Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 29 July 2018

స్వర్గపురి బాటలో

స్వర్గపురి బాటలో

నేను నడిచే దారిలో పువ్వులుంటేనేమీ
మత్తైన గుభాళింపులుంటేనేమీ
రంగురంగుల సీతాకొకచిలుకలు ఆడితేనేమీ
గులాబీ తోరణాల
స్వాగత ద్వారాలు కడితేనేమీ
నువ్వే లేకుంటే
పూలదారి కూడా రాళ్ళదారే
విరిసేపువ్వులూ కాగితం పుష్పాలే
నాతో ఇలాగే నడుస్తూ ఉండు
యమపురి మార్గమైనా
స్వర్గపురికే దారి చూపుతుంది

Sunday, 22 July 2018

నేను మరణిస్తే

నేను మరణిస్తే

నిన్న రాతిరి కలలో నేను చనిపోయా
నవారు మంచంపై నా దేహం అచేతనంగా పడి ఉంది
నా కుటుంబంలో రోదనలు ఆకాశానికి అంటుతున్నాయి
అదేంటోగానీ చనిపోయినా నేను అన్నీ చూస్తున్నా
నా కొడుకు గోడకు ఆని నిలబడి నన్నే చూస్తున్నాడు
తన కళ్ళు జలపుష్పాలై మెరుస్తున్నాయి...
నా ఛాతిమీద పడి నా గారాలపట్టి గుండెలు పగిలేలా ఏడుస్తోంది
బాబా లే అంటూ ...
నాకూ ఏడుపు తన్నుకు వస్తోంది కానీ కన్నీళ్ళే రావటం లేదు
మౌనంగానే అన్నీ చూస్తున్నా ...
అంతలోనే మా అమ్మాయి అరిచింది తన అన్న ను ఉద్దేశించి
అర్ఫూ తానియా మమ్మూ కు ఫోన్ చెయ్ ఆమె వస్తే డాడీ లేస్తాడనీ...
అవును కదా మనస్విని కానరాదేమీ అనుకుంటూ అటూ ఇటూ చూసా
కనీసం నాకూతురు నా మనసు తెలుసుకుందని లోలోన మురిసిపోతూ...
విషయం తెలిసినా తను రాలేదు ఎందుకనో అని మనసు పీకింది
నేనే ఫోన్ చేసి చెబుదామనుకున్నా కానీ నా ఫోన్ ఎక్కడుందో
నాకు దొరకలేదు
విషయం తెలిసిన మనస్విని గుండెకూడా ఆగిపోయిందేమోననే
కలవరంతో  మరణించిన నా గుండె వేగం పెరిగింది ...
అంతలోనే బయట ఏదో కలకలం
పెద్ద కారు ఒకటి వచ్చి ఆగింది
తెల్లని దుస్తులతో మెరుస్తూ కారులోనుంచి దిగాడు ఓ పెద్దమనిషి హడావిడి చేస్తూ
నోట్ల కట్టలు లెక్కిస్తూ అంతిమ యాత్రకు సన్నాహాలు చేస్తున్నాడు
షామియానాలు కుర్చీలకు డబ్బులు ఇస్తున్నాడు
ఈ మనిషినే కదా నేను బతికి ఉన్నప్పుడు పదివేల సహాయం అడిగింది
అది గుర్తుకు వచ్చి మనసు చివుక్కు మన్నది ...
ఇంతలోనే మరొకతను నా సమాధిని తవ్వేందుకు మనుషులను పురమాయిస్తున్నాడు
వందసార్లు ఫోన్ చేసినా స్పందించని ఈ మనిషికి
మరణించిన నాపై ఇంత అభిమానమా అని ఆశ్చర్యం వేసింది ...
ఎవరెవరో వస్తున్నారు
ఏదేదో మాట్లాడుతున్నారు
      నాతో తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు 
బతికి ఉన్నప్పుడు వీళ్ళంతా  నేనంటే మొహం చాటేసిన వాళ్ళే...
బంధువుల తాకిడి పెరిగింది
అందరూ ఏడుస్తున్నారు
నేను ఏడిస్తే అందరూ నవ్వినవాళ్ళే...
మరణిస్తే ఇంత అభిమానమా అని ఆశ్చర్యపడుతుండగా
నన్ను అందంగా ముస్తాబు చేశారు
అంతిమయాత్ర కోసం...

