Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 31 August 2020

చీకటివెలుగులు


చీకటివెలుగులు
అవి నవ్వులా
నింగి తారల తళుకులా...
అవి విషాద వీచికల
వైరాగ్యపు జల్లులా...
ఏమైతేనేమి
కురిస్తే కురవనీ
కన్నీటి వానలు
జారితే జారనీ
ప్రమోదాల మెరుపులు...
అవి వెండి వెన్నెలను మింగిన
కరి చీకటి తెరలా
అవి చీకటి పోరులో
అలసి సొలసిన వెన్నెల అలలా...
ఎలాగైతేనేమి
కమ్ముకొనీ అంధకారం
ఈ పుడమిని
ఓడించనీ చంద్రకిరణాలు
ఈ చీకటిని...
చీకటివెలుగుల పోరాటంలో
జాబిలిని కాను నేను
ఆశ నిరాశల ఆరాటంలో  వెలుగులను కమ్ముకునే
గ్రహణాన్ని కానేకాను...
చీకటిని ఓడించక
వెన్నెలను గెలవలేక
మౌనమై నిలిచిన
ఒక వ్యర్ధ పదార్థాన్నే నేను
మనస్వినీ...

Sunday 30 August 2020

మంచివాళ్ళంటే భయం నాకు


మంచివాళ్ళంటే భయం నాకు
గుప్పిట మూసి నడవాలిక్కడ
గుప్పిట్లో ఏదో ఉందని నమ్మిస్తూనే ఉండు
ఏమీలేదని తెలిసిందో
మంచితనం ముసుగు
తొలిగిపోవటం ఖాయం
మంచివాళ్ళు నిన్ను వెలివేసేస్తారు...
పంటికింద వేదనను అదిమి
పెదాలపై చిరునవ్వును
పులుముకో
మంచివాళ్లందరూ
నీ చుట్టూనే ఉంటారు...
కడుపులో ఆకలి కేకలు వేస్తున్నా
పదిమందికి అన్నం పెడుతున్నా అని చెప్పుకో
మంచివాళ్ళు నీకు భజన చేస్తారు...
ఉన్నాడో లేడో  తెలియని దేవుడు ఉన్నాడనే నమ్ముకో
కాదని అన్నావో మంచివాళ్ళు నీ తల తీసేస్తారు...
ఏది చేసినా నీ మతం నీ కులం పరిధులను దాటకు
గీత దాటేసావో
ఈ మంచివాళ్ళు నిన్ను వీధిలోకి లాగేస్తారు
ప్రతి అడుగులో మంచితనం నటించు
ప్రతి చర్యలో సంస్కారం చూపించు
అవి నీలో ఎంతమాత్రం లేకున్నా...
ఎందుకంటే ఈ ప్రపంచమంతా
మంచివాళ్ళతో
సంస్కారవంతులతో
నిండి ఉంది...
జీవితాలను శాసిస్తున్న
మంచివాళ్లను చూస్తుంటే
నేనెక్కడ మంచివాడినైపోతానో అని భయమేస్తోంది
మనస్వినీ...

Saturday 29 August 2020

మెదడుపై దండయాత్ర


మెదడుపై దండయాత్ర
గాలి కూడా మౌనమైన వేళ
నిశీధిలో నిశబ్ధం రాజ్యమేలుతున్న వేళ
సుతిమెత్తగా
ఎక్కడో మువ్వల సవ్వడి
ఆ రవళి నీ అందియలదేనా
మౌనం దాల్చిన మనసులో సన్నగా రేగుతున్న ప్రకంపనలు నీ పద మంజీరాలేనా...
ఆలోచనలకు స్వస్తి చెబుతూ కనులు భారంగా
మూసుకుపోతున్న ఘడియలో
నా కనురెప్పలపై  వెచ్చగా తగులుతోంది ఏమిటది
నువ్వేనా
అది నీ శ్వాసేనా...
చెవులను తాకుతున్న
ఏదో మంద్రమైన స్వరం నన్ను తట్టి లేపుతోంది
అది నీ తీయని పిలుపేనా...
ఈ ఘడియ నువ్వు నాతో లేవు
అది నాకు తెలుసు
నీకూ తెలుసు
అది నా మనసుకు తెలియనట్టుంది
అందుకే నువ్వు లేకున్నా
ఉన్నట్టే భ్రమిస్తోంది చూడు...
మనసును మొత్తం ఆక్రమించుకున్న నువ్వు
మెదడుపైనా దండయాత్ర చేస్తున్నావా
నేనెక్కడున్నా
నువ్వు నాతోనే ఉన్నట్టు
నమ్మిస్తున్నావుగా
మనస్వినీ...

