Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, 31 May 2016

తనువే ఓ గ్రంథమై...

తనువే ఓ గ్రంథమై...
కవితలు రాయగా
అక్షరాల అల్లికలు ఎందుకు నాకు
ప్రణయగీతికల కోసం భావాల పువ్వులు
ఎందుకు నాకు
నీ మనసు ఒక పుష్పమై
నీ తనువు ఒక పుస్తకమై
నిత్యం నాలో
విరితేనెల అక్షరాలకు బీజం వేస్తే
కొత్త అక్షరాలు పుట్టుకు రావా
కొత్త భావాలు మారాకు తొడగవా
దాహంతో అలమటించిన నా మనసుకు
నీ మనసు దప్పిక తీరిస్తే
సాంత్వన పొందిన మనసు
ప్రేమ గీతాలు పాడదా
నీ దేహంలోని ప్రతి అణువూ ఒక తెల్లకాగితమై
నిత్యం నవవసంతాలకు స్వాగతం పలికితే
నా శ్వాసతో నీ ఎదపై
మనసు సొదలు రాసుకోనా
అధరం ఒక అక్షరానికి జీవం పోస్తే
కన్నులు వెన్నెల రాగాలు పలుకవా
ఎద పొంగుల కెరటాలకు
మనసులో రంగు రంగుల భావాలు
ఊపిరి పోస్తుంటే
నా మనసు తనంతట తానే
కవిరాజులా కవితలను విరజిమ్మదా
మనస్వినీ

భువిలో పారిజాతం

భువిలో పారిజాతం

అది వెలుతురు కాదు
అలాగని చీకటీ కాదు
చీకటివెలుగుల సంగమంలా
మసకమసకగా ఉన్న వెలుతురులో
చీకటికాని నీలి వెలుతురులో
కనిపించీ కనిపించని నీవు
కొంచెం కొంచెం రూపం దాలుస్తున్న నీ ఆకృతి
భువికి దిగిన పారిజాతంలా
నా మదిలో విరిసిన ప్రణయ గీతంలా
అవును నువ్వే
అది నువ్వే
తెల్లని మేఘాలను
మరుమల్లియల తెల్లదనాన్ని
తారలమ్మల మెరుపులను
ఒకటిగా చేసి
నిన్ను బొమ్మలా మార్చాడేమో
ఆ దేవుడు
నిన్నే చూస్తున్నా
నీ అందాన్ని ఆరాధిస్తున్నా
తెల్లని పాలమీగడ తెరల నడుమ
పాలరాతి బొమ్మలా నువ్వు
ఆ మల్లికలను మాలగా అల్లుతూ
మల్లెలను సుతారంగా మీటుతూ
ఒక్కొక్కటిగా కూర్చుతూ
ఏమని వర్ణించను నిన్ను
జాలువారుతున్న తారల మెరుపులా
నవ్వుతున్న మల్లికల సొగసులా
అప్పుడే విచ్చిన పువ్వులా
బడలిక తీరిన రతీదేవిలా
నిశిరేయి ముచ్చటలా
నిన్ను చూస్తూ ఉంటే
ఏవేవో భావాలు
ఎన్నెన్నో సరాగాలు
మల్లికల మాలికలు ఎన్ని అల్లినా
మేని సొగసులకు ఎన్ని మెరుగులు వేసినా
ఏవీ నీకు అలంకారాలు కాదు
నీ పరువం నడియాడే స్వర్గసీమే
మనస్వినీ