Friday, 13 July 2018

కరిగిపోయా కలిసిపోయా

కరిగిపోయా కలిసిపోయా

నా గురించి రాసుకునేందుకు ఏముందని
నా గురించి చెప్పుకునేందుకు
ఏం మిగిలిందని
నాలో నేనున్నానా అసలు
నా అక్షరాలు నా మాట వినక
తన వెంటే పరుగులు తీస్తాయి
ఆ మెడలో మాలై హత్తుకుందామని
నన్ను నేను వెతికితే
నేనేక్కడున్నా
అందమైన ముఖారవిందం నుదుటన బిందియానై సేద తీరుతున్నా
ఆ నవ్వుల గలగలలో నోటి ముత్యమై రాలిపడుతున్నా
ఆ కన్నుల వెన్నెలలో
నల్లని కాటుకనై కరిగిపోతున్నా
ఆ పద లయమంజీరాలలో
తీయని సవ్వడిలా వినిపిస్తున్నా
ఎక్కడని వెతకను నన్ను నేను
 
తన వలపు తలపుల తపనలో
ఎప్పుడో లీనమయ్యా....

Thursday, 12 July 2018

ప్రకృతి కాంతవా...

ప్రకృతి కాంతవా...

వెన్నెల ఆకాశం కరిగిపోయింది
మబ్బులు చూడు నల్లగా కమ్ముకున్నాయి
నీ నల్లని కురులు ఆరబోసినట్లు...
వెన్నెల కురిసే దాఖలాలు లేవు
వానచినుకులు రాలుతున్నాయి
ఆ మామిడాకులమీద నీటి చుక్కలు చూడు
నీ నవ్వుల ముత్యాలు రాలిపడినట్లు ...
చల్లని గాలి అలవోలె అల్లుకున్నది
తుంటరి గాలి కొంటెదనం చూడు
నువ్వు కన్నుగీటి గిలిగింతలు పెడుతున్నట్లు ...
మానవ కాంతవా
ప్రకృతి కాంతవా
తెలియదుగానీ
పూచే పువ్వులో
మెరిసే వాన చినుకులో
వీచే గాలిలో
అన్నింటా నీ నవ్వే చూస్తున్నా
మనస్వినీ...

Monday, 9 July 2018

నేనెక్కడున్నా

నేనెక్కడున్నా 

ఎందుకు ఇంతగా నన్ను కొల్లగొట్టావ్
నాలో నుంచి నన్ను పూర్తిగా దోచేసావ్
నా కన్నీటిని మాయం చేసావ్
నా చిరునవ్వునూ లాగేసుకున్నావ్
నా శ్వాసను ఆక్రమించేసావ్
ఇప్పుడు చూడు ఏమయ్యిందో
నువ్వు నవ్వితేనే నవ్వుతున్నా
నువ్వు ఏడిస్తే నేనూ ఏడుస్తున్నా
నీ శ్వాసే అరువుగా ఊపిరి తీస్తున్నా
ఇప్పుడు నేను అనే నేను ఎక్కడున్నా
నేను నీలో కలిసిపోయానా
నన్ను నీలో కలుపుకున్నావా
మనస్వినీ 

Saturday, 7 July 2018

అడుగు జాడలుగా...

అడుగు జాడలుగా...
నేనడుగులు ముందుకు వేస్తే
నీ అడుగుల నన్ను అనుసరిస్తూ
నీ అడుగులు ముందుకు నడిస్తే
నా అడుగులు నీ జాడలను
ముద్దాడుతూ
ఎవరు ముందడుగు వేస్తేనేమి
అడుగులు జాడలను వెతుకుతూనే ఉంటాయి
నువ్వు ముందున్నావా
నేను ముందున్నానా అని కాదు
సముద్ర తీరాన
ఇసుక కాన్వాసుపై
మన ప్రతిబింబాలు నీటి పరదాలలో సేద తీరూతూ
మనం ఒకటే అని
చెప్పకనే చెబుతున్నాయి కదూ
మనస్వినీ