Friday 28 August 2020

నేనంటే నేనే


నేనంటే నేనే

నా నడక నాకిష్టం
నా నడత నాకిష్టం
నా హాస్యం నాకిష్టం
నా లాస్యం నాకిష్టం
నారౌద్రం నాకిష్టం
నా మాట నాకిష్టం
నా విజయం నాకిష్టం
నా ఓటమి నాకిష్టం
నా అభిమానం నాకిష్టం
నా పొగరు నాకిష్టం
ఎవరికి ఇష్టమైనా కాకున్నా
అందరికన్నా
నేనంటేనే నాకిష్టం...

నేనెవరినో..


నేనెవరినో..

అవును ఎవరిని నేను
రెక్కలు తెగిన ఊహను నేను
నడక మరిచిన పాదాన్ని నేను
దౌడు తెలియని అశ్వరాజము నేను
మెరుపులు మాసిన చిరునవ్వును నేను
నలుపుదేలిన కంటికి వెన్నెలను నేను
విజయాలను జారవిడిచిన
పరాజయాన్ని నేను
అందాల పూలవనంలో శాపగ్రస్త ముల్లును నేను
ఇంతకీ ఎవరిని నేను
సమాధానమే తెలియని ప్రశ్నను నేను...

Thursday 27 August 2020

స్వప్నలోకం


స్వప్నలోకం
ఆ ఇసుక తిన్నెలపై మళ్ళీ
నీతో కలిసి అడుగులు
వేయాలని ఉంది...
పరవళ్లు తొక్కుతున్న అలలను చూస్తూ
సముద్రుడి హోరులో
నీతో మౌనంగానే
ఊసులాడాలని ఉంది...
నిన్ను ఉడికిస్తూ కవ్విస్తూ
కొంటెగాలి చేస్తున్న అల్లరిలో
చెదిరిపోయిన నీ కురులను
సవరించాలని ఉంది...
నిండు జాబిలి నీడలో
పున్నమిలా వికసించిన
నీ దరహాస చంద్రికలను
దోసిట పట్టాలని ఉంది...
ఈ కాలం నుంచి ఆ కాలంలోకి జారిపోతూ
స్వప్నలోకంలో
మళ్ళీ మళ్ళీ విహరిస్తూనే ఉంటా
మనస్వినీ...


Wednesday 26 August 2020

అగ్నికణం


అగ్నికణం
నువ్వు మోసపోతే
అది నీ మూర్ఖత్వం
నువ్వు దగాపడితే
అది నీ పిరికితనం
నువ్వు పరాధీనమైతే
అది నీ వైఫల్యం
ప్రశ్నించటం మొదలుపెడితే
నీకు నువ్వే ఒక సమాధానం
ఎదురు తిరిగే ధైర్యం నీకుంటే
నువ్వే ఒక మహా సైన్యం
పొలికేక నువ్వు వేస్తే
అది ఒక శంఖారావం
నేను రాస్తూనే ఉంటా
నా అక్షరం ఒక అగ్నికణం...

ఎలా?


ఎలా?
ఇంకా నాకు ఏ గుణమూ అబ్బలేదు
మంచివాళ్లను ఎలా గుర్తించను?
ఇంకా నేను తప్పటడుగులే
మరిచిపోలేదు
శిఖరమై ఎలా నిలబడను?
ధూషణలే ఇంకా మరువలేదు
సుభాషితాలు ఎలా పలకను?
ఓటమినే పూర్తిగా ఆస్వాదించలేదు
విజయం వైపు ఎలా పరుగులు తీయను?

