Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, 31 March 2015

కోయిలమ్మ పాట నీ పిలుపుకోయిలమ్మ పాట నీ పిలుపు


పరిమళించిన నా మనసులో
మొగ్గ తొడిగిన
నా భావం ప్రాణం పోసుకుంటే
ఆ ప్రాణం ఒక ఆకృతి లా
రూపం సంతరించుకుంటే
ఆ రూపం నీదే...
మూగబోయిన
వీణ తంత్రులు
మళ్ళీ సవరిస్తే
జనియించిన
సవ్వడి నీ తీయని పలుకే...
అందియల రవళిలో
పదమువ్వల సవ్వడిలో
లయబద్దమైన నర్తనం
అది నీ మయూర నడకే...
పక్షుల కిలకిలరావాలలో
కోయిలమ్మ పాటలో
పిల్ల గాలుల్లో
వినిపించేది నీ పిలుపే...
నీలాల నింగిలో
పచ్చని పైరులో
సెలయేటి పరుగులో
ఎక్కడో ఎందుకు
నా మనసు రొదల్లో
సర్వం
సమస్తం
అన్నీ
నీ ఉనికినే చాటుతున్నాయి
మనస్వినీ...

Monday, 30 March 2015

ఆత్మ వంచనఆత్మ వంచన


స్పందనలు పూసిన మనసులో
భావం అంకురిస్తుంది...
విరిసిన భావంలో
అక్షరం మొలకలు వేస్తుంది...
రెక్కలు విప్పిన అక్షరం
భావమనే తేనీయలో
తడిసి ముద్దవుతుంది...
మధురసాల అమృతంలో
స్నానమాడిన అక్షరం
మలి అక్షరానికి ప్రాణం పోస్తుంది...
ఒక అక్షరం మరో అక్షరమై
అక్షరాల మాలికలై
మనసు తోట పుష్పాలుగా
భావం గుభాళిస్తుంది...
కనురెప్పల నీటి సుడులనూ
గుండె లోతు అనుభవాలనూ
మనసైన అనుభూతులనూ
పరిమళాలుగా వెదజల్లుతుంది
మనసైన భావం...
భావం మనసులో పుట్టాలి...
ప్రతి మనసులో భావం ఉన్నా
అన్ని మనసుల్లో
అక్షరం మొలకలు వేయదు...
అక్షర భావం లేని మనసు
భావాన్ని గౌరవించాలి...
అభిమానించాలి..
అనుభూతిని
ఆస్వాదించాలి...
ఆ భావమే నాదనీ...
ఇతరుల అక్షర మాలికలు
తమ మనసులోనే పుట్టినవనీ
నమ్మబలికే మనసులో
భావం చిగురిస్తుందా
అసలా మనసు
బతికి ఉన్నట్టేనా
ఇది వారి ఆత్మ వంచన కాదా
మనస్వినీ...

Sunday, 29 March 2015

ఎంత గడసరివేఎంత గడసరివే

క్రీగంట కనులతో
వలపులే విసురుతావు...
కొంటెతనం రంగరించి
కన్నే గీటుతావు...
వినిపించని సవ్వడులెన్నో
పెదాలపైనే చూపిస్తావు...
మనసు రొదలన్నీ
కవ్వింతలలోనే చూపిస్తావు...
మౌనగీతంలో
వలపు వీణను సవరిస్తావు...
భావమే లేని పాటలో
విరహభావం రగిలిస్తావు...
నలుగురిలో నేనున్నా
ఒంటరినే నేనయినా
అదేమీ పట్టని నీవు
వలపు బాణాలు వేస్తుంటావు...
మనసు పుష్పాల తాకిడికి నేను
తికమక పడిపోతే
విజయదరహాసం చిందిస్తావు ...
అది చూసిన నేను
అయోమయంలోకి జారుకుంటే
గులాబీ రేకుల పెదాల ఆహ్వానంతో
అలజడులే రేపుతావు...
మయూర నడకతో
అందియల రవళితో
మనోసంద్రంలో సునామీలే పుట్టిస్తావు...
నిజంగా నువ్వెంత గడసరివో
మనస్వినీ...

రక్షకుడినే నేను రక్షకుడినే నేను


వికసించే పుష్పం నీవయితే
మనసును దోచే పరిమళం నేనేవుతా...
పుష్పరాజం గులాబీ నీవయితే
నీ తావిలో ముల్లును నేనవుతా...
నిన్ను విసిగించే  సమాజానికి
వాడి ముల్లునై గుచ్చుకుంటా...
వెలిగే దీపం నీవైతే
అరచేతినై గాలిని ఆపేస్తా...
విరజిమ్మే నీ వెలుగులకు
నా ఊపిరినే ఇంధనం చేస్తా...
చందమామావు నీవైతే
సూరీడునై నీకు వెన్నెలనిస్తా...
కడలివే నీవైతే
నీపై కెరటమై నర్తిస్తా...
కదిలే మేఘం నీవే అయితే
గర్జించే ఉరుమునే నేనవుతా...
తొలకరి చినుకువు నీవైతే
పరిమళించే మట్టివాసన నేనవుతా...
పుడమిలో మట్టినై
గాలిలో ధూళినై
అడుగులకు జాడనై
నీ దిశగా వచ్చే శరములకు
ఎదురు నిలిచే డాలునై
నీ కరమున కరవాలమునై
నిన్నంటే ఉంటా
నీ వెంటే ఉంటా
నా శ్వాస నిష్వాసలే
నీకు రక్షణ కవచాలు
మనస్వినీ...