Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 26 June 2020

అభినందనలు మనస్వినీ


అభినందనలు మనస్వినీ
నిన్ను ప్రేమించి గొప్పవాడిని కాలేదు నేను
నీ ప్రేమను పొంది పునీతుడినయ్యాను నేను...
మన ప్రేమను కొలిచేందుకు అక్షరాలు లేవు నాదగ్గర
నీ ప్రేమ సాగరంలో అవెప్పుడో కొట్టుకుపోయాయి....
మన వివాహబంధం
మరో వసంతంలోకి అడుగిడిన వేళ
శుభాభినందనలు
మనస్వినీ

Tuesday 23 June 2020

గుడిలో దేవుడివే నువ్వు..


గుడిలో దేవుడివే నువ్వు..
దగా పడ్డావేమో
అణచివేతకు గురయ్యావేమో
పొలిమేరల ఆవలికి నెట్టివేయబడ్డావేమో
అడవిగుండెల్లో తలదాచుకున్నావేమో
సత్తువచచ్చి పీనుగులా మారావేమో
ఇంకా భయమెందుకు నీకు
జారిపోతున్న ఊపిరిని బిగబట్టు
నీ స్వప్నాన్ని తలచి
కొత్త సత్తువ తెచ్చుకో
పిడికిలి బిగించు
సింహమై గర్జించు
నీ పోరుకు ఎర్రజెండాయే ఎందుకు
నీ ఆకుపచ్చ చొక్కాను
నీ నీలం రంగు కండువాను
కలిపి ముడివేసేయ్
కొత్త జండాను ఎగురవేసేయ్
నీ రక్తం లో తడిస్తే
అది ఎర్ర జెండాయే గుర్తుంచుకో
భయపడి పారిపోకు
పోరాటం మరిచిపోకు
ఎవరు నిన్ను మరిచినా
ఈ చరిత్ర మాత్రం గుండెల్లో దాచుకుంటుంది
చరిత్ర గుడిలో దేవుడివే నువ్వు మిత్రమా..


అదే చరిత్ర


అదే చరిత్ర
అదిగో అస్తమిస్తున్న సూరీడు
బోసిపోయిన పుడమి నుదుటన
సింధూరం అద్దుతున్నాడు
అక్కడెక్కడో చిన్న సవ్వడి
పోలికేకకు ఊపిర్లు పోస్తోంది
ఎవరో ఆ పల్లెపడుచు
జానపదంలో జనావేశం
నింపుతోంది
అణగారిన యువత
ప్రజానాట్యం కోసం గజ్జెలను సవరిస్తోంది
దగాపడిన పల్లె మరోపోరుకు బలం కూడదీస్తోంది
రంగుమారిన చరిత
పునరావృతమై పులకించాలని తలఎత్తి పిలుస్తోంది

నేనెవరిని?


నేనెవరిని?

మనిషినా
మృగాన్నా
దేవుడినా
రాక్షసుడినా
నాయకుడినా
ప్రతినాయకుడినా
మంచివాడినా
మోసగాడినా
నమ్మకమైన వాడినా
ద్రోహం చేసేవాడినా
ఏమో ఎవరికి తోచిన
ముసుగు వారు తొడిగేస్తున్నారు
నాకే తెలియని రూపాలను
నాకు అంటిస్తున్నారు
నాకులేని గుణగణాలను
నాపై ముద్రిస్తున్నారు
ఇన్ని రూపాల పరంపరలో
ఎక్కడ కోల్పోయానో తెలియక
నన్ను నేను వెతుకుతూనే ఉన్నా...

Monday 15 June 2020

ఇలాగే వెళ్ళపోతా...


ఇలాగే వెళ్ళపోతా...
మెట్లు ఎక్కడం తెలుసు
కిందికి దిగటమూ తెలుసు
నింగికి నిచ్చెన వేయడం తెలుసు
నేలను ముద్దాడటమూ తెలుసు
అయినా మనిషిని మారలేదు
నా మనసూ మారలేదు
ఇలాగే ఉన్నాను
ఇలాగే వెళ్ళిపోతాను....