Sunday 23 August 2020

మనస్వినీ సమేత


మనస్వినీ సమేత
అదిగో చూడూ
ఆ కొమ్మల మాటున
ఏదో సవ్వడి
పచ్చని ఆకులను దుప్పటి చేసుకుని
ఆ గువ్వలు రెండు వెచ్చగా
జతగూడుతున్నాయేమో...
అదిగో
అల్లంత దూరాన
ఏదో తీయని పిలుపు
మంద్రంగా వీనులను
మీటుతోంది
అది కోయిల రాగమా
కాదేమో
ఆ గుబురు చెట్ల చాటున
విరహిణియైన మయూరం
మనసైన జత కోసం ఆర్తిగా
పిలుస్తోంది...
ఆ పైరగాలి చూడు
సొగసుగా సుగంధాలు వెదజల్లుతోంది
పచ్చని చేల గుండెలను
సుతిమెత్తగా మీటుతూ
గిలిగింతలు రేపుతున్నట్లుగా లేదూ...
మనస్వినీ సమేత
నా మనసు జనారణ్యాన్ని వీడి
హరితలోకంలో అడుగిడిన వేళ
కొత్త భావాలేవో రాసుకుంటూనే ఉంది...

Saturday 22 August 2020

ప్లానింగ్ లెస్ లైఫ్...


ప్లానింగ్ లెస్ లైఫ్...
నేడిలా రేపెలా అన్నది నేను ఆలోచించనే లేదు...
రేపటికోసం ప్రణాళిక లేదు
నేటిపై చింతలేదు
కాలానికి సంకెలలు వేయలేదు...
ఊహ తెలిసిన నాటినుంచే
కాలానికి తలవంచా...
నేటిని కొద్దిగా బంధించి
రేపటికోసం దాచుకోలేదు...
కాలం చూపిన బాటలోనే నడిచా
కాలం ఇచ్చిన అనుభవాలనే చవి చూసా...
ఇప్పుడిలా జరిగింది
రేపెలా జరుగుతుందోనన్న
భయం లేనేలేదు
ప్రతిపరిణామాన్ని ఆస్వాదించా...
నేడు మంచి జరిగినా
రేపు చెడు జరుగుతుందని తెలిసినా
కాలం మాటే విన్నా...
ప్రణాళికలు లేవు
పథకాలు లేవు
ఏది జరిగినా అది నా నిర్ణయమేగా అనుకుని
కాలాన్ని ప్రేమిస్తూనే నడిచా...
ఫలితం ఇప్పుడు నాజీవితం
మేడిపండు కంటే
అందంగా మెరుస్తోంది...

Friday 21 August 2020

పిచ్చిమాలోకం


పిచ్చిమాలోకం
నిజంగా నువ్వు
పిచ్చి మాలోకానివే
ఎంత అమాయకంగా అడిగావు
నేను గుర్తుకొస్తానా నీకూ అని..
అది అమాయకత్వమా
లేక పిచ్చితనమా
అలా ఎలా అడిగేసావు...
ఏమని సమాధానం చెప్పను
ఏ రీతిన నమ్మకం కలిగించను...
పల్ పల్ దిల్ కే పాస్
తుమ్ రహెతీ హో
అంటూ శ్రావ్యమైన గీతంతో అలరించాలంటే
నేను గాయకుడిని కానుగా...
ఓ అందమైన గజల్ కానుకగా ఇచ్చుకోనా
తీయని ఉర్దూ అక్షరాలు
నాకు పరిచయమే కాలేదే...
ఏ భాషలో చెప్పను నీకు
నువ్వు నాలోనే ఉన్నావని...
ఏ అక్షరమాల కట్టను నీకోసం నేను నీ చుట్టే ఉన్నానని...
అక్కడ ఉన్నా
ఇక్కడ ఉన్నా
మరెక్కడ ఉన్నా
నా గుండె సవ్వడిలో
నా పిచ్చిమాలోకం
కదలాడుతూనే ఉంటుందని నిన్నెలా
నమ్మించను
మనస్వినీ...

