Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 31 October 2016

ఆ ఒక్క క్షణం

ఆ ఒక్క క్షణం
 వీనుల విందుగా వినిపిస్తున్న సంగీతం
ఆ గీతంలో లీనమై మైమరిచిన వేళ
మెల్లగా ఆ సంగీతం చెవులకు దూరంగా
జారుతున్న అనుభూతి
నిశబ్దమేదో మెదడును ఆవహిస్తున్నట్లు
తేజోమయ వెలుతురు మసక బారుతున్న దృశ్యం
అంతా మసకమసకగా ఉంది
ఎదురుగా నువ్వున్నావు
నీ రూపమూ కరుగుతోంది మెల్ల మెల్లగా
ఏదో జరుగుతోంది
ఏం జరుగుతున్నదో గాని తెలియని వైనం
ఏదో తెలియని అలికిడి
ఎదలోతుల్లో ఎక్కడో తెలియని ప్రకంపనలు
మెరుపువేగంతో గుండెలోకి దిగింది ఊపిరి
ఒక్కసారిగా కుదుపు
భారీ భవనమేదో కుప్పకూలినట్లు
గుండె కవాటాలను మూసేసిన శ్వాస
బయటకు రాలేనంటూ మొండికేసింది
స్పందనలు కోల్పోయిన హృదయం
ఇంకా పోరాడుతూనే ఉంది ఆగిపోవటం ఇష్టం లేక
నాలోకం స్తంభించిపోయిందనిపించింది
నాకు తెలిసిపోతోంది ఏం జరుగుతున్నదో
అప్పుడే నన్ను చూసిన నువ్వు
ఒక్క ఉదుటున నన్ను చేరావు
కలవరపాటుకు గురైనా నిబ్బరం కోల్పోక
హృదయమైదానంపై సపర్యలు చేసావు
మనసు కలత చెందినా
సమయస్పూర్థిని చూపుతున్న నువ్వు
గారాలపట్టిని పిలిచావు
చాలనిపించింది
నా వాళ్ళు నాతోనే ఉన్నారనిపించింది
నీ ప్రేమకు చలించిందో
నీ ఆవేదనకు కరిగిందో
తెలియదుగానీ
నా శ్వాస ఒక్కసారిగా బయటకు ఉబికింది
గుండె కుదుటపడింది
స్రవిస్తున్న నయనాలు నిన్ను ఆర్తిగా చూసాయి
బేలగా మారిన తనయను
కంటి చూపులు ముద్దాడాయి
అప్పుడే గదిలోకి వచ్చిన ప్రిన్స్ ను గర్వంగా చూసాయి
కనులముందు మీరు ముగ్గురూ ఉంటే
నాకేమయినా పరవాలేదనిపించింది ఆ క్షణం
ఆ ఒక్క క్షణం నాకు
మళ్ళీ జన్మించిన అనుభూతి మిగిలింది
మనస్వినీ

Friday, 28 October 2016

ఎరుపెక్కిన శాంతి కపోతం

ఎరుపెక్కిన శాంతి కపోతం
ఎర్ర సూరీడుకీ మనసుంటుంది
అరుణ తార వెన్నెల కురిపిస్తుంది
దారితప్పారని ఒకరంటారు
రాదారి మాదని మరొకరంటారు
ఎవరి దారి ఏదైతేనేం
మంట కలిసేది మానవత్వమే...
ఖాకీ గుండెలోనూ మనసే ఉంటుంది
పోలీసు వనంలోనూ మనిషే ఉంటాడు
ఎవడు మనిషైతేనేం
రాలిపడేది మనిషి దేహమే...
పచ్చని అడవిలో గుభాళించేది ఎర్రమందారమే
వాగుల్లో వంకల్లో
ఎరుపెక్కిన కొండల్లో
మనుషుల పదఘట్టనల్లో
నలిగిపోయిన పుష్పాలు జీవన మందారాలే
నలిపేసేది ఎవరైతేనేం
మరణించేది మనిషే...
ఆదివాసి జీవితాల విరిసిన పెదాలలో
చాలీ చాలని బతుకుల ఆక్రందనలో
రాజ్యహింసకు రగిలి ఎరుపెక్కిన కన్నులలో
తూటాలను ముద్దాడి నేలకొరిగిన కళేబరాలలో
కరాళ నృత్యం చేసేది మరణమే
మరణించేది మనిషే...
మనసు నిండా తనవారు
కనులలో మెదిలే చిన్నారుల కేరింతలు
అయినవారికి దూరంగా
పుట్టలు గుట్టలు దాటుతూ
మందుపాతరలకు దేహం తునా తునకలైతే
కన్నీరు మున్నీరుగా విలపించేది మనుషులే
పగిలిన ఆ హృదయాలూ మనుషులవే...
ఒక తూటా విప్లవమని గర్జిస్తే
మరో తూటా బాధ్యత అని రగిలితే
మండుతున్న అడవిలో
రుధిరం ప్రవహించే సెలయేరులో
ఓ శాంతి కపోతం విలపిస్తోంది
ఎరుపెక్కిన తన రెక్కలను చూసి...