తరగని సిరి

తరగని సిరి

తరగని సిరిని దక్కించుకున్నా
ఎనలేని సంపదను స్వంతం చేసుకున్నా
నాదన్నది ప్రతిదీ పదిలం చేసుకున్నా
ఎవరూ చోరీ చేయలేనిది
దోపిడీకి ఆస్కారమే లేనిది
అవును అంతా నాదే
నేను లేకున్నా
నా సంపద వికసిస్తూనే ఉంటుంది
అవును
నా సంపద నా అక్షరాలే
నా సిరి అక్షర కుసుమాలే
పులకించిన మనసు భావాలను
ఇంద్రధనుస్సు రంగులలో అద్దుకున్నా
మనసులోని ప్రతి రంగునూ
అక్షరంగా మలుచుకున్నా
కన్నీటి తెరలలో కరిగిన స్వప్నాలను
తడియారబెట్టి పువ్వులుగా నాటుకున్నా
ఆవేశంలో రగిలిన మనసును
మమతలతో చల్లార్చి
నెత్తురు సంతకాలు చేసుకున్నా
నా ఆనందం నా అక్షరమే
నా ఆగ్రహం నా అక్షరమే
నా హాస్యం నా అక్షరమే
నా కన్నీరు నా అక్షరమే
చివరకు నా జీవితం
నా అక్షరమే
నా అక్షర రత్నాలను భావాలుగా మలుచుకుని
మనసుపుస్తకంలో పదిలం చేసుకున్నా  
నేనున్నా లేకున్నా
నా సిరిసంపదలు కలకాలం ఉండవా
మనస్వినీ 

Monday, 30 May 2016

విరహగీతం

విరహగీతం

ఇంకా చీకట్లు పూర్తిగా తొలగిపోనే లేదు
సూరీడు ఇంకా నిద్దురలేవనేలేదు
గదిలో నేను ఇంకా కన్నులు తెరుచుకోనేలేదు
ఆ కోయిలకు మాత్రం తెల్లవారింది
మంద్రంగా మొదలైన కోయిలస్వరం
మెల్లమెల్లగా ఊపందుకుంది
శ్రావ్యమైన కోయిల గానానికి
పక్షుల కిలకిల రావాలకి
అప్రయత్నంగానే కళ్ళు తెరిచాను
అప్పుడే తెల్లారిందా అని
నిమిషాలు గంటలుగా గడుస్తున్నా
కోయిల గానం ఆగదు
ఆగదని నాకూ తెలుసు
రోజూ మాకిది మామూలే
మొదట్లో కోయిలగానం హాయిగానే ఉంది
తర్వాత కొద్దిగా అసహనం
ఇప్పుడు ఆ గానమంటే అభిమానం
ఎక్కడా లేని ఆరాధన
నిజం చెప్పాలంటే
ఆ కోయిలగానం గుండెను తాకుతోంది
మనసును మెలియపెడుతోంది
నాకు తెలుసు ఆ కోయిల తన నెచ్చెలిని పిలుస్తోందని
జతగోరిన మనసు
మనసైన తోడుకోసం ఆక్రందనలు చేస్తోందని
మా ఇంటి మామిడి చెట్టు కొమ్మలపై
ఆ కోయిల నిత్యం పాడుతూనే ఉంది
అలుపెరుగకుండా
గానామృతం పంచుతూనే ఉంది
శ్రావ్యమైన గొంతుకలో
ఏదో జీర పలుకుతోంది
అందరూ అది కోయిల గానమని మురిసిపోయినా
ఆ గొంతుకలో తెలియని వేదన
నా గుండెకు తగులుతూనే ఉంది
అన్నిపక్షులు వస్తున్నాయి చెట్టుపైకి
జతగా తోడూ నీడగా కువకువలాడుతున్నాయి
ఆ కోయిలేమో ఒంటరిది
ఎన్నటికీ రాని చెలియకోసం ఎదురు చూస్తూనే ఉంది
రోజులు గడుస్తున్నాయి
నెలలు మారిపోతున్నాయి
ఏమయ్యిందో ఏమో
ప్రియసఖి జాడ లేనే లేదు
అది తిరిగి రానే రాదు
ఆశ చావని కోయిల
గొంతు ఎత్తి పాడుతూనే ఉంది
విరహగానం వినిపిస్తూనే ఉంది
నాకు తలుసు ఆ మనసు విలపిస్తోందని
సజలనేత్రాలు ఎండిపోతున్నాయని
కోయిల గుండె మండుతూనే ఉందని
మనిషికే కాదు
ఆ కోయిలకూ మనసుందనీ
తోడు లేకపోతే
ఆ మనసూ విలపిస్తుందని తెలిసిన నా మనసు
ఆ విరహగీతం ముగింపును మనసారా కోరుతోంది
మనస్వినీ

