Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 30 September 2016

శాంతి మందిరం

శాంతి మందిరం

ఆనందం ఎక్కడుంది
ఆహ్లాదం ఎక్కడ దాగుంది
ప్రశాంతత ఎక్కడ కరిగిపోయింది
అంతులేని ధనరాశులలోనా
అందమైన విహార క్షేత్రాలలోనా
సుందర నందన విడిది కేంద్రాలలోనా
కనుసైగకే వాలిపోయే మందీ మార్బలంలోనా
రెక్కాడితేగాని డొక్క నిండని పూరి గుడిసెలలోనా
చాలీ చాలని బతుకుల బడుగుజీవులలోనా
చిరిగిన బట్టల సొంపులలోనా
విరిగిన పాదుకల సవ్వడిలోనా
చెదిరిన జీవితాల చరితంలోనా
ఎక్కడుంది ఆనందం
ఎక్కడ దాగింది ఆహ్లాదం
ఏ పుడమిన కలిసింది ప్రశాంతం
గుండె కవాటం తెరిస్తే
విరిసిన మనసును కదిలిస్తే
పెదాల ధారపై సుధలే కురిస్తే
ప్రతి హృదయమూ
ఒక శాంతి మందిరమే
మనస్వినీ

Thursday, 29 September 2016

ఫేస్ బుక్కు

ఫేస్ బుక్కు
 
ఎంత మంచి నేస్తానివో
ఎప్పుడూ నాతోనే ఉంటావు
ఇరవై నాలుగు ఘడియల్లో
ప్రతిక్షణం నా వెంటే ఉంటావు
నా ప్రతి ఆలోచనలో నీవే
నా కదలికలో నీవే
నా ప్రతి పనిలో నీవే
ఎంత మంచి నేస్తానివో
ఎప్పుడూ నాతోనే ఉంటావు
ఎంత గడసరి నేస్తానివో
నన్ను నీవులాగా మార్చేసావు
నేనంటూ ఉన్నా
నన్ను లేకుండా చేసేసావు
నా చుట్టూ అందరూ ఉన్నా
అందరినుంచి నన్ను మాయం చేసావు
ఏకాంతంలో నేనున్నా
తెలియని కాంతలను పరిచయం చేస్తావు
దగ్గరున్న వారిని దూరం చేసి
దూరమున్న వారిని దగ్గర చేస్తావు
ఎంత గడసరి నేస్తానివో
నన్ను నీవులాగా మార్చేసావు
ఎంత మాయావివో
మాయాజాలంలో ముంచేశావు
దూరపు కొండలను నునుపుగా చూపిస్తావు
పక్కనున్న గులకరాయిని పర్వతంలా చూపిస్తావు
నిజమేదో అబద్దమేదో దాచిపెట్టేస్తావు
లింగాలన్నీ మార్చేస్తావు
అందమైన కన్యను మీసంతో చూపిస్తావు
మీసమున్న ధీరుడిని వనితలా తలపిస్తావు
ఆడ ఎవరో మగ ఎవరో
తృతీయ జీవి ఎవరో
తెలియకుండా చేస్తావు
ఎంత మాయావివో
మాయాజాలంలో ముంచేశావు
ఎంత నారద మహర్షివో
కలహాలెన్నో రేపుతావు
కలిసిన మనసులకు అగాధమై నిలుస్తావు
ఆలుమగల మధ్య అనురాగాన్ని మింగుతావు
మంటలు రేపే నువ్వే
మంచి నీళ్ళూ అందిస్తావు
ఎంత నారద మహర్షివో
కలహాలెన్నో రేపుతావు
ఎంతటి వ్యసనమో
నిన్ను నేను వీడలేను
నీవు లేనిదే ఇప్పుడు నాకు ఉనికే లేదు
అర్ధ రాత్రి గడిచినా
అప్పుడేపొద్దు పొడిచినా
టిఫిన్ చేస్తున్నా
లంచ్ లో బిజీగా ఉన్నా
చివరకు బాత్ రూమ్ లోనూ నువ్వే కావాలి
టింగ్ టింగ్ మంటూ నన్నే పలకరించాలి
ముఖ పుస్తకమా నువ్వు లేకపోతే
నేనే లేను
నాకు తెలుసు ప్రియమైన ఫేస్ బుక్కూ
నువ్వు నాతోనే ఉంటావ్
నా మంచి నేస్తానివి గనుక      