Thursday, 27 October 2016

ఇక సెలవేనా

ఇక సెలవేనా 
నీవూ నన్ను వీడిపోతున్నావా
నీకూ నేను నచ్చలేదా
నీకూ నాపై కోపం వచ్చిందా
నీకూ నేనంటే ఏవగింపు కలిగిందా
నీకూ నాపై నమ్మకం పోయిందా
నాలోనే ఉన్న నీవు
నా నుంచే జారిపోతున్నావా
ఇక సెలవంటూ
కరిగిపోతున్నావా
ఎంత పదిలంగా దాచుకున్నా నిన్ను
ఎంత ప్రాణంగా చూసుకున్నా నిన్ను
గడ్డ కట్టిన మనసులో
ఎగసిపడుతున్న కనుల కొలనులో
నిన్ను జాగ్రత్తగా దాచుకున్నా
నువ్వెక్కడ జారిపోతావో
ఎక్కడ కరిగిపోతావో
ఎప్పుడు అనాధను చేస్తావోనని
అనుక్షణం కాచుకున్నా
నా చిరునవ్వుకు ఇంధనం నువ్వు
నా గాంభీర్యానికి కవచం నువ్వు
నాకు తెలుసు నువ్వు నాలో ఉన్నంతవరకే నేను
నువ్వు లేకపోతే ఏమీ లేను నేను
నీకు తెలియనిదా
నువ్వు జారిపోతే నా ధైర్యమే జారిపోతుందని
అయినా ఎందుకు కరిగిపోతున్నావు
ఎంత ఆపుకున్నా
ఎందుకు కురిసిపోతున్నావు
బీటలు వారిన నేలలా మనసును మార్చేసి
కనుల కొలనును ఎడారిలా చేసేసి
నయన గవాక్షాలు ధ్వంసం చేసి
ఎందుకు ప్రవహిస్తున్నావు
నన్నెందుకు బేలగా మారుస్తున్నావు
ఏమయ్యిందో ఏమో గాని
నాలో నిదురించిన కన్నీరు సైతం
నన్ను విడిచి వెళ్ళిపోతోంది
మనస్వినీ 

Sunday, 23 October 2016

ఆత్మీయ అతిథి

ఆత్మీయ అతిథి

ఎక్కడో ఒక నింగి నేల వైపు కుంగింది
శూన్యం నుంచి రాలిన తారక ఒకటి
పుడమి వైపు జారింది
వడివడి నడిచిన పయనం
గమ్యం చేరకనే ఆగింది
మరుమల్లెల తోటలో మల్లికలు కొన్ని
సౌరభాలు అద్దుకున్నాయి
పుష్పరాజాలు గులాబీలు
పరిమళాలు తాగుతున్నాయి
నిశబ్ద పీఠికలో తెలియని అలికిడి ఏదో
సవ్వడి చేస్తోంది
గుంభనమై నిలిచిన ఊడలమర్రి
చేతులు చాచి ఆడుతున్నది
 ఎదను తడిమేందుకు మల్లికలు ఆరాట పడుతున్నాయి
పాదాలను చుంబించేందుకు గులాబీలు ఎదురు చూస్తున్నాయి
భారంగా శ్వాసించిన పుడమి
తనలో సర్దుబాటు చేసుకుంటున్నది
తన గుండియలో చోటునిచ్చి
విశ్రమించమని కోరుతున్నది
ఆత్మీయ అతిథివి నీవేనంటూ
స్వాగతం పలుకుతున్నది  

