వేకువైనా వెన్నెలైనా
పిశాచ గణాలు కత్తులు దూస్తున్నాయని
స్వాప్నికలోకం వీడి పారిపోను
సరసంగా పలకరించే స్వప్నిక కోసం
నిత్యం కలలు కంటూనే ఉంటాను
రగులుతున్న నిప్పురవ్వలు కాల్చేస్తాయని
బాటను మార్చుకోను
ఎక్కడైనా పువ్వులు పాదాలను తాకుతాయని
ఆశపడుతూనే ఉంటాను
పదును తేలిన ముళ్ళు గుచ్చుకుంటాయని
గులాబీని విసిరేయను
సుగంధ పరిమళం కోసం ముద్దాడుతూనే ఉంటాను
తూటాలు దిగబడుతున్నాయని
గుండెను ఉక్కు కవచంలా మార్చుకోను
మనసును తాకే మధురిమ కోసం
హృదయఫలకాన్ని పరిచే ఉంచుతాను
వేకువలోనూ వెన్నెలలోనూ
రగిలే మంటలోనూ
కురిసే హిమవర్షంలోనూ
నేను నిత్యం శ్వాసిస్తూనే ఉంటాను
మనస్వినీ
No comments:
Post a Comment