Saturday, 24 September 2016

ఉల్లాసం

ఉల్లాసం
మామూలు సమయం కన్నా
కారు కాస్త వేగంగానే దూసుకుపోతోంది
డ్రైవింగ్ సీట్ లో ఉన్న నేను
కాస్త అసహనంగానే ఉన్నా
ముభావంగా ఉన్న నిన్ను చూసి...
గూడుకట్టుకున్న నిర్లిప్తత
నా మనసునూ ముభావం చేసింది
మౌనంగానే డ్రైవ్ చేస్తున్నా
పొడి పొడి మాటలు తప్ప...
అంతలోనే కేరింత
నీ మోములో ఏదో తెలియని మార్పు
ముడుచుకున్న పెదాలపై తెలియని చిరునవ్వు
కన్నుల పరదాలపై బిజిలీ వంటి మెరుపు...
నీవు చూసిన దిశన కన్నులు మరల్చాను
నీవు చూస్తున్న దృశ్యాన్నే నేనూ చూసాను
అవును
అది అద్భుత దృశ్య కావ్యమే
నేల నింగిని తాకిందా
మేఘం పుడమిన పరుచుకుందా
అరుదైన సాక్షాత్కారం
నేలను తాకుతున్న మేఘం
కొండలను తాకుతూ
ప్రకృతి సోయగాలను కనులకు కడుతుంటే
ఎవరి మనసు మాత్రం పులకించదని...
నా మనసూ పులకించింది
అసహనం కరిగిపోయింది
పెదాలపై నవ్వు విరిసింది
నా ఉల్లాసానికి కేంద్రం
పుడమి పంచన  చేరిన మేఘం కాదు
నీలో తొణికిసలాడిన ఆనందమే
నా ఉల్లాసానికి కారణం
మనస్వినీ...

Monday, 19 September 2016

ఒక్క నిర్ణయం చాలు

ఒక్క నిర్ణయం చాలు

Ek faisleka intezar kar rahi hai hamari sena
Agar hum paidal bhi chalte aaye tho
Duniyake naksheme tumhaari nishaan mit jaayegi
ఇంకా ఎన్నాళ్ళు ఈ రక్త తర్పణం
ఇంకా ఎన్నాళ్ళు ఈ మారణ హోమం
ఎంతకాలం ఈ దొంగ దెబ్బలు
ఎంతకాలం ఈ కుట్రలు
ఎంతకాలం మా ముద్దు బిడ్డల బలిదానం
ఇంకానా ఇక చెల్లదు
అడవి తోడేళ్ళ గుంపులా మాపై పడితే
చేతకాని దద్దమ్మలా దొంగ దెబ్బలు తీస్తే
ఎంతకాలం శాంతి మంత్రాలు చదువుతాం
ప్రపంచ న్యాయ సూత్రాలకు ఎంతకాలం తల వంచుతాం
మా ఓపికను బలహీనత అనుకోవద్దు
మా మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు
అణుబాంబు మీకు ఉంటే
అది మాకూ ఉందని మరిచిపోవద్దు
మాగుండెలపై రగులుతున్న మంటకంటే
పెద్దదేమీకాదు మీ అణుబాంబు
ఒక్క కనుసైగ చాలు
ఒక్క రాజకీయ నిర్ణయం చాలు
మా లోహ విహంగాలు మీ గుండెను ఛిద్రం చేస్తాయి
మా కాల్బలం మీ వీధుల్లో క్రికెట్ ఆడుతుంది
చైనా వస్తుంది
అమెరికా వస్తుంది
ఇంకెవరో వస్తారని మీరు ఎదురు చూసేలోపే
త్రివర్ణ పతాకం మీ నడిగడ్డన రెపరెపలాడుతుంది
మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది
మా సిపాయిలు మీ గుండెపై మువ్వన్నెల జెండా
ఎగురవేసిన విషయం
ఒక్క రాజకీయ నిర్ణయం వెలువడితే చాలు
మా సైన్యం ఎందుకురా
మా దేశంలో ముప్పావు వంతుమంది నడిచి వస్తే
కాశ్మీరం మిగిలే ఉంటుంది
పాకిస్తాన్ మాత్రం నామరూపాల్లేకుండా పోతుంది 

