Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 29 February 2016

స్నేహమా ఎక్కడా నీ చిరునామా

స్నేహమా ఎక్కడా నీ చిరునామా

కనురెప్పలకు భారమైన ఓ నీటి చుక్క
ఇక సెలవంటూ కిందకు జారింది
ఒంటరిగా నేను పోలేనంటూ
అందరినీ తోడు రమ్మని పిలిచింది
ఒక చుక్కకు మరో చుక్క తోడై
ప్రవాహమై ఉబికింది
మనసు సంద్రంలో సునామిలా ఎగసిన ప్రవాహం
ప్రతి జ్ఞాపకాన్నీ తుడిచేసింది
మనసు పొరలకు చీడలా అంటుకున్న
ప్రతి ఆనవాలునూ కడిగేసింది
కన్నీటి ప్రవాహంలో
తుడుచుకుపోయిన జ్ఞాపకాల్లో
కరిగిపోయిన ఆనవాళ్లలో
చీడపీడలు కొట్టుకుపోయాయి
మిగిలింది మనసే
నా అనుకున్నది నాది కాదన్నది తేలిపోయింది
అది స్నేహం ముసుగులో పచ్చి వ్యాపారమేనని తెలిసిపోయింది
అన్నదమ్ముల అనుబంధంలో
బంధువుల అనురాగంలో
అంతా వ్యాపారమే అనుకున్న నేను
స్నేహంలో నిజాయితీ ఉందనుకున్నా
స్నేహమూ వ్యాపారమనే చెట్టుకు కాచిన కాయేనని
తెలుసుకున్న మనసు
గుండెలుపగిలేలా ఏడ్చింది
మనసు సుడిలో ఇమడలేని కన్నీటి చుక్క
కిందకు జారుతూ
మనీ మనుషుల ఆనవాళ్ళను కడిగేసింది
ఇప్పుడు
నా మనసు నిలదీసి అడుగుతోంది
స్నేహమా ఎక్కడా నీ చిరునామా

Sunday, 28 February 2016

అది నీవే

అది నీవే
 
ఈ చీర రంగు బావుందా
ఈ జరీ అంచు ఈ చీరకు బావుంటుందా
ఈ బ్లౌజ్ చీరకు మ్యాచ్ అయ్యిందా
ఈ చీరలో ఎలా ఉంటాను
ఈ చీర రంగు నాకు సూట్ అవుతుందా
శరపరంపర ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పను
చీర రంగు బాలేదు
జరీ అంచు సూట్ కాదు
బ్లౌజ్ మ్యాచ్ కానే కాదు
అవును
నేను చెప్పేది నిజమే
స్వతహాగా అవేవీ నచ్చవు నాకు
ఏ రంగూ ఇంపు కాదు నాకు
జరీ అంచు కంటికి ఆనదు నాకు
నిజమే
ఏ రంగు చీర అయినా నీకోసం రంగు మార్చుకోవాల్సిందే
జరీ అంచు కూడా తన మెరుపులకు మెరుగులు పెట్టుకోవాల్సిందే
బ్లౌజు వంపులు కూడా నీ ఒంపులకు సలాము చేయాల్సిందే
వస్త్రాలు నీకు అలంకారాలు కాదు
నీ దేహాన్ని హత్తుకున్న వస్త్రాలకు నీవల్లనే విలువ పెరుగుతుంది
ఆభరణం నీకు విలువ కాదు
ఆభరణాలకు విలువ పెంచేది నీ దేహం
కట్టుబొట్టుకు ప్రాణం పోసేది నీ సోయగం
అందాన్ని అందలాలు ఎక్కించేది
ఇంకేదో కాదు
అది నీవే
మనస్వినీ

Saturday, 27 February 2016

మనసుపెట్టుబడి

మనసుపెట్టుబడి


పెట్టుబడితో ప్రారంభం కాలేదు
క్యాపిటల్ ఇన్వెస్టుమెంట్ లేనేలేదు
ఒప్పందాలు లేవు
ప్రణాళికలు వేసుకోలేదు
వ్యాపారమని అనుకోనేలేదు
కనులు కనులు చేసుకున్న అవగాహన మనది
మనసులో మనసు పెట్టుబడి మనది
శ్వాసలో ఊపిరిగా పెనవేసుకున్న ఒప్పందం మనది
మునిగినా తేలినా ఒకరికి ఒకరం అనుకున్న ప్రణాళిక మనది
సిరిసంపదలు వస్తుంటాయి పోతుంటాయి
ఎత్తు పల్లాలు ఎప్పుడూ ముద్దాడుతూనే ఉంటాయి
పిల్లగాలికి కొట్టుకుపోయేందుకు మన బంధం పేక మేడ కాదు
సునామీలను ధిక్కరించే మనసు బంధం మనది
కరెన్సీ కట్టలకే సలాము చేసే మనీ మనుషులకు
అనురాగమే తెలియని కర్కషులకు
మనసు బంధం విలువ ఎలా తెలుస్తుంది
మనస్వినీ