Sunday 14 June 2020

ధైర్యం కోసం


ధైర్యం కోసం
అదిగో ఆ మూలమలుపులో
పక్క సందులో
ఊరి పొలిమేరల్లో
బీటలు వారిన పొలంలో
చెమట కంపు కార్ఖానాల్లో
అలసటెరుగని నడకలో
జలజల జారే కన్నీటి చుక్కల్లో
విసిగిపోయిన మెదడులో
పగిలిపోయిన గుండెల్లో
రాయి విసురుతున్న
పిచ్చోడి నవ్వుల్లో
దాగి ఉంది ధైర్యం
ఈ ప్రపంచాన్ని ఓడించేంత....
పరుగులు తీస్తున్నా
ఆ మలుపులవైపు
కాసింత ధైర్యం కోసం
ఈ లోకాన్ని ఓడించి వెళ్ళాలనీ...

కరిగిపోతున్నా...


కరిగిపోతున్నా...
 
అనిర్వచనీయ భావాలేవో
మెదడుని తొలిచేస్తున్నాయి
అర్థం కాని ఆలోచనలేవో
సాలెగూడులా అల్లుకుంటున్నాయి
ఒక ఆలోచన ఒక భావానికి
ప్రాణం పోస్తుంటే
అప్పుడే జనియించిన మరో భావం దాన్ని నిర్దయగా చంపేస్తోంది
మరణించిన ఓ భావం లక్ష భావాలకు జన్మనిస్తోంది
భావసమరంలో మస్తిష్కం
శవాల దిబ్బలా మారుతోంది
భావాల శరపరంపరలో
గాయపడుతూ
ఆలోచనా తరంగాలలో
కరిగిపోతూ
పరుగులు తీస్తూనే ఉన్నా
సరికొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తూ.... 

Wednesday 10 June 2020

తొలకరి సవ్వడి..

తొలకరి సవ్వడి..
మంద్రమైన సవ్వడితో
ఏకధారగా వర్షం
జడివాననేమో
అవునో కాదో తెలియదుగానీ
ఆ వాన సవ్వడి నాకిష్టం
లేలేత మామిడాకులను
వయ్యారంగా ముద్దాడుతున్న వానచినుకులు
ఆ మారాకు పులకించిందేమో
సిగ్గుతో జారిపడుతున్న
వానచినుకు నేలను
తాకుతున్న వేళ
ఓ అందమైన మెరుపు
వాహ్... ఎంత పసందైన దృశ్యం
తొలకరి జల్లుల లయవిన్యాసాలను
అలా చూస్తూ ఉండిపోయే నాకు కాలం ఎంతవేగంగా తరలిపోతుందో
తెలియనే తెలియదు
మనస్వినీ...

Monday 8 June 2020

ఏమైనా జరగనీయ్..


ఏమైనా జరగనీయ్..
కణం కణం రగిలే సుమం నా అక్షరం
ఓ గుండెకు గాయం చేసిందా చేయనీ...
ప్రతిక్షణం పరిమళించే పున్నమి నా అక్షరం
ఓ మనసుని మురిపించిందా మురిపించనీ...
ముక్కు సూటిగా దూసుకుపోయేదే నా అక్షరం
ఓ భావం భస్మీపటలం అయ్యిందా
అయితే కానీ...
మానవతా మూర్తులకు పాదాక్రాంతం నా అక్షరం
ఓ హృదయం పొంగిందా
పొంగితే పొంగనీయ్...
మనసు ఘర్షణలో జనించి
నింగిచుక్కల వైపు దూసుకుపోయే కరవాలమే నా అక్షరం
నింగిని చీల్చిందా చీల్చనీయ్...
ఇరువైపులా పదునున్న నా అక్షర ఖడ్గం పువ్వులా వికసించినా
బాణమై వెంటాడినా
ఆగదు నా అక్షర సమరం...

