఆ కన్నులలో నిండి ఉన్న అనుభూతి... అంతలోనే అదే గాత్రం మధురసాలను వీడి విషాదం కురిపించింది... మనసున్న మనిషి భగ్న హృదయుడే కదా ఖుష్ రహే తూ సదా యే దువా హై మేరీ అంటూ మోసం చేసిన మనసునే దీవిస్తూ రెండో పెగ్గు అందుకున్నా భారమైన మనసును తేలిక పరుస్తూ... అంతలోనే ఓ బంగరు రంగుల చిలకా అంటూ బాలు గారి స్వరం వాతావరణంలో గిలిగింతలు నింపింది.. మేము ఊరుకుంటామా ఓ దమ్ము వెలిగించి శృతి కలిపాం ఎవరేమనుకున్నా చల్తా అనుకుంటూ... మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలైన మా మహేఫిల్ సాయంత్రం దాకా సాగింది....మా Anil Kumar వివాహమై ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక అపురూప సన్నివేశానికి ప్రాణం పోసాం.. మధ్య మధ్యలో రాజకీయాలు, చిన్న నాటి కహానీలు, యవ్వన ఫాంటసీలు ఒకటేమిటి మొత్తం జీవితం కనులముందు కదలాడింది మా కబుర్లలో.. అంతలోనే మా పోలీస్ ఫ్రెండ్ నవీన్ కుమార్ గుర్తుకు వచ్చాడు. ఫోన్ చేయగానే వచ్చి వాలాడు తన బిజీ షెడ్యూల్ ఉన్నా... పనిలో పని యాపిల్ ఫ్లేవర్ హుక్కా కూడా లాగించా... ఒక ఆత్మీయ ఘట్టానికి ప్రాణం పోసిన అనిల్ కి థాంక్యూ తో బన్తా హై.. షుక్రియా దోస్త్ జీవితాన్ని మరో మారు పరిచయం చేసినందుకు 🙏

Tuesday, 19 April 2022

గులాబీ ముసుగులు

 

గులాబీ ముసుగులు


హృదయసీమలో మొలకలు వేసిన ప్రశ్నలు

విచ్చుకత్తులై నాట్యమాడుతున్నాయ్

ఎన్నటికీ దొరకని నగ్న సమాధానాలను

శోధిస్తూ...

గాయం చేసిన ముళ్ళు

గులాబీ ముసుగులతో నటనలాడుతున్నాయ్

లేని పరిమళాలను వెదజల్లుతూ...

Friday, 8 April 2022

సర్వం నేను

సర్వం నేను


నిశి రాత్రిని నేను

నిశిలో మెరిసే శశినీ నేను...

జాలువారే వెన్నెల నేను

పసిడివెన్నెలను ఈదే చకోరం నేను...

నులి వెచ్చని ఉషోదయం నేను

సెగలు పుట్టించే వేసవి తాపం నేను...

కురిసే వానను నేను

మురిసే మట్టివాసనను నేను...

సమస్త విశ్వానికి ఉనికిని నేను

నేను కన్ను మూస్తే

                                       ప్రకృతి సర్వం శూన్యం...