సమాజానికి సవాల్

సమాజానికి సవాల్
 
సమాజమా నీకిదే నా సవాల్
నువ్వే చాలా గొప్పని విర్రవీగుతున్నావా
నీలోనే నిజాయితీ ఉందని భ్రమ పడుతున్నావా
తెలుసా నీకు జీవితం
తెలుసా నీకు బంధం
తెలుసా నీకు అనుబంధం
దుష్ట దుర్మార్గుల సమూహమే నువ్వు
భువిలో వెలిసిన కలుపు మొక్కల సమాహారం నువ్వు
వేద మంత్రాలు పారాయణం చేస్తూ 
ఖురాన్ ఆయత్తులు వల్లెవేస్తూ
నీఛ తంత్రాలు రచించే జాతి నీది
మగువ మనసు గ్రహించక
ఆ మనసు విలువ తెలియక
నిజమేదో గ్రహించక
నోరుంది కదా అని ఏదనుకుంటే అది మాట్లాడేది నువ్వు
మీకూ బంధాలు లేవా
భార్యా బిడ్డలు లేరా
నువ్వు తండ్రివి కాదా
ఒకరికి మొగుడివి కాదా
నీకు మొగుడు లేడా
నీకు తల్లి లేదా
బిడ్డలు పుట్టలేదా
ఎందుకు మగువ జీవితంతో ఆటలు
కుట్రలు కుతంత్రాల్లో మునిగి
కరెన్సీ వాసనలో నలిగి ఎందుకు
మానవత్వాన్ని చంపుకుంటన్నావ్
ఒకరి ఇల్లాలిని
ఒకరి భర్తని
గౌరవించలేని నువ్వు
నీ ఇంటి మనిషిని ఎలా గుర్తిస్తావ్
నో డౌట్
అది నా బంధం
నా అనురాగం
నా బంధానికి నేను ప్రాణమిస్తా
నా అనుబంధానికి నేను విలువ ఇస్తా
కుక్క మూతి పిందెను పోలిన సమాజమా
నీకేం తెలుసు బంధం విలువ
నీకేం తెలుసు భార్యాభర్తల బంధం
చిలుకపలుకులు పలికే కుక్కజాతి జంతువుల్లారా
మీ మాటలకు కుక్కలే సిగ్గుపడుతున్నాయ్
నీ ఇల్లాలిని ఉంపుడుగత్తె అని ప్రకటించు
ఆడదానివైతే నువ్వే వెలయాళివని చెప్పుకో
ఉందా దమ్ము నీకు
దమ్ముంటే రా నా ముందుకు
మనిషి జాతివైతే
ఇదే నా సవాల్

Tuesday, 23 February 2016

లేపనం కాని మనసు

లేపనం కాని మనసు

సిగలో పువ్వులా నవ్వాలని అనుకున్నా
కాలిలో ముల్లులా గుచ్చుకున్నా
తగిలిన గాయానికి లేపనం కావాలనుకున్నా
మరో గాయానికి మార్గమై నిలిచున్నా
జారిపడిన కన్నీటిని దోసిటపట్టాలని అనుకున్నా
ఆ కంటిలో నలుసులా మిగిలియున్నా
ఆ పెదాలపై చిరునవ్వునై చిందించాలనుకున్నా
ఆ తేనియ పలుకుల్లో గరళమై మిగిలియున్నా
నా భావం
నా అంతరంగం
నా ఆలోచన
నా వేదన
నా రోదన
అన్నీ నా మనసుకే తెలుసు
మనసు వెతలను తెలుసుకోలేని మనసు ఎదుట
శూన్యమై కరిగిపోతున్నా

“మనీషి”

“మనీషి”