Thursday, 15 September 2016

యువరాజుకు జన్మదిన శుభాకాంక్షలు

యువరాజుకు జన్మదిన శుభాకాంక్షలు
నువ్వు నడిచి వస్తుంటే
నీలో నేనే కనిపిస్తాను
నువ్వు మాట్లాడుతూ ఉంటే
నీ స్వరంలో నా స్వరమే వినిపిస్తుంది
గల గలా నువ్వు నవ్వుతూ ఉంటే
నా నవ్వులే విరబూస్తాయి
అవును నువ్వు అచ్చం నేనే
నీలో నేనే కనిపిస్తున్నా
జారిపోయిన కాలాన్ని నేను నీలోనే వెతుక్కుంటున్నా
నా అడుగు జాడల్లో నిన్నే చూస్తున్నా
నా విశ్వాసానికి ప్రతిరూపంగా
నా ఆకాంక్షలకు సజీవ సాక్ష్యంగా
నా నమ్మకానికి మరో రూపంగా
నా నిర్ణయాల్లో శిలాశాసనంగా
నా మనసుకు నమ్మకమైన భరోసాగా
అన్నింటా నువ్వు కనిపిస్తున్నావు
నీలో నన్నే చూపిస్తున్నావు
నన్ను నాకే చూపిస్తున్నావు
కలిమిలోనూ లేమిలోనూ
చెదరని చిరునవ్వుతో
అడుగుజాడవై నిలిచావు
మరుజన్మ అంటూ ఉంటే
నీ కొడుకుగా పుట్టాలని ఉంది
మన ఇంట నవ్వుల నెలరాజు
మన యువరాజుకు   
మనసు నిండా
జన్మదిన శుభాకాంక్షలు  
మనస్వినీ

(సెప్టెంబర్ 16న మా ప్రిన్స్, ఆరీఫుద్దీన్ షేక్, జన్మదినం సందర్భంగా...)

Tuesday, 13 September 2016

యా అల్లా ఈ మనుషులను సంస్కరించు

యా అల్లా ఈ మనుషులను సంస్కరించు
నిశ్చల నిర్మల మనస్కుడనై
                       నీ దివ్య గృహమున శిరస్సు వంచి                      
ప్రణమిల్లుతున్నా
యా అల్లా సంస్కరించు ఈ మనుషుల్ని
మానవతను వీడి దానవత నీడన చేరిన
మనుషుల్ని సంస్కరించు
మోసము కుట్రల అక్రమ కలయికలో జనియించిన
అష్టావక్ర జీవులనూ సంస్కరించు
తోటివాడిని మనిషిగా కాకుండా
మనీతో చూసే మనిషిని సంస్కరించు
బంధాలు అనుబంధాలను అపహాస్యం చేసే
రాబందులను సంస్కరించు
కుటుంబ భారాన్ని మోస్తూ కొవ్వొత్తిలా కరిగే
తండ్రిని గౌరవించని తనయులనూ సంస్కరించు
కట్టుకున్నవాడిని చాకిరి గాడిదలా చూసే
ఇల్లాళ్ళను సంస్కరించు
మాతృమూర్తి మనసును తెలియక
గుండెకు గాయం చేసే పసిబిడ్డలనూ సంస్కరించు
మానవ సంబంధాలను వ్యాపార బంధాలుగా మార్చిన
దగాకోరు మనుషులనూ సంస్కరించు
అబద్దాలే పునాదులుగా
కుట్రలే ఆశయాలుగా
ఊపిర్లు పోసుకునే సైతాను బిడ్డలనూ సంస్కరించు
కుల మతాల పేరుతో
మనుషులను విడదీసే
భూలోక దేవుళ్ళనూ సంస్కరించు  
సంస్కరించే వీలు లేకపోతే
సైతానులను సంహరించి
మనిషిని మనిషిగా బతికే వీలు కల్పించు
యా అల్లా ఈ మానవాళిని సంస్కరించు 