Sunday 7 June 2020

కొట్టుకు చావు అమెరికా


కొట్టుకు చావు అమెరికా 

నిద్రలే అమెరికా
పోరాడు అమెరికా
తెల్లోడిని చంపేయ్ అమెరికా
నల్లోడి ఊపిరి తీసేయ్ అమెరికా
కాల్చేసేయ్ అమెరికా
కాలిపో అమెరికా
మీరు నల్లోళ్ళయినా
తెల్లోళ్ళయినా నాకేంటి
కొట్టుకు చావండి
నాకైతే ఇలాగే అనిపిస్తోంది...
వసుధైక కుటుంబం భ్రమల్లో మునిగి చచ్చే వాళ్ళు
మానవ హక్కులు అంటూ గొంతు చించుకునే వాళ్ళు
ఎర్రజెండాలు ఎగరేస్తూ
ప్రచారం కోసం ర్యాలీలు చేసే కమ్యూనిస్టోళ్ళు
నల్లవాళ్ల పక్షం చేరారేమో
నేనైతే రవ్వంత కూడ సానుభూతి చూపను...
మంట వాళ్ళ కింద ఉంది కాబట్టి ఇప్పుడు అరుస్తున్నారు
అదే అమెరికా తనకు నచ్చని దేశాలలో విధ్వంసం చేస్తుంటే
ఒక్క నల్లవాడైనా నోరువిప్పాడా...
అమెరికన్ మిలిటరీలో నల్లవాళ్ళు తెల్లవాళ్లు కలిసి
మెసపుటేనియ నాగరికతను సర్వనాశనం చేస్తుంటే ఒక్క నల్లోడైనా నిరసన వ్యక్తం చేశాడా...
తనకు నచ్చని పాలకులకు శిక్ష పేరుతొ అమాయక ప్రజల శవాలగుట్టలను పేర్చినప్పుడు ఏమయ్యింది ఈ జాతివివక్షత..
ప్రపంచం మొత్తం మీద అమెరికా సాగిస్తున్న రాక్షసకాండలో ఈ నల్లవాళ్ల పాత్ర రవ్వంతయినా లేదా..
యెస్ నాకు చరిత్ర తెలియకపోవచ్చు
మానవతాదృక్పథం లేకపోవచ్చు
వసుదైక కుటుంబం తాత్పర్యం తెలిసి ఉండకపోవచ్చు
ఎవరేమనుకున్నా అమెరికాలో రాక్షసులే ఉన్నారని నమ్ముతా
వాడు నల్లోడైనా తెల్లొడైనా..
ట్రంప్ ఎంత దుర్మార్గుడో ఒబామా కూడా అంతే.. కొట్టుకు చావనీ
సర్వనాశనం కానీ
గ్లోబులో అమెరికా బొమ్మ లేనంత మాత్రానా ప్రపంచానికి ఒరిగేదేమీ లేదు...

ఏదీ మరో ప్రపంచం


ఏదీ మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం
ఏ కలుగున దాగి ఉంది
ఆ ఊహాప్రపంచం
మేఘాల పరదాల చాటున దాగి ఉందా
కృష్ణ బిలంలో కరిగిపోయిందా
ఉందో లేదో తెలియని
మరో ప్రపంచంపై మక్కువ లేదు
ఉన్నప్రపంచంపై నమ్మకం లేదు
మరెక్కడికి నా పయనం
ఉందో లేదో తెలియని లోకం సింహద్వారాలెక్కడా
హంసతూలికా తల్పముల మాటున వింజామరలెక్కడా
ఎగసిపోనా ఊహాప్రపంచం
పొలిమేరల దిక్కున
వాలిపోనా మబ్బుచాటు చందమామ పక్కన
ఊహలు వీడి గర్జించనా విప్లవశంఖారావమై
ఈ జగతి దుష్కర్మలపైన
లిఖించనా రాతి అక్షరాలు
ఈ చరితపైన
ఓడిపోతూ గెలుపును ముద్దాడనా
గెలుపులోనూ ఓటమిని చూస్తూ
సాగిపోనా నిశీధినై
మరో ప్రపంచపు వెలుగులవైపు
ఉందో లేదో తెలియని లోకం దిక్కులవైపు..

Tuesday 2 June 2020

ధిక్కారమే నా స్వరం


ధిక్కారమే నా స్వరం
ఆకలి మంటల్లో బీజం పడింది
వాడిపోయిన బాల్యంలో
బీజం విచ్చుకుంది
అవమానంలో మొలక తలెత్తింది
ఆవేదనలో రెక్కలు విప్పింది
అల్లకల్లోలంలో మొక్కై ఎదిగింది
మండుతున్న హృదయంలో
వృక్షమై నిలిచింది
మనసును గోడలను చీల్చుతూ కొమ్మలను
బయటకు తోసింది
అవును
ఇప్పుడు ధిక్కారమే నా స్వరం..

Monday 1 June 2020

నేనింతే..


నేనింతే..
జేబులో పైసాలేదు
మనసులో కపటం లేదు
చేతల్లో మోసం లేదు
మాటల్లో మర్మం లేదు
నడతలో ద్రోహం లేదు
ఎవరికో నచ్చాలన్న తపన లేదు
ఎవరినో మెప్పించాలనే ఆశ లేదు
ఏమవుతుందో అనే భయం లేదు
వెనకడుగు వేసే గుణం లేదు
పారిపోయే తత్వం లేదు
జీవితమంటే లెక్కే లేదు
సింహంలా బతికాను
సింహంలా చస్తాను