నీ జాడ తెలిసింది నాకు
నీ అసలు రూపం తెలుసుకున్నా నేను
నీ అసలు రంగును చూసా నేను
నువ్వెక్కడో లేవు
మబ్బుల మాటున లేవు
కొండల చాటున లేవు
దివిలో లేనే లేని నువ్వు
భువిలోనే ఉన్నావు
మనీ రూపంలో ఇలలో ఉన్నావు నీవు
కరెన్సీ రూపంలో మాయలు చేస్తున్నావు నువ్వు
నువ్వు జేబులో ఉంటే చెత్త వెధవ కూడా దేవుడే
కాసుల గలగలలు వినిపిస్తే పచ్చి బూతులు కూడా వేదాలే
విటమిన్ ఎం దేహం నిండా ఉంటే ఆ మనసుకూడా పునీతమే
మనీ ఉన్న “మనీషి” ఏం చేసినా న్యాయమే
మనీ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు
మనీ ఉంటేనే ఎవరికైనా చేయూతనివ్వచ్చు
మనసు ఎంత విలవిలలాడినా మనీ ముందు దిగదుడుపే
మనీతోనే అనుబంధాలు
మనీతోనే పరువు మర్యాదలు
మనీ ఉంటేనే గొప్పోళ్ళు
మనీ ఉంటే కుట్రలు కుతంత్రాలూ న్యాయాలే
మనీ ఉంటే మతమేదైనా గొప్పదే
మనీ ఉంటే శునకమైనా సింహమే
మనీ లేని మనసు పనికిరాని చెత్తకాగితమే
మనీషీ మరి నువ్వే కదా దైవం

వస్తా నీకోసం

వస్తా నీకోసం

వస్తా నీకోసం
నిజంగా ఉన్నావో లేవో చూడాలని
ఆరు నూరైనా నూరు ఆరైనా వస్తా నీకోసం
నిజంగా నువ్వుంటే లెక్కలు తేల్చుకుందామని
భువిలో ఓటమికి
దివిలో కారణాలు వెతుకుదామని
ఉన్నావా నువ్వసలు
ఉంటే దేవుడివేనా నువ్వు
ఎలా ఒప్పుకోవాలి నువ్వే దేవుడని
నిజంగా నువ్వే దేవుడివే అయితే
ఎక్కడున్నావు
మబ్బుల చాటున దాగి ఉన్నావా
కొండల మాటున నక్కి ఉన్నావా
మనుషుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక
బ్లాక్ హోల్ లో కలిసిపోయావా
దైవమె నీవైతే
మా రాతలే నీవు రాస్తే
నా రాత ఎందుకిలా రాసావు
మందుకొట్టి రాసావా
నిద్ర మత్తులో గీతలు గీసావా
ఏం పాపం చేశానని
ఎవరికి ద్రోహం చేశానని
మనసు మాటే వినటం పాపమా
జీవితాన్ని వ్యాపారం చేయకపోవటం నేరమా
బంధాలు అనుబంధాల కోసం ప్రాకులాడటం ఘోరమా
అయినవాళ్ళు అన్నీ మరిచి బేహారులై నిలిస్తే అది న్యాయమా
మనీ మనుషులు ఏది చేసినా అదే వేదమా
మనీ ముందు మనసు చెత్తకాగితమైతే అది ధర్మమా
ఎవడికి కావాలి నీ ధర్మం
ఎవరికోసం నీ న్యాయం
అవునులే
కానుకల రూపంలో లంచం ఆశించే నీవు
దేవుడివి ఎలా అవుతావు
పచ్చి వ్యాపారివేగా
జీవితాలను వ్యాపారంగా మలిచిన నీవు
ఇంతకంటే ఏం న్యాయం చెయ్యగలవు
అయినా
వస్తా నీకోసం
నిజంగా నీవుంటే
నిలదీస్తా నిన్ను
నువ్వు లేవని తెలిసినా
వస్తా నీకోసం

