Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 2 October 2025

ఆహా హింస


ఆహా హింస

నీదేముంది పెద్దాయనా

అహింస అహింస అంటూ గొంతు చించుకున్నావ్...

ఎవరికి ఎక్కింది చెప్పు

ఎవరైనా అర్ధం చేసుకున్నారా...

హింసకు రెండు అక్షరాలు జోడించి

ఆహా హింస అంటూ

చెలరేగుతున్నారు అందరూ...

అహింస అంటూ నువ్వు ఎంత మొత్తుకున్నా పాపం హింసకే బలైపోయావుగా...

నువ్వెళ్ళిపోయాకనైనా

ఈ దేశం మారిందా చెప్పు...

సిద్ధాంతం అంటూ కొందరు

రాజ్యాధికారం కోసం కొందరు

రక రకాల కారణాలతో

అహింసకు పాతరేసి

ఆహా హింస అంటూ

చెలరిగిపోతున్నారే...

పరమత సహనం అంటూ మరో మాట చెప్పి పోయావ్

నీకేంటి ఎన్నైనా చెప్తావ్...

నీకు మాత్రం తెలియదా

శాంతి మంత్రం వల్లె వేసే ఈ మతాలన్నీ హింస నుంచే పుట్టినవి కావా...

జిహాద్ అని ఒకడు

ధర్మం కోసం మరొకడు

దేవుని రాజ్యం అంటూ ఇంకోడు

భాష వేరైనా

అందరూ నీ అహింసావాదాన్ని

నేలకేసి కొట్టి

ఆహా హింస అంటూ వికట్టహాసం చేయట్లేదా...

నువ్వు చెప్పావ్

నువ్వు పాటించావ్

అలా మేమూ చేస్తామని ఎలా అనుకున్నావ్ తాతయ్యా...

సరే జరిగిందేదో జరిగింది

మరు జన్మ అంటూ ఉంటే

మళ్ళీ అహింస అంటూ గొంతు చించుకోకు

ఆ గొంతే లేకుండా పోతుంది

జై హింస

జై జై హింస

ఆహా హింస

Tuesday, 9 September 2025

దేవుడు లేని లోకం

 

దేవుడు లేని లోకం

చిన్ని చిన్ని ఆశ

బలమైన ఆకాంక్షల సమరంలో ఊపిరులద్దుకున్న

ఓ స్వప్నం రెక్కలు విచ్చుకుంటోంది

దేవుడు లేని లోకంలో

విహరించాలనీ...

అందమైన తీయని పలుకుల పుస్తకాల మాటున పొంచి ఉన్న కసి కత్తులకు చిక్కకుండా ఎగిరిపోవాలనీ...

కల్పనలో తప్ప కానరాని దేవుడికోసం

దేవుడిలాంటి మనిషిని రాక్షసుడిగా మార్చిన

ఆ పుస్తకాల పేజీలో మగ్గిపోక

స్వచ్ఛమైన జగతిలో పాదం మోపాలనీ...

మనోనేత్రాలు శోధిస్తున్నాయ్

దేవుడు కాదు

దేవుడి లాంటి మనిషి ఎక్కడా అనీ...

మనసు రెక్కలు ఆరాటపడుతున్నాయ్ మనస్వినీ

దేవుడు లేని లోకంవైపు ఎగిరిపోవాలనీ...