Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 23 February 2018

ఒక జ్ఞాపకమై ...

ఒక జ్ఞాపకమై ...

వేయి పదఘట్టనల సింహనాదమునై
వేలాది గొంతుకల జయజయ ధ్వానమునై
విలపించే గుండెలో ఆర్తనాదమునై
ఎగసిపడే పదధూళిలో కమ్మని పరిమళమునై
సజల నేత్రానికి భారమైన వీడ్కోలునై
                              మరో లోకపు గడపకు చల్లని పలకరింపునై               
లక్షపుష్పికల శయ్యపై నిదురించిన పసిపాపనై
నన్ను నడిపిన పుడమికి ఆత్మీయ ఆలింగనమునై
కలకాలం మిగిలే ఉంటా మరపురాని జ్ఞాపకానినై

Thursday, 22 February 2018

హరిశ్చంద్రుడిని కాను

హరిశ్చంద్రుడిని కాను

హరిశ్చంద్రుడి వారసుడిని కాను
అసత్యాలతో సహవాసం చేయలేదు...
చాణక్యుడిని కాను
కుటిల తంత్రాలను గెలవలేదు...
ఇంద్రజాలకుడిని కాను
మాయామర్మములను ఛేదించలేదు...
దానకర్ణుడిని కాను
నాదగ్గరేమీ దాచుకోలేదు...
అందరివాడిని కాను
నేనెవ్వరినీ వదులుకోలేదు...
రాబందుని కాను
ఎవరినీ చీల్చితినలేదు...
స్వేచ్ఛావిహంగాన్ని కాను
ఎగసిపడే మనసును ఆపుకోలేదు...
అమర ప్రేమికుడిని కాను
ప్రేమనెప్పుడూ చంపుకోలేదు...
కుబేరుడిని కాను
ధనరాశికి బానిసను కాను...
విజేతను కాను
ఓటమిని జీర్ణించుకోలేదు...
ఇప్పుడేం చేస్తున్నా నేను
కనురెప్పలనుంచి జారిపడుతూ
మిణుగురు పురుగుల్లా
ఎగిరిపోతున్న స్వప్నాలను చూస్తూ నిలిచివున్నా
చేసేదేమీలేక...

Monday, 19 February 2018

తెల్ల అక్షరాలు

తెల్ల అక్షరాలు 

కనులు మూసినా నలుపే
కనులు తెరిచినా నలుపే

నడిచే బాట నలుపే
నాలుగుదిక్కులూ నలుపే

విరిసే పుష్పం నలుపే
పువ్వుల తోటా నలుపే

బంధాలు నలుపే
రాబందుల నవ్వులూ నలుపే

మనుషులూ నలుపే
వారి మనసులూ నలుపే

స్నేహమూ నలుపే
స్నేహంలోని మర్మమూ నలుపే

అడుగుల కింది నేలా నలుపే
తల ఎత్తిచూస్తే నింగీ నలుపే

దేవుడా నాకేమీ వద్దు
కాసింత తెల్ల సిరా ప్రసాదించు చాలు
నలుపెక్కిన నా జాతక చక్రంలో
తెల్ల అక్షరాలు నేనే రాసుకుంటా 

Thursday, 15 February 2018

జస్ట్ విషెస్ ...

జస్ట్ విషెస్ ... 

నీ అడుగులు సాఫీగా సాగినా
తడబడి నడిచినా
మార్గాలు మారినా
గమ్యాలు చెదిరినా
నీ లక్ష్యం నేనే
నీ గమ్యం నేనే
నీ అడుగులు నడిచేది నావైపే ...
కనురెప్పల్లో వెన్నెలే కురిసినా
కంటి తెరలపై సుడులే చెలరేగినా
ఆ కంటి పాపలలో నిదురించేది నేనే ...
మనసు మానస సరోవరమైనా
మనోసంద్రంలో సునామీలే చెలరేగినా
ఎగసిపడే అలల్లో కనిపించేది నేనే ...
ఇంకా ఏమని చెప్పను నీ గురించి
జస్ట్
హాపీ బర్త్ డే టూ యూ మనస్వినీ ...

