Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 12 October 2015

నీ పేరే మరిచిపోయా

నీ పేరే మరిచిపోయా

కనుల భాష నేర్చుకున్నా
కంటి చూపుతోనే పలకరించుకున్నా
కంటి ముందు నడియాడిన దేవిని
చూపులనే పిలుపులుగా మలుచుకున్నా
చెంతనే ఉన్న పడతిని
మునివేళ్ళతో తడుముకున్నా
పేరు పెట్టి పిలవలేదు
మనసు పెట్టి పులకరించా
వాలిన కనురెప్పల్లో
గీటిన కన్నులలో
వేల జవాబులు వెతుక్కున్నా
క్రీగంటి ప్రశ్నలకు
మనసుతోనే సమాధానాలు చెప్పుకున్నా
తటపటాయింపులో
బదులే లేక
మౌనంగా తలవంచి
స్మృతులెన్నో వల్లే వేసుకున్నా
అవును
నేను నిత్యం నీతో
మాటలకు అందని భాషలో
ఊసులెన్నో చెప్పుకున్నా
మనసూ మనసుల భాషలో
కనురెప్పల పలకరింతలో
గులాబీ పెదవుల విరుపులో
చిలిపి సరిగమలో
మనోభాష సంగమంలో
నేను
నీ పేరే మరిచిపోయా
మనస్వినీ

Sunday, 11 October 2015

శాంతినివాసం {AMAN BASERA}

శాంతినివాసం {AMAN BASERA}

చిరునవ్వుల నందనవనం
చిరుదరహాసపు వదనం
తన్మయత్వపు ఆరాధనం
మమతలకు నిలయం
మారాకుల చిలిపిదనం
కుహూ కుహూ కోయిలగానం
మధురస్మృతుల సమ్మేళనం
జాజిపూల మకరందం
గులాబీల సోయగం
మరుమల్లెల వెచ్చదనం
ఆత్మీయ ఆలింగనం
అదే ఒక కుటుంబం
బంధం అనుబంధం సంబంధం
మమతావేశాల నిలయం
అదే మా శాంతినివాసం
ఇదే
మనస్విని మనోగతం

Saturday, 10 October 2015

ఆదాబ్ హైదరాబాద్

ఆదాబ్ హైదరాబాద్

ఆదాబ్ భాయ్ జాన్
నమస్తే అన్నా
ఖైరీయత్ భాయ్
బాగున్నవా అన్నా
ప్రతి పలుకూ ఆత్మీయం
భాయ్ అని పిలిచినా
అన్నా అని పలకరించినా
మా జీవనం అనుబంధాల ఆలయం
గంగా జమునా తహజీబ్ మాది
నిండు గుండెల సంగమం మాది
రంజాన్ నమాజుల రివాజులం మేము
వినాయకుడి ఉత్సవ వేళ
ఎగసిపడే సింధూరం మేము
షీర్ ఖుర్మా తీయదనం మేము
దసరా సమ్మేళనంలో
అలాయ్ బలాయ్ మేము
చార్ మినార్ శిఖరాన
విజయపతాకం మేము
భాగ్యలక్ష్మీ ఒడిలో పువ్వులమే మేము
ఇంటిమీద హరితపతాకం
గడపమీద పసుపు ప్రకాశం
తలమీద తాజ్ వైభవం
నుదుటి మీద కుంకుమ పవిత్రం
అన్నింటా మేమే సమస్తం
ఖుతుబ్ షాహీ వారసులం
భాగమతీ బంధువులం
శాంతి వనంలో కుసుమించే పువ్వులం
రాముడు మేమే రహీమూ మేమే
అన్ని మతాలూ మేమే
అన్ని పండగలూ మావే
అన్ని ఉత్సవాలూ మావే
విడదీయరాని అనుబంధం మేము
అతిథి మర్యాదలకు నిలయం మేమే
మా పూలవనంలో కొన్ని చీడపురుగులు చేరినా
ఐకమత్యంతో ఏరివేసేదీ మేమే
అవును మేము అన్నింటా ప్రత్యేకం
అందరికీ విభిన్నం
దక్కన్ భూమిలో విరిసిన పుష్పాలం
చరిత్ర సలాం చేసే
హైదరాబాదీలం
అందుకే మా హృదయం
ప్రతిక్షణం తలవంచి చెబుతుంది
ఆదాబ్ హైదరాబాద్