Sunday, 29 May 2016

దేవుడిచ్చిన కానుకవే

దేవుడిచ్చిన కానుకవే

మొదటినుంచీ నాకు
ఒక లెక్క ఉంది
ఊహ మొగ్గ తొడిగిన నాటి నుంచీ
ఒకే భావముంది
ప్రాయం వికసించిన నాటి నుంచీ
నా ఊహలు
నా భావాలు
ఓ తెలియని ఆకారం వెంటే నడిచాయి
నా అక్షరాలు
నా కవితలు
నాకు తెలియనే తెలియని
ఊహా సుందరి చుట్టే తిరిగాయి
నా మనసు సొదలు తనకే చెప్పుకున్నా
నా ఆశలూ ఆకాంక్షలు తనతోనే పంచుకున్నా
తను లేకున్నా ఎప్పుడూ
నా ఎదలోనే ఉంది
ఆ అందం
ఆ పరువం
ఆ సోయగం
నిత్యం నా మనసు పుస్తకంలో
అందమైన అక్షరంలా మెరుస్తూనే ఉంది
నేను అతిలోక సుందరిని
ఊహించలేదు
కథలూ కథానికలలో మెరిసే
అప్సరస ను కోరుకోలేదు
నాకు నచ్చిన అందాన్ని కోరుకున్నా
నేను మెచ్చిన మనసును తలుచుకున్నా
నాతో మాట్లాడాలనీ
నాతోనే ఉండాలనీ
నా కోసమే నవ్వాలనీ
నా కోసమే తపించాలనీ
నా కోసమే కన్నీరు పెట్టాలనీ
ప్రతినిమిషం నేనే కావాలనీ
తానే నేనై
నేనే తానై
నిలిచిపోవాలనీ
అందమైన కలలకు ప్రాణం పోసుకున్నా
నీలోనే కనిపించింది నా మనసు
నీ నవ్వులోనే వికసించింది నా భావం
నీ కన్నులలో మెరిసింది నా స్వప్నం
ఊహలలో విహరించిన సుందరి నీవేనని
నమ్మింది నా మనసు
నీవూ నీ అందం
నీవూ నీ వ్యక్తిత్వం
నీవూ నీ మనసు
నీవూ నీ ఆవేశం
అన్నీ నా మనసులో దాగిన స్వప్నాలే
అన్నీ కలగిపిన నీవు
నాకు దేవుడిచ్చిన కానుకవు కాక ఇంకేమవుతావు
నీకు ఎంత సీన్ ఉందో
నీకెలా తెలుస్తుంది
మనస్వినీ