Tuesday, 13 February 2018

ధర్మ సందేహం

ధర్మ సందేహం

నువ్వు  నవ్వితేనే నా అక్షరాలు
పువ్వులుగా వికసిస్తాయి
పూసిన నా అక్షరాలు
నీ పెదాల మెరుపుల్లో జీవం పోసుకుంటాయి
నీ కన్నుల వెన్నెలలో
అందమైన ఆడపిల్లలై ఆడుకుంటాయి
నీ మనసులో భావాలకు
ప్రతిరూపాలై కనువిందు చేస్తాయి
నీ పదమంజీరాలకు
సవ్వడులై నర్తిస్తాయి
ముభావమే నువ్వయితే
నా అక్షరాలూ ముడుచుకుంటాయి
నాకో ధర్మ సందేహం
నా అక్షరాలు నా మనసులో పుట్టినవేనా
లేకనువ్వు
నీ భావాలన్నింటినీ
నా మనసులో దాచుకున్నావా ... 

Saturday, 10 February 2018

ఎక్కడ దాచుకోను నిన్ను

ఎక్కడ దాచుకోను నిన్ను 


నా కన్నులలో దాచుకోనా
ఎరుపెక్కిన నీ కనురెప్పల సెగలురేపే కెంపులను ...
మధురసాలని సేవించనా
అదురుతున్న నీ అధరాల జాలువారే తేనీయలను ...
నా శ్వాసలో నింపుకోనా
భారమై ఆవిర్లు రేపుతున్న నీ ఊపిర్లను ...
నా హృదయస్పందనలో కలుపుకోనా
మయూఖములై నర్తించే నీ మంజీరాల సవ్వడులను ...
వినీలాకాశంలో దాచుకోనా
నీ నవ్వుల్లో రాలిపడే తారకల వెలుగులను ...
నన్ను నీలో కరిగించుకోనా
నాలో కరిగిస్తూ నీ బిగిపరువాల సొగసులను ...
అక్షరపుష్పాలను సాగుచేసుకోనా
మననం చేసుకుంటూ నీ అనుభవాల అనుభూతులను ...
మనసు పుస్తకంలో పదిలం చేసుకోనా
మనస్వినియై పూసి మదిని దోచిన పారిజాతమును ...
ఎక్కడ దాచుకోను నిన్ను
ఏ కన్నూ నీపై పడకుండా ...
ఎలా ఆపగలను నేను
ఏ భావకుడీ అక్షరం నీపై వాలకుండా ...

Wednesday, 31 January 2018

వందనం అభివందనం

వందనం అభివందనం  

నలుపూ తెలుపుల చిత్రం
కొత్త రంగులు అద్దుకున్నట్లు...
నల్లముసుగేసిన నింగిలో
వేల తారకలు నవ్వినట్లు...
నిశ్చలమై నిలిచిన కడలిలో
కొత్త కెరటాలు  ఎగసిపడుతున్నట్లు ...
భావాలు మరిచిన మనసులో
కొత్త అక్షరాలు మొలిచినట్లు ...
జీవం లేక పగిలిన పెదాలపై
కొత్త నవ్వులు మెరిసినట్లు ...
అచేతనమైన దేహంలో
కొత్త ఊపిర్లు పోసినట్లు ...
అమావాస్య నిండిన పయనంలో
నిండు పున్నమి ఉదయించినట్లు ...
వెన్నెల వెలుగువై
ప్రభాత సుందరివై
మైమరిపించే మంజీరనాదమై
మనసును తడిమిన నిజజీవిత నాయికా
మనస్వినివై పరిమళించిన అభిసారికా
వందనం
అభివందనం ...

Wednesday, 24 January 2018

శూన్య మనస్కుడను

శూన్య మనస్కుడను

నాలో జీవమును వెతకకు
ఇంకిన ప్రవాహాల ఆనవాలును నేను
రాళ్ళు రప్పలు తేలి నిర్జీవమైన నదిని నేను ...
నా రూపమును చూడాలని అనుకోకు
పగిలిన అద్దంలో ఆర్తనాదాలు చేసే ఛాయను నేను
ముక్కలై వెక్కిరించే వికారమైన వదనము నేను ...
నాలో మరలా చిరునవ్వులు శోధించకు
వాడిన వసంతంలో పనికిరాని ఎండుటాకును నేను
సుగంధాలకై తహతహలాడిన కాగితం పువ్వును నేను ...
నాలో  గుణగణాలను లెక్కించమాకు
నీవు అసహ్యించుకునే మతములో భాగమును నేను
విలువలను వలువలుగా విడిచే వికట జీవిని నేను ...
నా మనసును తడమాలని చూడకు
చితిమంటలలో కాలిన దేహమును నేను
దీపం ఆరిన శూన్య మనస్కుడను నేను ...
నన్ను పరిగణలోకి తీసుకోకు
తెగిడిన నాడే స్పందించలేదు నేను
పోగిడినంతనే పులకించగలనా నేను ...