Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, 22 August 2017

అంతా అలాగే ఉంది

అంతా అలాగే ఉంది

అలా ఏమీ జరగలేదు
ఎలాంటి మార్పూ రాలేదు
నవ వసంతాలు కురిసిపోలేదు
కనక వర్షాలు కనుచూపు మేరా కానరాలేదు
తెప్పలుగా చెరువు నిండలేదు
కప్పలు పదివేలు చేరనేలేదు
కొత్త పలకరింపులు లేనేలేవు
చెంతకు చేరినవారూ లేరు
ఉత్సాహం లేదు
ప్రోత్సాహం లేదు
ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది
జీవితమనే అంగడి నడుస్తూనే ఉంది
నేనే ఉన్నాను నాడు
నేనే ఉన్నాను నేడూ
అన్నీ  భ్రమలే అనితెలుసు
శిథిల శిఖర పునర్నిర్మాతను నేనే అనీ తెలుసు 

Monday, 21 August 2017

ఏమున్నదిక్కడా

ఏమున్నదిక్కడా

యే కౌన్సీ జగా హై దోస్త్
యేతో ముర్దా దిల్ ఇన్సానోకి
ఖబరస్థాన్ హై దోస్త్
ఎమున్నదిక్కడా
అంతా మాయాకపటం విద్రోహాల సమూహం
కదిలే మానవ కళేబరాల విన్యాసం
మనసులేని మరమనుషుల ఆలవాలం
విరిసేపెదాల చిరునవ్వులమాటున
రాబందుల రెక్కల చప్పుళ్ళు
కురిసే మధురిమల  చాటున
ప్రాణం తీసే కాలకూట విషపు గుళికలు
అందమైన గులాబీలు
మైమరిపించే సౌరభాలు
ఆదమరిచి ఉంటే
గుండెను గుచ్చే పదునైన ముళ్ళు
అబద్దాల పునాదులపై
కొలువుదీరే పేకమేడలు
కూలిన శిథిలాల్లో సమాధి అవుతున్నాయ్
నిప్పులాంటి నిజాలు
ఏమున్నది ఇక్కడా
మసిపూసి మారేడు కాయ తింటారు
అందని ద్రాక్షకై ఎగిరెగిరిపడతారు
ఒకరికోసం గోతులు తీస్తారు
తమకూ ఒక గోతి తప్పదని తెలుసుకోరు
సాలెపురుగు అల్లికలు  
గుంట నక్కల బుద్ధులు
ఈ లోకం ఒక వింతైన మాయాజాలం
ఎమున్నదిక్కడా
మాయావి మనుషుల వికృత చర్యల
మరణ మృదంగం 
(ఇది ఎవరికోసమో రాయలేదు)

Wednesday, 16 August 2017

స్వీకరిస్తున్నా

స్వీకరిస్తున్నా

మెదడునిండా రణగొణధ్వనులు
మనసునిండా చితిమంటల చిటపటలు
అంతరంగంలో అంతులేని అలజడులు
జారిపడిన కన్నీటిలో రాలిపడుతున్న స్వప్నాలు
ఆలోచనలను కమ్మేసిన మాటల తూటాలు
మనసు సంద్రాన్ని చిదిమేసిన ఆవేశపుకెరటాలు
కునుకులేని కంటిలో రగులుతున్నాయి మంటలు
మండుతున్న చితిలో కాలుతున్నాయి అనురాగాలు
నిద్రలేని రాత్రులను కానుకగా ఇచ్చావు నాకు
దేవుడా
స్వీకరిస్తున్నా నీ బహుమానాలు 

Monday, 14 August 2017

శిథిలమనసు

శిథిలమనసు  
 
వసంతం రానేరాదని తెలుసు
మారాకుల కోసం ఆరాటం ఎందుకు
శ్రావణం కురిసిపోదని తెలుసు
చిరుజల్లులకోసం ఎదురుచూపులు ఎందుకు
మార్గశిరం శిరస్సు ఎత్తదని తెలుసు
మంచుపూల వానకై నింగివైపు చూస్తావెందుకు
గమ్యమే తెలియని పయనమని తెలుసు
నడిచిన బాటను తుడిచివేస్తావెందుకు
నింగి తారకలు చేతికి అందవని తెలుసు
ఎక్కిన మెట్లను ధ్వంసం చేస్తావెందుకు
వెనక్కి తిరిగి చూస్తే
అడుగు వేసేందుకు
జానెడు జాగా ఉండదు
శిథిలమైన మనసు ముక్కలు తప్ప

Wednesday, 9 August 2017

ఎడారి పుష్పం

ఎడారి పుష్పం
మనసు పుస్తకాన్ని తడిమి చూస్తున్నా
ఆప్యాయంగా గుండెకు హత్తుకున్నా
కన్నీటి పర్యంతమవుతున్నాయి భావాలు
చితిమంటలై రగులుతున్నాయి అక్షరాలు
ఎందుకు మాకు హేళనలు
ఎందుకీ రోదనలు
శరపరంపరలుగా దూసుకువస్తున్న
అక్షర ప్రశ్నలకు మౌనంగానే సమాధానమిస్తున్నా
ఎదురుతిరుగుతున్న భావాలను
కాలమనే తడిగుడ్డతో తుడిచేస్తున్నా
ప్రేమపుష్పాలుగా వికసించిన అక్షరాలను
శూన్యంలోకి గిరాటువేస్తున్నా
తులసి వనమో
గంజాయి మొక్కల సమాహారమో తెలియని
మనసు తోటను ఎడారిలా మార్చేస్తున్నా
ఇక మౌనమే నా భాష అని
మనసుకు సర్ది చెప్పుకుంటున్నా