Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, 17 November 2015

నాతో స్నేహం చేస్తావా

నాతో స్నేహం చేస్తావా
                                                        

అన్నింటికీ మూలం నీవే
ప్రతి చర్యకూ కారణం నీవే
ప్రతి క్షణమూ నీవే
ప్రతి ఘడియా నీవే
దశవూ నీవే
దిశవూ నీవే
నా కంటి కొలనులో నీవు
పెదాలపై చిరునవ్వూ నీవే
నా వేదనలో
నా రోదనలో
నా లాస్యంలో
నా రౌద్రంలో నీవే
నా విజయంలోనూ
పరాజయంలోనూ నీవే
నీ ఆలోచనలే అమలు పరిచావు
అనుకున్నదే చేశావు
నీ కనుసైగలనే అడుగులుగా
నీ ఆలోచనలనే జాడలుగా
నీ అంతరంగాన్నే
నా జీవనంగా మలిచావు
నీ ఆటలో పావునే నేను
నీ క్రీడలో బొమ్మనే నేను
ఆడుకోవాలనే నీకుంటే
మనసెందుకు ఇచ్చావు
నాలో ఆలోచనలను ఎందుకు రేపావు
భావాలను ఎందుకు చిగురింపజేశావు
కష్టాలు ఎందుకు ఇచ్చావు
కన్నీళ్లను ఎందుకు మిగిల్చావు
ఎవరికి చెప్పుకోవాలి నేను
ఎవరితో పంచుకోవాలి నేను
ఎవరు అర్ధం చేసుకుంటారు నన్ను
ఎవరికి తెలిసేను నేను
ఎవరు తట్టిలేపేరు నన్ను
అందరూ నీ ఆటలో బొమ్మలే
అందరూ నీ చదరంగంలో పావులే
అయినా చెప్పుకోవాలని ఉంది
గుండె విప్పాలని ఉంది
అన్నీ నీకే తెలిసినా
అన్నీ నీవే చేస్తున్నా
నీ ముందే మనసు పరచాలని ఉంది
నిన్నే అడగాలని ఉంది
నిన్నే నిలదీయాలని ఉంది
నీముందే విలపించాలని ఉంది
నీ సహాయమే కోరాలని ఉంది
నువ్వే వస్తావా
నన్నే రమ్మని కబురు చేస్తావా
అంతర్యామివి నువ్వు
అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి
నాకు ఆసరా ఇవ్వు
నాకు భరోసా కల్పించు
ఇలలో విసిగిన మనసుకు
కలోనైనా ఊరటనివ్వు
ఎక్కడో ఉండి ఎందుకు ఆటలు
నాముందుకు దిగిరా
తొలినాటి నుంచి నిన్ను తూలనాడిన నేను
నిజం తెలిసి
గమ్యం ఎరిగి
నిన్నే స్నేహంగా మలుచుకున్నా
భగవాన్
నాతో స్నేహం చేస్తావా
నాకిప్పుడు
దేవుడితో స్నేహం చేయాలని ఉంది
మనస్వినీ

Monday, 16 November 2015

గాలికి గాయమా


గాలికి గాయమా

తూరుపున ఉదయించే
సూర్యుడిని కాను
పడమటి దిక్కున
అస్తమించను
పాలవెన్నెల కురిపించే
నెలవంకను కాను
కరి మబ్బుల కౌగిట
బంధీని కాను
విరబూసే వసంతాన్ని కాను
రాలే ఆకులకు తలవంచను
కొండలను కోనలను తాకే
పవనమే నా మానసం
అన్ని కాలాల్లో
అన్ని రుతువులను తట్టుకుని
వికసించే పుష్పం
నా అనురాగం
ఉదయభానుడికి అస్తమం తప్పదు
నెలరాజు చీకటి గుహకు బంధీ కాకపోడు
ఆకులు రాలుతాయ్
పువ్వులూ వాడిపోతాయ్
స్వచ్ఛమైన పవనం
నా ప్రణయం
గాలికి గాయం చేసే ముళ్ళు
ఇంకా పుట్టనే లేదు
మనస్వినీ