Friday, 2 October 2015

ఒక్కసారి వచ్చి చూడు

ఒక్కసారి వచ్చి చూడు

వేదనగా రోదిస్తోంది మనసు
విదారకంగా విలపిస్తోంది హృదయం
ఆర్తిగా అడుగుతోంది అంతరంగం
ఒక్కసారి గుండెవిప్పి చూడమని
మనసు లోతుల్లోకి తొంగి చూడమని
అనుమానం ముసుగులు వీడి
ఆవేశం పరదాలు దాటి
ఒక్కసారి వచ్చి చూడు
మనసు మందిరంలోకి
నువ్వున్నావో లేవో అని నీ అనుమానం
చొరబాటు చేస్తున్నావని భేషజం
కళ్ళు విప్పి చూడు
మనసు నిండా నువ్వే
గుండె గుడిలో నీ రూపమే
ప్రతి కవాటంలో నీ సవ్వడులే
నువ్వే కొలువైన గుడిలో
నీ ప్రతిమే తారాడే మదిలో
నువ్వు చొరబాటు ఎలా చేయగలవ్
అక్కడ నువ్వే ఉన్నావ్
నువ్వే కొలువయ్యావ్
నువ్వే పూజలందుకుంటున్నావ్
ఈ జన్మలో తెలుసుకోగలవా నిజాన్ని
నిన్ను నీవు
నీ విలువ నీవు
తెలుసుకోలేక
మనసును నిందించి
మంటలు ఎందుకు రేపుతావు
బాధ్యతల బాటలో
ఓనమాలు దిద్దిన నీవే
నీవు నేర్పిన అక్షరాలనే
ఎందుకు చెరిపివేస్తావు
నీవు చూపిన బాటలో
పువ్వులూ గుచ్చుకునే ముళ్ళూ
గాయం చేసే రాళ్ళూ
పరుచుకున్న తివాచీలేనని
నీకు మాత్రం తెలియనిదా
నా బాటను మాని నీ బాటలో
అడుగులువేయటమే నేరమా
ఎప్పుడైనా చూసావా నా మనసులోకి
తట్టిలేపే యత్నం చేసావా అంతరంగాన్ని
రోదిస్తున్న మనసు ఇక తట్టుకోలేనంటున్నది
విలపిస్తున్న హృదయం స్పందనలు వల్లకాదని అంటున్నది
ఒక్క చల్లని మాటకోసం
గుప్పెడంత మమత కోసం
మనసు ఆరాటపడుతోంది
మనస్వినీ

మనసు చెక్కిన శిల్పం

మనసు చెక్కిన శిల్పం

మనసు చెక్కిన శిల్పమే
నా జీవితం
కొలిమిలో కరిగిపోతూ
ఎండలో వాడి పోతూ
వానలో తడిచి ముద్దవుతూ
చల్లని వెన్నెలలో
పునీతమవుతూ
ఎన్నెన్నో మలుపులు తిరిగింది
నా జీవితం
చల్లని వెన్నెల గాలులు
ఒంటిని తడుముతున్నా
ఎడారి ఇసుకరేణువులు
మంటలు రేపుతున్నా
సంఘమనే బురదలో
పాదాలు కూరుకుపోతున్నా
గాలిలో దీపంలా
పడి లేచేందుకు
ఆరాటపడుతున్న జీవన శిల్పాన్ని
ఆలోచనల ఉలితో
నిత్యం చెక్కుతూనే ఉంది మనసు
ఉలిపోటు పట్టు తప్పిందా
ఆలోచనలు అదుపుతప్పుతున్నాయా
ఏమవుతోందో
ఏం జరగనుందో
భావమేమో
ముభావమేమో
జీవనం శిల్పం బీటలు వారుతోంది
మనసు చెక్కిన జీవిత శిల్పం
శిథిలంగా మారుతోంది
మనస్వినీ

Thursday, 1 October 2015

మళ్ళీ మళ్ళీ పుడుతున్నా

మళ్ళీ మళ్ళీ పుడుతున్నా

కనురెప్పల లోగిలిలో
ఆవరించిన తన్మయం
భారంగా వాలిపోయే
ఆ రెప్పల పరవశం
వణుకుతున్న పెదాల కలవరం
ఏమవుతోందో తెలియని మైకం
విరిసిన సొగసులో
తెలిసీ తెలియని ఆనందం
తడారుతున్న గొంతుకను
తడి చేసే ఆరాటం
ఆశ్వంలా చెలరేగిన పరువం
లొంగుబాటు పయనం
దేహతంత్రులలో ఏదో తెలియని
విద్యుత్ ప్రవాహం
ఇంతకు మించి జగతిలో
ఏమీ లేదనే విజయగర్వం
జీవితానికి ఇక కారణమే లేదనే
వైరాగ్యం
కమ్ముకున్న వైరాగ్యం పునాదిలో
మొలకెత్తే జీవనపుష్పం
అది జీవితమా
లేక
మరణమా
ప్రతిసారీ మరణించే నేను
అన్నిసార్లూ జీవిస్తున్నానా
అది మరణమే అయితే
మరణించిన ప్రతిసారీ
నీ ఒడిలో నేను
మళ్ళీ మళ్ళీ
పుడుతూనే ఉన్నా
మనస్వినీ