Sunday, 21 February 2016

ప్లాస్టిక్ పువ్వులేనా

ప్లాస్టిక్ పువ్వులేనా

వహీ ఫూల్ హై
వహీ ఖుష్బూ హై
వహీ హావా హై
యే గుల్
యే ఖుష్బూ
యే హవా
కిస్ లియే మేరే మన్ కో చుబ్ నే లగే
కిస్ లియే యే సబ్ ఝూట్ లగ్ నే లగే
పరిమళించిన మల్లికలే అవి
గుభాళించిన గులాబీలే అవి
ప్రతిభావం ఒక వసంతం
ప్రతిరాగం ఒక అపురూపం
ప్రతి అక్షరం ఒక పుష్పం
మనసు మందిరంలో వెలిగిన దీపం
హృదయసాగరంలో చెలరేగిన కెరటం
అనుభూతుల సంగమం
అనురాగాల నిలయం
అనుబంధాల దేవాలయం
నా ప్రతి అక్షరం మనసు సొదల సంకేతం
ఇప్పుడేమయ్యింది నాకు
నా పుష్పాలు నాకు గుచ్చుకుంటున్నాయి
నా భావాలు శరములై తగులుతున్నాయి
అవును నేడు
ఆ పరిమళాలు మనసుకు తాకవెందుకు
ఆ భావాలు గిలిగింతలు రేపవెందుకు
వీచే చల్లగాలీ
కదిలే కొమ్మలు
కువవకువలాడే పక్షులు
కోయిల కూజితాలు
ఇంపైన పాటలు
సొగసైన దృశ్యాలూ
ఏవీ మనసుకు ఆనవెందుకు
నాలో భావం మాయమయ్యిందా
నా మనసులో భావమే లేదా
లేక
నా మనసు తోటలో వికసించిన పుష్పాలు
అన్నీ ప్లాస్టిక్ పువ్వులేనా

Friday, 19 February 2016

తిరిగిరాని గతం

తిరిగిరాని గతం


నడిచే కాలం
కదిలే అడుగులు
ఆనవాళ్ళు గానే మిగిలిపోతాయ్
కాలం జ్ఞాపకాలను కానుకలుగా ఇస్తే
అడుగులు జాడలను విడిచి
కదిలిపోతాయ్
జ్ఞాపకాల దొంతరలు మనసును వివర్ణం చేస్తే
అడుగుల జాడలు కాలమనే గాలికి కరిగి చెరిగిపోతాయ్
మౌన ముద్ర మనసు భావాలను సమాధి చేసి
వెక్కిరించే గడియారం ముల్లును చూస్తూ ఉండిపోయింది బేలగా
కాలం సాగక తప్పదు
అడుగులు నడవక తప్పదు
కాలాన్ని ఆపలేక
అడుగులను అనుసరించలేక
మనసు నిలబడి పోయింది
ఒక చెదిరిన కలలా
తిరిగిరాని గతంలా

Thursday, 18 February 2016

నీ రూపమే

నీ రూపమే

వెచ్చగా జారిపడుతున్న
కన్నీటి చుక్కను అడుగు
నీవు లేని సమయాన అది ఎందుకు జారిందో
ఆ ఉప్పునీటిలో ఎంత తేనీయ దాగి ఉందో
తీయని తేనీయలో వెతుకు
ఎంత వేదన రగులుతోందో
అందరూ ఉన్నా
అంతా సవ్యంగానే కనిపిస్తున్నా
ఏదో తెలియని వెలితిని అడుగు
శూన్యంలో చూస్తూ వెక్కిరిస్తున్న ఒంటరితనాన్ని అడుగు
ఒంటరితనంలో మిగిలిన ఆవేదనతో
రగిలిన మనసును అడుగు
మాటల తూటాలతో పగిలిన మనసు ముక్కల రోదనను అడుగు
నాకు నీపై ఎంత ప్రేమో
జారిపడిన కన్నీటి చుక్కలో
మెరిసేది నీరూపమే
ఉప్పునీటి వెగటులో
మధురమైన తేనీయ నీవే
రగిలిన వేదనలో చలి మంటవు నీవే
ఒంటరి వేళ మనసుకు పలకరింపు నీవే
పగిలిన మనసు ముక్కల్లో కనిపించే
బొమ్మలు నీవే
పగిలిన మనసు ముక్కలను ఒక్కసారి కలిపి చూడు
కనిపించేది నీ రూపమే

గుడ్డి మనసులు

గుడ్డి మనసులు
మనసులో ఉన్నదేమో మనసుకే తెలుసు
మనసులో రగిలే మంటల వేడి ఎవరికి తెలుసు
మనసు గుడిలో మమతల తీపి
నా మనసుకు కాక మరో మనసుకు ఎలా తెలుసు
నా కన్నులలో వికసించిన కలలు
నా కన్నులకు కాక ఇంకెవరికి తెలుసు
నా మనసు ఏం కోరుకుందో
నా మనసు ఏమని ఆలోచిస్తుందో
నా మనసు ఎంత వేదన పడుతోందో
నా మనసు ఎంత విలపిస్తోందో
ఏ మనసుకు తెలుసు
ఆవేశంలో రగిలి
అనుమానంలో మునిగి
నిజానిజాలు తెలుసుకోలేని
గుడ్డి మనసులు
నా మనసును చూడలేవన్నది
ఆ మనసులకు ఎలా తెలుసు