Saturday, 22 October 2016

వ్యాపార కేంద్రం కాదు ఈ మనసు

వ్యాపార కేంద్రం కాదు ఈ మనసు
 
మంచు శిలను కాదుగా నేను
చిరుగాలికే కరిగిపోయేందుకు
బండరాయిని కాదుగా నేను
ఎండ వేడికి పగిలిపోయేందుకు
ఆటబొమ్మను కాదుగా నేను  
పరుల క్రీడకు నర్తించేందుకు
వ్యాపారం చేయలేదుగా నేను
లాభ నష్టాలు బేరీజు వేసుకునేందుకు
పిరికిపందను కానుగా నేను
తాటాకు చప్పుళ్ళకు బెదిరేందుకు
బలహీనుడిని కాదుగా నేను
మొసలి కన్నీళ్ళకు పడిపోయేందుకు
వంచకుడిని కాదుగా నేను
పట్టుకున్న చెయ్యి విడిచిపెట్టేందుకు
అవిశ్వాసుడను కాదుగా నేను
షరియత్ ను అపహాస్యం చేసేందుకు
నాకు అన్నీ తెలుసు
ప్రతి మనసూ తెలుసు
ప్రతి ఆటా తెలుసు
ఆటలో బొమ్మలూ తెలుసు
రాజనీతి శాస్త్రం చదివిన నాకు
రాజకీయాలు తెలుసు
రాజకీయం చేయడమూ వచ్చు
రాజకీయాలను తిప్పికొట్టడమూ వచ్చు
నా నడకలో మార్పు లేదు
నడతలో మార్పు లేదు
మనసులో మార్పు రాదు
ఎవరికోసమో చెయ్యిపట్టుకోలేదు
ఎవరి కోసమో చెయ్యి వదిలేదీ లేదు
సునామీలు వచ్చినా బెదిరేది లేదు
ఎవరు చచ్చినా కరిగేదీ లేదు
నేను రాసుకునే అక్షరాల మీద ఆన
నా ప్రాణం తోనే నన్ను వీడిపోతుంది
నా మనస్విని 

Tuesday, 11 October 2016

సవ్వడి లేని పలకరింపు

సవ్వడి లేని పలకరింపు 

నా నుంచి నేను విడివడినాను
నాలో ఉన్న నేను బయటికి వచ్చాను
మౌనమనే నిశీధిలో
నాకు ఎదురుగా నేనే కూర్చున్నా
తలవంచి కూర్చున్న నేను
నన్ను నేనే చూడలేకపోతున్నా
మేఘవర్షిత నేత్రాలతో
నా కళ్ళలో కళ్ళు కలపలేకపోతున్నా
సవ్వడి లేని పలుకులతో
నన్ను నేను పలకరిస్తున్నా
కుశలమడిగిన నన్ను నేను
కుశలమని చెప్పలేకపోతున్నా
ఎవరికీ తెలియని నా మనసును
నాకు నేనే విప్పి చూపుతున్నా
మనసుకు తగిలిన గాయాలను
నాకు నేనే లెక్కిస్తున్నా
నేరము తెలియని నేను
నాపైనే నేను నిందలు వేస్తున్నా
నా కన్నుల జారే చుక్కలను
అమృతమని నేనే తాగేస్తున్నా
జారిన అడుగులకు మార్గము తెలియని నేను
జాడలు ఎక్కడో శోధిస్తున్నా
కిరాతకుడినని నమ్మే నేను
దేవుడినేనని ఓదార్చుకుంటున్నా
నేలను తాకిన కన్నీటి చుక్కలో
నన్ను నేను చూసుకుంటున్నా
వికలమైన మనసుతో
నన్ను నేను నిలదీస్తున్నా
మనస్వినీ 

Saturday, 8 October 2016

నీ కాలిమువ్వనై రాలిపోవాలనీ...

నీ కాలిమువ్వనై రాలిపోవాలనీ... 