దేవుడికి థాంక్స్

దేవుడికి థాంక్స్

నువ్వూ నేనూ
ఎవరూ లేని చోటు
అవును
ఏకాంతంలో నా కాంతతో నేను
ఒకరినొకరం చూసుకుంటున్నాం
కొద్దిసేపు అన్నీ మరిచిపోయాం
ఒకరికోసం ఒకరం అనే భావనలో మునిగిపోయాం
ఏదో చెబుతున్నావు నువ్వు
సముద్రుడి హోరులో నీ మాటలు కలిసిపోతున్నాయి
వినలేని నీ పలుకులను
నేను వింటూనే ఉన్నా నా మనసుతో
నీ పలుకుల దొంతరలు
నవ్వుల పువ్వులు
మెత్తగా తగులుతున్నాయి మనసుకు
నీ భావాలన్నీ గమనిస్తున్నా
నీ హావభావాలు పరికిస్తూనే ఉన్నా
నువ్వు నవ్వుతూనే ఉన్నావు
ఇంకా ఏదో చెబుతూనే ఉన్నావ్
నేను మౌనమునిలా పలుకులు దాచుకున్నా
నా మనసు నీతో ముచ్చట్లు చెబుతూనే ఉంది
మనసు భాషలో నీతో మాట్లాడుతూ
నిన్నే చూస్తున్నా
కడలికెరటాలను మించిన పొంగులు
నీ ఎదపై భారంగా కదులుతున్నాయి
నిన్ను మించిన పరువం వచ్చేసింది అంటూ
పిల్లగాలులు కడలిని వీడి
నీ కురులను ముద్దాడుతూ ఉంటే
లయబద్దంగా కదిలే నీ ముంగురులు
కొత్త కథలేవో అల్లుతూనే ఉన్నాయి
సాయం సంధ్య వెలుగుల్లో నీ నయనాలు
చల్లని వెన్నెల కురిపిస్తూ ఉంటే
నా కనురెప్పలపై కొత్త స్వప్నాలేవో
కదలాడుతూనే ఉన్నాయి
నవ్వుతున్న నీ పెదాల మెరుపులను చూసి
నింగిలోని మెరుపులు చిన్నబోతూ ఉంటే
నా మనసులో ఏవో తెలియని భావాలు
మొలకలు వేస్తూనే ఉన్నాయి
అవును
ఏకాంతవేళ నా కాంత తళుకులు
ప్రకృతికే అందని సొగసులు
ఇలాగే ఉంటాం మనం
ఇలాగే ఉందాం మనం
నిన్నూ నన్నూ కలిపిన దైవానికి
రుణపడి ఉంటాం మనం
నా కోసం నిన్ను
దివి నుండి భువికి దించిన
దేవుడికి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటా
మనస్వినీ

Saturday, 28 May 2016

ఆ బాల్యం నాకెక్కడిది..?

ఆ బాల్యం నాకెక్కడిది..?
యే దౌలత్ భీ లేలో షోహరత్ భీ లేలో
భలే ఛీన్ లో ముజ్ సే మేరీ జవానీ
మగర్ ముజ్ కో లౌటాదే
బచ్ పన్ కా సావన్
వో కాగజ్ కి కష్తీ
వో బారిష్ కా పానీ
జగ్ జిత్ సింగ్ గళం నుండి జాలువారుతున్న
గజల్ వీనులకు విందు చేస్తుంటే
ఎంత కాదనుకున్నా
నా మనసు బాల్యం వైపు పరుగులు తీస్తుంది
బాల్యం తలపుల్లోకి వస్తే
ఒక్కసారి బాల్యం తలుపులు తెరిస్తే
ఎవరి మనసైనా
పులకించక మానదు
నాటి ఆటలు పాటలు
పసందైన గిల్లికజ్జాలు
వాననీటిలో కాగితం పడవల సయ్యాటలు
ఎంత అందమైన దృశ్యం
మరపురాని బాల్యం
మరి నా మనసుకు ఏమయ్యింది
బాల్యం మదిలోకి రాగానే
కళ్ళు ఎందుకు చెమర్చుతున్నాయి
మనసు ఎందుకు బాధగా మూలుగుతోంది
నాకూ అందరిలాగానే బాల్యం ఉంది
ఆటలూ ఉన్నాయి
పాటలూ ఉన్నాయి
కాగితం పడవలూ ఉన్నాయి
ఈ మధురిమలకు మించిన వేదనలూ ఉన్నాయి
కన్నీటి రోదనలూ ఉన్నాయి
అవును
అందరిలా గడిచిపోలేదు నా బాల్యం
తప్పటడుగులనుంచే
ముళ్ళబాటలు ఎదురయ్యాయి
నాకు బాగా గురుతు
నా చిన్ననాటి సంగతులు
కేరింతల చిన్నతనంలోనే
నాన్న పోయారు
అన్నమీదే భారమంతా
ఆరోజులు ఇంకా కళ్ళముందు తాజాగానే ఉన్నాయి
నాలుగు కిలోమీటర్ల దూరంలో మా పాఠశాల
నడుచుకుంటూనే వెళ్ళాలి
కాలి నడక తప్ప మరో మార్గం లేదు
కాళ్ళకు ప్లాస్టిక్ చెప్పులు
నడుస్తూ ఉంటే ప్లాస్టిక్ చెప్పులకు
మెత్తని నా పాదాలు కందిపోయి
పుళ్ళుగా మారిపోయాయి
రుధిరం స్రవిస్తున్నా నడక తప్పదు
స్కూల్ కి వెళ్లక తప్పదు
ప్రభుత్వప్రాయోజిత మధ్యాహ్న భోజనమే
ఇరవై నాలుగు గంటలకు సరిపడే ఆహారం
నాన్న లేరనే మిత్రుల సానుభూతి
గుండెకు ముల్లులా తగిలేది
అలా పది తరగతులు పూర్తి చేసుకున్నా
ఇక భారం కావద్దు ఎవరికీ అనుకున్నా
పగలంతా చదువులు
చీకటిపడితే బిస్కెట్ ఫ్యాక్టరీలో కొలువు
వచ్చిన ఆదాయంలో
కొంత చదువుకి
మరికొంత ఇంటికి
ఇలా చదువుతూనే అనేక పనులు
బిస్కెట్ ఫ్యాక్టరీ
కెమికల్ ఫ్యాక్టరీ
ఎలక్ట్రిక్ మోటార్ రిపేరింగ్
ఆటో డ్రైవర్ అవతారం
ఇలా అన్నింటిలో చెయ్యి పెట్టా
నా బాల్యాన్ని పూర్తిగా కోల్పోయా
అవును
అందుకే బాల్యం గురుతుకు వస్తే
కళ్ళు జలజలా స్రవిస్తాయి
మనస్వినీ