రంగస్థలం


రంగస్థలం
రంగస్థలమిది
ఇక్కడ రంగులే వేసుకోవాలి...
కాలమాడే నాటకంలో
ఒక మంచి పాత్రవై ఒదిగిపోవాలి...
నీ రంగును దాచేందుకు
కత్తిమీద సాము చేయాలి...
నవ్వే కళ్ళల్లో
కన్నీరే చూపాలి...
ఏడుపే నీకు వస్తే
ఆనంద భాష్పాలని
నమ్మించాలి...
ఆకలికేకలు వెన్నాడుతున్నా
కడుపు నిండా ఉందని చెప్పాలి...
భుక్తాయాసంలోనూ
ఆకలి మంటలు చూపాలి...
నీ మనసు నల్లనిదైతే
తెల్లరంగు వేసుకోవాలి...
పాలవంటి మనసే నీదైతే
నల్లరంగు పులుముకోవాలి..
నీలా నువ్వుకాదు
మరొకరిలా ఉండాలి...
మోసపోవడమే కాదు
ద్రోహానికీ సిద్ధపడాలి...
జీవించకు ఇక్కడ
నటన తెలిస్తే చాలు
ఎందుకంటే
ఇది రంగస్థలం...

Thursday 20 August 2020

సమాధులనుంచి లేచివచ్చిన శవాలు..(PART-29)


సమాధులనుంచి లేచివచ్చిన శవాలు..(PART-29)