నువ్వు నమ్మవుగానీ
నాకెప్పుడూ ఇలా అనిపిస్తూ ఉంటుంది
చల్లని సాయంత్రంలో
సాగర తీరంలో ఇసుకతిన్నెలపై
నీతో కలిసి నడుస్తూ
పాదాలు ఇసుకలో కూరుకుపోతూ ఉంటే
నీ భుజాలను ఆసరా చేసుకుంటూ
నీ నడుము పై సుతారంగా మీటుతూ
నడకలో నీకు సహారా కావాలని అనిపిస్తుంది
సముద్రుడిపై మోహం తగ్గి
నీవైపు దూసుకువచ్చే పిల్లగాలులు
నీ కురులతో సయ్యాటలు ఆడుతూ ఉంటే
విరిసిన మోము అందాలను తనివితీరా చూస్తూ
ఘడియలు తెలియకుండా గడిపేయాలని అనిపిస్తుంది
ఎగసిపడే కెరటాల హోరులో
నీ పలుకులు చెవులను తాకకపోతే
నీ మాటలను మనసులో నింపుకుని
నా పలుకులుగా వినిపించాలని అనిపిస్తుంది
పచ్చదనాల తోటలో విరిసిన పూబాటలో
వసంతమై నువ్వు నడుస్తూ ఉంటే
నీ చిరునవ్వులకు పువ్వులతో పోటీ పెట్టాలని అనిపిస్తుంది
కిలకిలా నువ్వు నవ్వుతూ ఉంటే
బోసినవ్వుల పాపాయినై నీ గుండెను హత్తుకోవాలని అనిపిస్తుంది
నీ కన్నుల వెన్నెల కురుస్తూ ఉంటే
జలతారు స్నానం చేయాలని అనిపిస్తుంది
నీతో పయనంలో మధురమైన గమనంలో
నీ గొంతుక గానమై కురిసిపోవాలని అనిపిస్తుంది
మధుమాసమై నువ్వు పలకరిస్తే
రాలుపూల మకరందమై నిన్ను అభిషేకించాలని అనిపిస్తుంది
యాంత్రికత నన్ను ఆవహించిందని అనిపించినా
నిత్య వసంతుడినై వికసించాలని అనిపిస్తుంది
 వెలిగే దీపమై నువ్వు నవ్వుతూ ఉంటే
కరిగే చీకటిలో అస్తమించాలని అనిపిస్తుంది
భావనల్లో కాదు మెరిసే నీ నవ్వుకు
చకోరమై ఎగరాలని అనిపిస్తుంది
నిత్యం నీ నవ్వే నాట్యమాడితే
నీ కాలిమువ్వనై రాలిపోవాలని అనిపిస్తుంది
నువ్వు నమ్మినా నమ్మకపోయినా
నాకెప్పుడూ ఇలాగే అనిపిస్తుంది
మనస్వినీ 

Friday, 7 October 2016

అంతర్యామీ...

అంతర్యామీ...

ఈ దేహము నాకు వద్దు
నువ్వే తీసుకుపో
నా అంతరాత్మను మాత్రం నాకే వదిలేయ్
మకిలి అంటిన దేహంపై మమకారము లేదు నాకు
నేరము తెలియని అంతరాత్మే నాకు ముద్దు
పెరుగుతున్న వయస్సు తరుగుతున్న చందానా
కవళికలు మార్చుకునే ఈ దేహం ఇప్పుడు శుష్కించిపోయింది
జీవనయానంలో పడిలేస్తూ
ఒడిదుడుకుల దేహం ఏనాడో కుంగిపోయింది
కంటికి కనిపించే దేహం కంటగింపుగా మిగిలిపోయింది
పడిలేచినా లేచి పడినా
చెదరనిదీ కరగనిదీ నా అంతరాత్మే
నాకంటే నాకెంతో ఇష్టమైన నా అంతరాత్మను
నాకే వదిలేయ్  
ఎందుకంటే అదినా అంతరాత్మ
నడిచే అడుగుల పయనం ఆపేయ్
నా గమ్యాన్ని మాత్రం మార్చకు
నా గమ్యాన్ని నా మనసు నిర్దేశించింది
అడుగులు ఆగినా
పయనం జారినా
నా గమ్యం నా అంతరాత్మే
అంతర్యామీ
అంతరాత్మను నాకు వదిలేయ్
ఈ దేహము నాకు వద్దు
నువ్వే తీసుకుపో...

