Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 23 March 2015

నువ్వు నాకే సొంతం



నువ్వు నాకే సొంతం


నిన్ను చూడాలనీ ...
నిన్నే చూడాలనీ...
నేను మాత్రమే చూడాలనీ...
అనుక్షణం తపిస్తుంది నా మనసు...
పరితపిస్తుంది నా హృదయం...
మరో కన్ను నీపై వాలితే తాళలేదు అంతరంగం ...
ఆ కన్నుల నుంచి నిన్ను కాపాడుకునేందుకు
నిన్ను నా రెటినా పొరపై అద్దంలా అద్దుకుంటా...
నీ నుంచే నిన్ను చూసుకుంటా...
నా ఒక కన్ను నిన్ను చూస్తే
మరో కన్నులో అసూయ ...
నాకన్నుల నిండా ఉన్న నిన్ను చూసి
మనసులోనూ అసూయే...
నా మనసుకే కన్నులు వస్తే
నా నయనాల ద్వారాలు మూసివేస్తా...
మనసులోనుంచి
బయటకి రాకుండా
నిన్ను గుండె గుడిలో నిలుపుకుంటా...
నవ్వులే నువ్వు రువ్వుతుంటే
నీ సవ్వడిని మోసే
పిల్లగాలినే ఆపివేస్తా...
నీ మాటలు మరో చెవినపడకుండా
నా శ్వాసలోనే బంధించుకుంటా...
నీ నవ్వుల రువ్వులూ
విరిసే పుష్పాలు
నా మనసు తోటలో నాటుకుంటా...
మంత్ర శక్తే నాకుంటే
నిన్ను బొమ్మలా మార్చి
కంటిపాపలో దాచుకుంటా...
మరో కంట నీవు పడకుండా
కనురెప్పల్లోనే నీకు గూడు కడతా...
నువ్వూ నీ నవ్వూ
నీ పలుకులు
నీ మెరుపులూ
నాలోనే దాచుకుంటా...
ఏం చెయ్యను నేను
నిన్నెవరు చూసినా
ఎవరు పలకరించినా
నువ్వెవరిని కదిలించినా
పగిలిపోతుంది నా మనసు
రగిలిపోతుంది నా హృదయం...
ఏమనుకున్నా ఇదే నిజం
ఇది ప్రేమో మరేమో...
నాపై నాకు కలిగిన అసూయో...
ఒకటి మాత్రం నిజం
ఇది అంతులేని అనురాగం
మనస్వినీ...

No comments:

Post a Comment