అక్కడ శవాలు లేచివచ్చాయ్..
ఆత్మలు మాట్లాడుతున్నాయ్..
ఎవరివా శవాలు..
ఆత్మలు ఎలా మాట్లాడుతున్నాయ్..
ఒళ్ళు గగుర్పొడిచే ఘటన..
ఎక్స్ క్లూజివ్ స్టోరీ
రాత్రి ఏడున్నర గంటలకు.
మీ జీ ఇరవైనాలుగు గంటలు ఛానల్ లో..
శవాల గుట్టు తెలుసుకోవాలంటే
డోంట్ మిస్... at 7:30 pm..
ఇది ఒక ప్రోమో... నేను జీ 24గంటలు ఛానల్ లో ఉన్నప్పుడు సంచలనం రేపిన ప్రోమో ఇది.. ఆరోజు ఉదయం పది గంటల నుంచి ప్రతి అరగంటకు ఒక సారి ప్లే అయిన ఈ ప్రోమో నా కెరీర్ లో అత్యంత సంచలన ఘటనల్లో ఒకటి.. ఈ ప్రోమో ప్రేక్షకుల్లో రేపిన ఉత్సుకత అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా తెలుగు న్యూస్ మీడియాలో ఇది ప్రకంపనలే రేపింది.. అన్ని చానల్స్ క్రైమ్ రిపోర్టర్లకు ఒక సవాలుగా మారింది.. జీ 24 లో ఏదో బిగ్ ప్రోమో నడుస్తోంది. ఏంటా శవాల కథ అంటూ అందరూ ఉరుకులు పరుగులు తీస్తుంటే నేను చిద్విలాసంగా నవ్వుతూ ఆఫీసులో ఎంజాయ్ చేసాను. ముఖ్యంగా అప్పుడు మాకు tv9 టార్గెట్.. పదిమంది క్రైమ్ రిపోర్టర్లతో పెద్ద నెట్ వర్క్ ఉన్న tv9 లో మా బ్రేకింగ్ కలకలం రేపింది.. నాదేమో చిన్న టీమ్ నాకింద ఇద్దరు క్రైమ్ రిపోర్టర్లు, గుప్పెడంత మంది స్ట్రింగర్లు.. తరచుగా ఏదో ఒక స్టోరీతో tv9 ను చికాకు పరిచే నేను ఆరోజు ఈ బిగ్ బ్రేకింగ్ తో చెమటలు పట్టించాను.. ఏదో జరుగుతోంది..
ఏదో పెద్ద స్టోరీయే ఉంది
వివరాలు చెప్పకుండా ప్రోమో నడిపిస్తున్నావ్
అసలు విషయం చెప్పకున్నా ఫుల్ స్టోరీ ఎప్పుడో చెప్పు అని ఒక సీనియర్ క్రైమ్ రిపోర్టర్ నా మీదకు ఒత్తిడి తెచ్చాడంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి.. నేనెవరికీ ఏమీ చెప్పలేదు..
సాయంత్రం దాకా ఆ సస్పెన్స్ ను ఎవరూ ఛేదించలేకపోయారు.. రాత్రి 7:30 బులెటిన్ లో ఆ స్పెషల్ స్టోరీ టెలికాస్ట్ అయ్యింది.
నిజంగానే శవాలు మాట్లాడాయా..
మాట్లాడాయా అంటే మాట్లాడాయి మరి.. ఇంకా సస్పెన్స్ ఏంటీ అని విసుక్కుంటున్నారా.. అయితే చెప్పేస్తా మరి..
ఒక అవకాశాన్ని అందరికంటే భిన్నంగా మనకు అనుకూలంగా మార్చుకుని న్యూస్ ని సెన్సేషనల్ గా మార్చుకున్న చిన్న టెక్నీక్ ఇది.. ఆరోజు ఇది బాగా క్లిక్ అయ్యింది. ఆ స్టోరీకి మంచి రేటింగ్ రావడంతో మా బాస్ శైలేష్ రెడ్డి నన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆరోజు ఏదో పని ఉండి ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీసుకు వెళ్లాను. బాల్కనీ లో నిలబడి నేనూ శైలేష్, మా ఔట్ పుట్ ఎడిటర్
రమేష్ సిగరెట్లు కాలుస్తున్నాం.. అంతలోనే నా మైబైల్ రింగ్ అయ్యింది. మా ఓల్డ్ సిటీ రిపోర్టర్ ఇబ్రహీం లైన్ లో ఉన్నాడు.. సార్ వారం కింద పహాడీ షరీఫ్ పియస్ లిమిట్స్ లో జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఏదో ట్విస్ట్ ఉంది అది మర్డర్ అని అంటున్నారు. ఈరోజు శవాలను వెలికి తీసి రీ పోస్టుమార్టం చేస్తున్నారు అని చెప్పాడు. నేను వెంటనే ఈ విషయం వేరే మీడియాకు తెలుసా అని అడిగాను.. ఎవరికీ తెలియదు సార్ అని బదులిచ్చాడు. సరే నువ్వు వెళ్ళు ఎట్టిపరిస్థితిలోనూ నువ్వెక్కడున్నావో ఎవరికీ చెప్పకు జస్ట్ నా ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయాలి అంటూ కొన్ని సూచనలు చేసాను.. వెంటనే మన క్రైమ్ బుర్ర యాక్టివ్ అయిపోయింది.. బాస్ కు విషయం చెప్పేసా ఇలా చేయబోతున్నా అంటూ.. మరు నిమిషంలో ఆ కేసు చూస్తున్న పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేసా.. ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. రీ పోస్టుమార్టం విషయం కొన్ని గంటలపాటు మీడియాకు చెప్పకుండా ఉండగలరా అని ఆయన్ను రిక్వెస్ట్ చేసా.. అసలు నీకెవరు చెప్పారు.. నాకు మీడియాకు చెప్పాల్సిన అవసరమే లేదు అని ఆయన బదులిచ్చారు.. ఒకే కొన్ని గంటలపాటు ఇదే మెయింటేన్ చేయండి అన్నా.. అసలు ఎవరికీ అక్కడ పర్మిషన్ లేదు నేనెవరికీ చెప్పను అని ఆయన బదులిచ్చారు.. ఒకే మా ఇబ్రహీం వస్తున్నాడు అతనికి కోఆపరేట్ చేయండి. అవసరమైతే మా కెమెరా విజువల్స్ నే మీ రికార్డ్ గా తీసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసా.. ఇదంతా నిమిషాల్లో అయిపోయింది. రెండు నిమిషాల్లో ప్రోమో టెక్స్ట్ రాసేశా... మా ప్రోమో డిపార్ట్ మెంట్ పది నిమిషాల్లో అద్భుతమైన ప్రోమో రెడీ చేసింది. మా ఔట్ పుట్ ఎడిటర్ గోపాల రమేష్ అది ప్రతి అరగంటకు టెలికాస్ట్ అయ్యేలా షెడ్యూల్ చేశారు. అంతే తెలుగు మీడియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు విషయం చెప్పకుండా ఎక్కడా రివీల్ చేయకుండా నడిచిన ఆ ప్రోమో సూపర్ హిట్ అయ్యింది. రీపోస్టుమార్టం విజువల్స్ తో హంతకుల గుట్టు చెప్పిన శవాలు అంటూ స్పెషల్ స్టోరీ నడిపాం.. నిజానికి ఇక్కడ పెద్ద విషయం ఏమీ లేదు.. పోటీ ప్రపంచంలో ప్రత్యర్థిని చికాకు పర్చడంతోపాటు స్టోరీని బాగా అమ్ముకునే చిన్న జిమ్మిక్కే ఇది.. కాకపొతే సమయస్ఫూర్తి, అందరి సహకారం వల్లే ఇది సాధ్యమయ్యింది.. ఇప్పటి మీడియా ఎక్స్ క్లూజివ్ మరిచిపోయింది. ఏ న్యూస్ అయినా ఆఫీసుకు పంపడం కంటే ముందు మీడియా గ్రూప్ లలో పెట్టడం ఇప్పటి క్రైమ్ రిపోర్టర్లకు స్టేటస్ సింబల్ గా మారింది..