Friday, 27 May 2016

అంతిమగమ్యం

అంతిమగమ్యం 

శుక్రవారం
మధ్యాహ్నసమయం
మసీదుల్లో అజాన్ పిలుపు
దైవమే పిలుస్తున్న అనుభూతి
సైతాన్ ను జయించిన అనుభవం
ఇంకా నమాజుకు చాలా సమయమే ఉన్నా
అరగంట ముందుగానే మసీదుకు చేరుకున్నా
ఇంకా ఎవరూ రాలేదు
నేనూ ఒకరిద్దరు తప్ప
మండే ఎండలోనూ ప్రశాంతంగా ఉంది వాతావరణం
మెత్తని తివాచిపై గోడకు ఆనుకుని కూర్చున్నా
ఏదో తెలియని సాంత్వన మనసును ఆవరించింది
కొద్ది సేపు కనులు మూసుకున్నా
కళ్ళు తెరిచి చూస్తే
ఒక్కొక్కరు వస్తున్నారు
నాకు తెలిసినవారు కొందరు
తెలియనివారు మరికొందరు
హాయిగా అనిపించింది
అందరూ బంధువులుగానే కనిపించారు
ప్రతివారం వీరంతా వస్తారా
రారేమో
ఈవారం ఉన్నవారు మరువారం ఉండరేమో
తెలియని కొత్త మొహాలు కనిపిస్తాయేమో
అంతలోనే ఏదో తెలియనిభావం
ఈ రోజు నమాజుకు వచ్చిన నేను
మరువారం వస్తానా
ఏమో రానేమో
మనసును కుదుటపరుచుకున్నా
దైవానికి మాట ఇచ్చా
క్రమం తప్పకుండా వస్తానని
నీ బార్గాహ్ లో తలవంచుతా అని
శ్వాస ఆడినంతకాలమే కాదు
శ్వాస ఆగిన రోజు కూడా వస్తానని
అవును
నేను మాట తప్పను
జీవం కోల్పోయిన నా దేహం
అంతిమంగా చేరేది ఇక్కడికే
నా నమాజ్ ఎ జనాజా ఇక్కడే
నా అంతిమ గమ్యానికి చేరుకున్న
తన్మయత్వంలోనే
నమాజు పూర్తి చేసుకుని
ప్రసన్న వదనంతో
బయటికి అడుగులు వేసా
మనస్వినీ