Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 26 July 2017

నీ సేవకుడినై

నీ సేవకుడినై
బలమైన ఉక్కుదిమ్మలను
రాక్షస యంత్రాలు కరకరా నమిలేస్తున్నట్లు
మెదడు నిండా రణగొణధ్వనులను మోస్తూ
జిగేల్ మనే విద్యుత్ వెలుగుల్లోనూ
కారుచీకట్లను కనురెప్పలకు పులుముకుంటూ
విప్పారిన మనసుపుష్పంలో
వాడిన రేకులను ఏరుకుంటూ
మంటలు రేపిన సుగంధ ద్రవ్యాలను తుడిచేసి
తడియారని జ్ఞాపకాలను
రక్తపు మరకలుగా దేహానికి అద్దుకుని
రాళ్ళు రప్పల రాదారికి భీతిల్లి
పూల తివాచీ పరిచే నీ సన్నిధికి వస్తున్నా
నీ కొలువుకు సేవకుడినై

Saturday, 22 July 2017

స్రవిస్తున్న స్వప్నం

స్రవిస్తున్న స్వప్నం

ఎక్కడో స్రవిస్తోంది ఒక స్వప్నం
కరుగుతున్న కన్నీటి సవ్వడిలా
ఎక్కడో వినిపిస్తోంది ఒక రాగం
వసంతం వీడిన కోయిలగానంలా
ఎక్కడో రాలిపడింది ఒక నక్షత్రం
శిథిలమైన శిఖరంలా
ఎక్కడో గర్జిస్తోంది ఒక స్వరం
స్మశానంలో తీతువు పిట్ట హెచ్చరికలా
ఎక్కడో వణుకుతోంది ఒక హృదయం
మృత్యువును గాంచిన దేహంలా
కటిక చీకటిలో నడుస్తూ ఉన్నా
జ్ఞాపకాలన్నీ మూటగట్టుకుని
విరామమెరుగని బాటసారిలా

Friday, 14 July 2017

వేకువైనా వెన్నెలైనా

వేకువైనా వెన్నెలైనా 

పిశాచ గణాలు కత్తులు దూస్తున్నాయని
స్వాప్నికలోకం వీడి పారిపోను  
సరసంగా పలకరించే స్వప్నిక కోసం
నిత్యం కలలు కంటూనే ఉంటాను
రగులుతున్న నిప్పురవ్వలు కాల్చేస్తాయని
బాటను మార్చుకోను
ఎక్కడైనా పువ్వులు పాదాలను తాకుతాయని
ఆశపడుతూనే ఉంటాను
పదును తేలిన ముళ్ళు గుచ్చుకుంటాయని
గులాబీని విసిరేయను
సుగంధ పరిమళం కోసం ముద్దాడుతూనే ఉంటాను
తూటాలు దిగబడుతున్నాయని  
గుండెను ఉక్కు కవచంలా మార్చుకోను
మనసును తాకే మధురిమ కోసం
హృదయఫలకాన్ని పరిచే ఉంచుతాను
వేకువలోనూ వెన్నెలలోనూ
రగిలే మంటలోనూ
కురిసే హిమవర్షంలోనూ
నేను నిత్యం శ్వాసిస్తూనే ఉంటాను
మనస్వినీ

Tuesday, 11 July 2017

పూజకు పనికిరాని పువ్వులు కాదు

పూజకు పనికిరాని పువ్వులు కాదు

ప్రేమతో చూస్తే
ప్రేమగానే పలకరిస్తాయి
నా అక్షరాలు
చల్లని మనసుతో చూస్తే
వెన్నెల వానై కురుస్తాయి
నా అక్షరాలు
వేదన మనస్వివై తడిమి చూస్తే
కన్నీరు మున్నీరుగా విలపిస్తాయి
నా అక్షరాలు
ఆగ్రహమై ఎదుట నిలిస్తే
చితిమంటలై రగులుతాయి
నా అక్షరాలు
వక్రబుద్ధితో చూస్తే
అష్టావక్ర వలయాలుగా చుట్టుకుంటాయి
నా అక్షరాలు
దుష్ట మనసుతో ఎదురుపడితే
విప్లవ జ్వాలలుగా మండిపడతాయి
నా అక్షరాలు
పూజకు పనికిరాని పువ్వులు కాదు
నా అక్షరాలు
నా పార్థీవ దేహంపై
గుభాళించే పరిమళాలు
నా అక్షరాలు
మనస్వినీ 

Saturday, 1 July 2017

సమరం నీకూ నాకూ

సమరం నీకూ నాకూ 

అనుభవాలనే దీపాల వెలుగులో
జ్ఞాపకాల తివాచిపై
ఆలోచనల దుప్పటి కప్పుకున్న నేను
సేదతీరుతున్నా కన్నులలో
కలలను నెమరు వేసుకుంటూ...
నన్ను తాకీ తాకని వెలుగురేఖలు
మెల్లగా కరిగిపోతున్నాయి
కమ్ముకుంటున్న చీకటిలా...
ఆలోచనల దుప్పటిని మెల్లగా తొలగించి
కన్నులు తెరిచి చూసాను
నాకు లీలగా తెలుస్తోంది
నువ్వు చేరువలోనే ఉన్నావని...
అవును నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు
నాకు ఎదురుగా
నాకు ఆ పక్కనా ఈ పక్కనా
వెనుకా ముందూ నువ్వే ఉన్నావు...
నా ఆలోచనలు నిత్యం నీ చుట్టే
తిరుగుతూ ఉంటాయి...
నువ్వు నాతోనే నడుస్తున్నావు
నాకు ముందు నువ్వు నడుస్తూ ఉంటే
నాకు తెలియకుండానే నిన్ను అనుసరిస్తూ ఉన్నాను
నిన్ను దాటి నేను అడుగులు వేస్తె
నా అడుగు జాడవై
నువ్వూ నడుస్తున్నావని తెలుసు...
చీకటి వెలుగుల దొంగాటలా
వెలుగూ నీడల దోబూచులాటలా
పున్నమిని మింగివేసే అమవస రక్కసిలా
కటిక చీకటిని చిదిమివేసే చల్లని వెన్నెలలా
సమరం నీకూ నాకూ మధ్య
ఇది నాకు బాగా తెలుసు...
నేను నీకు చిక్కినా
నువ్వు నన్ను అందుకున్నా
నన్ను మరో లోకానికి
తరలించుకు పోతావనీ తెలుసు
జ్ఞాపకాల దీపాలు మరలా వెలగటంతో
ఆలోచనల దుప్పటిని మళ్ళీ కప్పుకున్నా
మనస్వినీ...