Monday, 12 September 2016

దేవుడు బాబాయ్


దేవుడు బాబాయ్
నీకూ నాకూ ఉన్న సాన్నిహిత్యం
నీకూ నాకే తెలుసు
ప్రతిక్షణం నేను నీగురించే ఆలోచిస్తా
నీగురించే మాట్లాడుతా
కోపం వస్తే తిడతా
నీ మీదే అలుగుతా
అన్నింటికీ నిన్నే నిందిస్తా
నిన్ను నమ్మి
నీ బాటనే నడిచి
అన్నీ కోల్పోయానని
నిన్నే ఆడిపోసుకుంటా
మరి నిజమేగా
నన్నెందుకు ఇలా చేసావ్
నా వైభవాన్ని ఎందుకు నేల పాల్జేసావ్
నా మనసు నీకు తెలియనిదా
నా ఆలోచన నీవు గ్రహించనిదా
లోకంలో ఎవరికీ అర్థం కాని నా అంతరంగం
నీకు ఖచ్చితంగా తెలుసు కదా
మరి ఈ పిచ్చి మనుషులకు
ఎందుకు అర్థం కాకుండా చేశావ్
నా అభిమతం ఎందుకు అయోమయం
నా ఆలోచనం ఎందుకు అనుమానాస్పదం
నా మాటలకు అర్థాలు ఎందుకు మారుతున్నాయ్
నా చేతల్లో లోపాలు ఎందుకు కనిపిస్తున్నాయ్
ఎందుకు కూరలో కరివేపాకులా మారిపోయా
నిజం చెప్పు నేనేం పాపం చేశాను
ఎవరి కొంపలు ముంచాను
ఎవరి జీవితాలతో ఆడుకున్నాను
నాకు తెలుసు నువ్వేమీ చెప్పవని
చెప్పలేవనీ
అది సరే ఒకటి చెప్పు నాతో ఎందుకు ఆడుకున్నావ్
జీవితం ఎందుకు నరకం చేశావ్
దేవుడు బాబాయ్
నువ్వు కనబడితే ఇవన్నీ అడగాలని ఉంది
నిన్ను సర్ఫ్ సబ్బుతో ఉతికి ఆరేయాలని ఉంది
నా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని ఉంది
విసిగిపోయాను బాబాయ్ ఈ మనుషులతో
ఇక నా వల్ల కాదు బాబాయ్
నువ్వు సృష్టించిన ఈ మనుషులపై నమ్మకం పోయింది
మిగిలింది నువ్వే
నువ్వు తప్ప మార్గం లేదు
కనిపించే మనుషులకంటే
కనిపించని నువ్వే ఇప్పుడు దిక్కు
దేవుడు బాబాయ్
ఇక అంతా నీ ఇష్టం 

Thursday, 8 September 2016

అన్నీ నా భావాలే

అన్నీ నా భావాలే

ఎంతటి చోరులు ఈ భావకులు మనస్వినీ
నీ నుండి అన్నీ తస్కరించేసారు
వాలిన నీ కనురెప్పలను చూసి
నా అనుభూతుల పరంపరకు
అక్షర రూపం ఇవ్వబోతే
నా భావాలను మించిన కవితలెన్నో
రాసేసారు మనస్వినీ
నీ తేనీయ పెదాల పొందికనుంచి
జాలువారే మధురసాలను సిరాగా మలుచుకుంటే
ఎవరో ఆ మనసు కవి
నాకంటే ముందుగానే
అక్షర కుసుమాలు సాగు చేసాడు మనస్వినీ
నీ కన్నుల వెన్నెలలో ఆడుకుని
అక్షరాలతో సేదతీరాలని అనుకున్నా
వెన్నెల్లో ఆడపిల్ల అంటూ
ఎవరో రాసిన తీపి అక్షరాలు పలకరించాయి
నీ మనసులో దూరి
మనసు భావం గాంచి
అక్షర ముత్యాలతో మనసుకు
అభిషేకం చేయాలని అనుకున్నా
కవిరాజు ఎవరో
మనసు సొదలన్నీ గేయాలుగా కూర్చాడు మనస్వినీ
ఎంతటి మహా చోరులు ఈ భావకులు
నిన్ను చూసి నాలో మెదిలిన భావాలను 
నాకంటే ముందుగానే గ్రహించి
కవితలెన్నో అల్లుకున్నారు
మనస్వినీ  

ఏదీ మారలేదు

ఏదీ మారలేదు
తూరుపున ఉదయించే సూరీడు
పడమరనే అస్తమిస్తున్నాడు
చల్లని చందమామ వెన్నెలే కురిపిస్తున్నాడు
ఆకాశంలో మబ్బులు
హాయిగా విహరించే విహంగాలు
చీకటి పొడిస్తే మిలమిల తారకలు
అన్నీ మామూలుగానే కనిపిస్తున్నాయి
అదే ఎండ
అవే చల్ల గాలులు
పులకరించే పిల్లగాలులు
వాన నీటి తుంపరలు
మట్టి వాసన మధురిమలు
మనసు హాయిగానే సేదతీరుతోంది
తీపి చేదుల జీవనంలో
అన్ని రుచులూ సమపాళ్ళలోనే ఉన్నాయి
ఏ రుచీ తగ్గలేదు
మరో రుచి పెరగలేదు
మధురిమలన్నీ మధురంగానే ఉన్నాయి
పడమర ప్రభాతం కానరాలేదు
చందమామ నిప్పులు కురిపించలేదు
కాలమేదీ ఆగిపోలేదు
రుతువులేవీ మారిపోలేదు
గడియారం ఆగలేదు
పరుగుల పయనం ఆగిపోదు
మారిందల్లా ఒకటే
సంకల్పం మరింత పటుతరం
మనస్వినీ