నా అక్షరాలు


నా అక్షరాలు

సిగ్గుతో వాలిన నీ కనురెప్పల చాటున
జారిపడే వెన్నెలలో
వికసించే కలువలే
నా అక్షరాలు...
విరిసే నీ అధరాల నవ్వుల వానలో తడిసే కైపులే
నా అక్షరాలు...
విరబోసిన నీ కురులలలో
గుబాళించే పరిమళాలే
నా అక్షరాలు...
నీ మృదువైన పాదాలను అల్లుకుని సవ్వడి చేసే
మంజీరాలే
నా అక్షరాలు...
నీ సాన్నిహిత్యంలో పొంగే
మధుకలశాలలో
అమృత ధారలే
నా అక్షరాలు...
నా మనసులో జనియించి
నీ చుట్టే తిరుగుతూ
నిన్ను నా కన్నా ఎక్కువగా
ఆరాధించే
నా అక్షరాలను చూసి
నాకే అసూయ కలుగుతోంది
మనస్వినీ...

Wednesday 19 August 2020

దేవుడు చేసిన మనిషిని



దేవుడు చేసిన మనిషిని


అదిగదిగో

ఆ సమూహం అటుగా దూసుకుపోతోంది

నా పాదాలు ఎందుకు ఆ వైపు పడటం లేదు

నా దిశ ఆ దిశ

కావటం లేదెందుకు...

అదిగో ఆ గొంతు పిక్కటిల్లుతోంది

వేలగొంతులు ఆ గొంతుకు శృతి కలుపుతున్నాయి

నా గొంతు ఎందుకు మౌనంగానే ఉంది...

అదిగో అతనెవరో నాయకుడై నిలిచాడు జనమంతా జయజయ 

ధ్వానాలు పలుకుతున్నారు

చిద్విలాసంగా నేను నవ్వుకుంటున్నా ఎందుకు...

అదిగో అక్కడ మతం కోసం కొట్టుకు చస్తున్నారు

దేవుడి గుళ్లను తగులబెట్టుకుంటున్నారు

అక్కడెక్కడా నాకు మతమే కానరావడం లేదెందుకు...

తేడా ఎక్కడుంది

నేనా మనిషిని వారా మనుషులు...

సందేహమే లేదు

వారంతా దేవుడిని సృష్టించిన మనుషులు

నేను దేవుడు చేసిన మనిషిని..