Saturday, 14 November 2015

దేవుడి గుండె పగులుతుంది

దేవుడి గుండె పగులుతుంది

ఎక్కడో దూరాన కొలువై ఉన్నావు
ఇక్కడ మా తలరాతలు రాసేస్తున్నావు
నీకేం తెలుసు ఇక్కడి వెతలు
గుండెలు పిండే బాధలు
ఎన్నడైనా చూసావా
ఎప్పుడైనా వచ్చావా
అన్నీ సరిగ్గానే చేస్తున్నా అనుకుని
ఏదేదో చేసేస్తావు
నువ్వు చేసేదే నిజమని
నీ రాతే న్యాయమని
అంతా నీ అధీనమని
నీకు తోచిందే చేసేస్తావు
నీ బాటలో నడిస్తే
నిన్నే నమ్ముకుంటే
కన్నీళ్ళే కానుకగా ఇస్తావు
నీ పేరు చెప్పుకుని
మేమే దైవాంశ సంభూతులమని
గోతులు తీసేవారికి
సలాములతో సత్కరిస్తావు
ఎన్నడైనా తొంగి చూసావా
మా గుండె లోతుల్లోకి
ఎప్పుడైనా విన్నావా
మా మనసు భావాలని
అంతులేని వేదనల్ని
ఎందుకు చూడవు
ఎందుకు కానవు
తప్పు నీలోనే వుంది
లోపం నీ దగ్గరే వుంది
ఎక్కడో కూర్చుని
ఇక్కడి వెతలను తెలుసుకోలేక
ఎక్కడలేని అవగాహన లోపంతో
పిచ్చి పిచ్చి నిర్ణయాలతో
అర్థం పర్థం లేని రాతలతో
మా బతుకులతో ఆడుకుంటున్నావు
దివిని వీడి ఒక్కసారి
భువికి దిగిరా
ప్రతి జీవినీ పలకరించు
ప్రతి మనసునూ తడిమి చూడు
నా ఆశ నిజమై
దేవుడు భూమండలం చేరితే
ఆ దేవుడి గుండె కూడా పగిలిపోతుంది
మనస్వినీ

Tuesday, 10 November 2015

గాజులసవ్వడి

గాజులసవ్వడి

నా మనసుతో చూడు
నా కన్నులతో వీక్షించు
నా చెవులతో ఆలకించు
నాలో నీవై నిండి
నేనే నువ్వై
నా ఆలోచన
నా అంతరంగం నీవై
ఒక్కసారి పరికించి చూడు
నీ కరకంకణములు
అలంకారప్రాయములు కానేకావు
నీ ముంజేతి గాజులు
అందం మాత్రమే కావు
వన్నె చిన్నెలతో
మెరుపుల జిలుగులతో
కాంతులీనే ఆ గాజులు
లయబద్దంగా చేసే గలగలలు
నాలో సరికొత్త భావాలకు బీజం వేయవా
హొయలు లయలకే భాష్యం పలుకుతూ
మయూరనడకలకే
పాఠం నేర్పుతూ
సుతారంగా నడిచే నీ అడుగులను అల్లుకున్న
అందియల సవ్వడి
నాలో భావుకతకు ప్రాణవాయువే కాదా
ఒకటేమిటి నీలోని అన్నీ
నా కవితలకు మూలమే కాదా
మనస్వినీ

Monday, 9 November 2015

హృదయాంజలి

హృదయాంజలి 

ఎగసిపడే కెరటానికి బంధం వేసావు
అల్లకల్లోల కడలిని
నిర్మలం చేసావు
నిశి వీధుల అడుగుల్లో
కాంతి రేఖలా నిలిచావు
అలసిన మార్గంలో
సత్తువ నింపావు
అందని జాబిలి అరచేతిలో రాకున్నా
పండు వెన్నెలనే కానుకగా ఇచ్చావు
ఎవరు నీవు
నీలో ఏముంది
ఎక్కడినుంచి వచ్చావు
నీ మనసు గుడిలో ప్రమిదను చేసావు
నా ఊపిరికి వెచ్చదనాన్ని అందించావు
కన్నీటి సుడులలో
గూడు కట్టుకున్నావు
నా పెదాల మెరుపువు
నీవయ్యావు
నా మాటలకు
తూటాగా పేలిపోయావు
శూన్యమనే బాటలో
వెలుగురేఖగా మిగిలావు
బంధానికి మనసును జత చేసి
అనుబంధంగా మిగిలావు
నీ మనసు వేదనను
నా మనసుకు లేపనంగా అద్దావు
మనసు భావమును చదివిన నేను
సర్వ బంధాలను వదిలి
జగతి బంధనాలను వీడి
నీ బాటలో జతగూడాను
నా అడుగులకు జాడవై నిలిచిన నీకు
నా ప్రతి అక్షరం ప్రణమిల్లుతోంది
ముద్దాడుతున్నాయి
నా అక్షరాకుసుమాలు
నీ మనసును
అందుకో
నా హృదయాంజలి
మనస్వినీ