Saturday, 1 October 2016

నిశిరాతిరి అన్వేషణ

నిశిరాతిరి అన్వేషణ

ఓ నిశి రాతిరి కన్నులు తెరిచాను
చీకటి గుహలోనుంచి లేచి
బడలికగా ఒళ్ళు విరుచుకున్నాను
నా దేహానికి అంటుకున్న మట్టి మరకలను
చేతులతో దులుపుకున్నాను
అక్కడక్కడా పొదిగినట్టుగా ఒంటికి అంటుకున్న
ఎండుటాకులను ఏరి విసిరేసాను
చుట్టూ నిర్మానుష్యం
ఎక్కడా అలికిడి లేదు
ఏవో జీవులు కదులుతుంటే
రాలిపడిన ఎండుటాకుల వింత సవ్వడి
గాలిలో తేలినట్లుగా లేచి నిలుచున్నా
ఎంత చిత్రమో
నా అడుగులకు ఎండుటాకులు సవ్వడి చేయనే లేదు
రోజూ ఇలాగే అనుకుంటా
అయినా ముందుకే సాగుతా
ఆగిపోయిన నా అన్వేషణను మరలా మొదలు పెడుతూ
ఓ విశాలమైన భవంతి
ఎలాగూ నన్నెవరూ చూసే అవకాశమే లేదు
లోపలి దూరిపోయా
ఆ పెద్దాయన ఎంత మంచోడో
తన కొడుకు పుట్టిన రోజని భారీగా విందు ఇస్తున్నాడు
అందరూ తాగుతున్నారు తింటున్నారు
అంతలోనే ఒక ప్రకటన
పుట్టిన రోజు సందర్భంగా తన కొడుకుకి
మెర్సిడెజ్ బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు
అందరూ చప్పట్లు కొడుతూ
ఎంత ప్రేమో కొడుకంటే అని చెవులు కొరుక్కున్నారు
అవునేమోలే అనుకుంటూ మరో చోటికి వెళ్ళా
వివాహ దినోత్సవ వేడుకలు
సూటు బూటులో ఉన్న పెద్దమనిషి హడావిడిగా కనిపించాడు
అందరి సమక్షంలో తన సతిని ముద్దాడి
కోటి రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్
కానుకగా మెడకు తొడిగాడు
మళ్ళీ అదే ముచ్చట
అదే చెవులు కొరుకుడు
ఎంత ఘాటు ప్రేమయో
గడియారం ముళ్ళు వేగం పెంచుకున్నాయి
నా అన్వేషణ ఇంకా మిగిలే ఉంది
వెలుతురు పరుచుకోక ముందే గమ్యం చేరాలి
ఆలోచిస్తూనే తిరుగు ప్రయాణం చేస్తున్నాను
నిజంగా ప్రేమంటే ఇదేనా
నా అన్వేషణ పూర్తయ్యిందా
నా దేహంలో జీవమున్నవేళ
నేను బతికే ఉన్న ఘడియల్లో
ఇలాంటి వేడుకలు నన్నూ పలకరించిన వేళ
రిక్త హస్తాలతో నేను
మనసులోనే కుమిలిన క్షణాన
నాలో రగిలిన వేదన
కన్నుల నుంచి కారిన వైరాగ్య భాష్పాలు
అన్నీ మదిలో మెదలుతున్నాయి
ఈ వేదనకు రూపమేమిటి
ఈ ఆక్రందనకు అర్థం ఏమిటి
ఇది ప్రేమా
జీవన వైఫల్యమా
అవునేమో
ఇది వైఫల్యమేనేమో
మరి ప్రేమంటే
సమాధానం ఇంకా దొరకలేదని పిస్తోంది
అన్వేషణ ఇంకా మిగిలే ఉందనిపిస్తోంది
భారమైన మనసుతో నా శయనమందిరం చేరుకున్నా
ఎక్కడో పొద్దు పొడుస్తున్న వెలుతురు ఛాయలు
బలంగా కళ్ళు మూసుకున్నా
మనసు నిండా చీకటి నింపుకుంటూ
మరో నిశిరాతిరి కోసం నిరీక్షిస్తూ