Saturday, 7 November 2015

మనసు దర్పణం

మనసు దర్పణం

కనురెప్పల సరిహద్దుల్లో
ఘనీభవించిన నీటి చుక్కను
తరచి చూడు ఒక్కసారి
గాజుఫలకంలా మారిన బిందువులో
కథలు చెప్పే రంగులెన్నో
ఊసులు పలికే భావాలెన్నో
రంగు రంగులో ఒక భావం
ప్రతి భావంలో ఒక పరిమళం
ఉషస్సువేళ
సూరీడు కంటే ముందే
నీ తీయని పలకరింపుతో
శుభోదయం అంటుంది మనసు
చిరునవ్వులు చిందిస్తూ
నడియాడే నిన్ను గాంచి
పులకిస్తుంది జీవనం
అల్లరి పరుగులు
కొంటె నవ్వులు
పులకింతలు
తుళ్ళింతలు
ఎన్నెన్నో సరాగాలు
అదే మోము ముభావమైతే
అదే పలుకు అప్రియమైతే
మనసు మూలలో ఎక్కడో
ద్రవీభవించిన నీరు
కంటి మైదానం దాటి
సరిహద్దుల్లో నీటి చుక్కగా మారదా
కనిపించీ కనిపించని
కన్నీటి చుక్క
అద్దంలా మారి
నా మనసు వెతలకు
దర్పణం పట్టదా
మనస్వినీ

Thursday, 5 November 2015

మృతసంజీవని

మృతసంజీవని
రోజూ కురిపించే వెన్నెలను
చందమామ తనలోనే దాచుకున్నాడా
ప్రతిరాత్రి తనకు కష్టమెందుకని
వెన్నెలమ్మ పారిపోయిందా
ప్రతి ఉదయం పుడమిని పలకరించే సూరీడు
ఎన్నడైనా మొహం చాటేసాడా
చీకటమ్మ తనువును నిత్యం తాకే
వెలుతురు ఎప్పుడైనా అలిగిందా
గుండె లయలను నడిపే ఊపిరి
ఏ ఘడియనైనా శ్వాసపై మక్కువ వీడిందా
పువ్వుకు పరిమళమంటే
విసుగు ఉంటుందా
చల్లని నెలరాజుని నేనైతే
నన్ను అలుముకున్న వెన్నెలమ్మవు నీవు
నిశిరాతిరిని నేనైతే
నా వేగుచుక్కవే నీవు
ఊపిరి నేనైతే
నన్ను నడిపే శ్వాసవే నీవు
పువ్వును నేనైతే
విరజిమ్మే పరిమళం నీవు
కనులముందు నిత్యం నీవే ఉంటే
నీ పలుకులు నిత్యం వీనులను తాకుతుంటే
నాలో నవచైతన్యమే
నీ ఉనికి నాకు నిత్యం జీవన మంత్రమే
నీవే నాకు ప్రాణం
నీవు లేకపోతే అది మరణమే
మృతసంజీవనిపై
విసుగుపుడుతుందా
మనస్వినీ

Wednesday, 4 November 2015

అందాలరాశి

అందాలరాశిచీకటమ్మ పరువాలను దోచేసి
నల్లని కన్నులను చేసి
చందమామ వెన్నెలను దోసిటపట్టి
అందమైన మోమును కడిగి
సిగ్గులమొగ్గ గులాబీ రేకులను కోసి
పెదాల మెరుపులుగా అద్ది
మరుమల్లెల సోయగాలను
నఖములుగా తీర్చి దిద్ది
మేఘమాలికల మెరుపులను
మేని పరువాలుగా మలిచి
కోయిలమ్మ రాగాలను
కంఠములో కూర్చి
ఎంతో ఓపికగా మలిచాడు
ఆ దేవుడు నిన్ను
ప్రకృతి రమణీయతను
ఒంటి నిండా అలుముకున్న దేహం ముందు
సౌందర్య సాధనాలు
మెరిసే ఆభరణాలు
నవీన ఆలంకరణలు
దిగదుడుపే కాదా
మదినిండా రసికతను నింపుకుని
పనులన్నీ మానుకుని
నీ బొమ్మను తయారు చేసిన దేవుడికి
ప్రణమిల్లదా నా మనసు
అందానికే భాష్యం నేర్పే నీవు
ప్రకృతి ఒడిలో పెరిగిన
దేవ కాంతవే కాదా
నా మనసులో ముద్ర వేసిన నీ అందానికి
అలంకారాలు నేర్పే సాధనాలు
ఇంకా పుట్టనే లేదు
మనస్వినీ