Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 31 December 2017

కొత్త సీసాలో పాత సారా

కొత్త సీసాలో పాత సారా 

వెళ్లిపోతున్నావా నువ్వు
వెళ్ళిపో ఆలస్యమెందుకు ఇంకా
నువ్వెళ్ళిపోయాక తనేలాగూ వస్తుంది వద్దన్నా ...
నీకు మనసునిండా వీడుకోలు చెప్పను
వచ్చేదానికి హృదయం పరిచి స్వాగతం పలకను
నా ప్రమేయమేమీ లేకనే రాకపోకలు జరిగిపోతాయి ...
నీవల్ల ఒరిగిందేమీ లేదు
రేపేదో జరిగిపోతుందనే భ్రమలూ లేవు
నువ్వంటే రవ్వంత అభిమానమూ లేదు
కొండంత ఆవేదన తప్ప ...
ఎన్ని అనుభవాలు చూపావు
వంచనా శిల్పాన్ని పరిచయం చేసావు
తడి గుండెలో మంటలు రేపావు
ఎందుకు ఆపాలి చెప్పు నిన్ను ...
అయినా ఆగమంటే ఆగుతావా
వద్దంటే నిలిచిపోతావా
వీడిపోయేందుకు క్షణాలు లెక్కపెడుతున్నావుగా ...
తరలివచ్చే క్షణమేమన్నా పూవులు విసురుతుందా
చిరునవ్వుల మతాబులు కానుకలుగా ఇస్తుందా
ఇలావచ్చి అలా వెళ్లక నిలకడగా ఉంటుందా ...
పోయేదానిపై గౌరవమూ లేదు
వచ్చేదానిపై నమ్మకమూ లేదు
కొత్త సీసాలో పాత సారా యవ్వారమంతా ...
అందుకే నువ్వెళ్ళిపో
వచ్చేదానికి చోటిచ్చిపో
కుడిఎడమైనా పొరపాటు లేదంటూ
అన్యమస్కంగానే రమ్మంటున్నా
వెల్ కం టూ న్యూ ఇయర్

Friday, 29 December 2017

ఈ రాతిరి నన్నిలా మరణించనీ

ఈ రాతిరి నన్నిలా మరణించనీ 

గుడ్డిదీపం వెలుతురులో కానరావటం లేదు
నీ అరమోడ్పు కన్నులు మరికాస్త వికసించనీ ...
జామురాతిరి జామ్ కైపులకు సోలిపోలేదు
నీ కనులజారే మధువును మత్తుగా తాగనీ...
హృదయవేగం పెరిగి ఊపిరి సవ్యంగా లేదు
నీ ఊపిరితో నాకు శ్వాసను పోసి గుండెను నెమ్మదించనీ...
ఆకలి పెరిగి దేహంలో నిలకడ లేదు
గులాబీ పెదాల మధురసాలను మనసునిండా ఆస్వాదించనీ...
చలిగాలికి తనువంతా వణుకు ఆగేలా లేదు
నీ దేహాన్ని నాకు కప్పి చల్లగాలికి చెమటలు పట్టించనీ...
మిసమిసలాడే నీ పరువాల ప్రశ్నలకు అంతే లేదు
అనుభవంతో ధీటైన సమాధానం చెప్పనీ...
నిప్పులకొలిమి మన పరిష్వంగం విడిపోనివ్వదు
వలపువానై కురిసి మంటలు చల్లార్చనీ...
ఈ ఘడియలో మనకు మరో జీవితమే లేదు
ఈ రాతిరి నన్నిలా మరణించనీ...

Saturday, 23 December 2017

HAPPY BIRTHDAY MAMMOO…

HAPPY BIRTHDAY MAMMOO

నా తలపై వేళ్ళతో నిమురుతూ
నుదుటిపై చుంబనంతో
మెలకువ నేర్చిన కన్నులను నిద్రపుచ్చుతూ
నేనిక్కడే ఉన్నా ఏంకావాలన్నా కాల్ మీ
గుడ్ నైట్ పప్పా అంటూ నాగది తలుపులు వేసి వెళ్తున్న
తనను చూస్తే నా అమ్మేనేమో అనిపిస్తుంది ...
కళ్ళు తెరిచానో లేదో మార్నింగ్ పప్పా అంటూ
వాటేసుకునే తన స్పర్శలో నాకు
ప్రపంచాన్ని గెలిచిన ఆనందం దొరుకుతుంది ...
చెంగు చెంగున  లేడిపిల్లలా గెంతుతూ
నవ్వులు పూయించే తనను చూస్తుంటే
నా చిన్ని పొదరిల్లు ఆనందాల పూదోటలా కనిపిస్తుంది ...
నా గారాలపట్టి నాజీవితంలో కూతురు పాత్ర కన్నా
అమ్మ పాత్రకేఎక్కువ జీవం పోస్తున్నది
నా చిట్టి తల్లి కాదు కాదు మా అమ్మ పుట్టిన రోజు ఈరోజు
కూతురుగా పుట్టి అమ్మ ప్రేమను పంచుతున్న
మా ఇంటి యువరాణికి
మనసునిండా జన్మదిన శుభాకాంక్షలు ...


Tuesday, 19 December 2017

సాగిపోతున్నా నీకు అందనంత దూరంగా

సాగిపోతున్నా నీకు అందనంత దూరంగా 

అవును నిన్న మొన్నటిదాకా ఇది నిజం
నీగురించి నేను ఆలోచించిన మాట నిజం
ఇప్పుడు నా ఆలోచనల్లో నువ్వు లేవు
ఒకవేళ నువ్వు ఆలోచనా స్రవంతిలో
లీలగా తారసపడినా
నువ్వంటే నా మనసు కరగటం లేదు
ఎందుకంటే నా మనసుపుస్తకం పేజీలలో
నీ అక్షరాల గొంతుకను నువ్వే నులిమేసావు
నీకోసం నేను వేదన చెందినదీ నిజమే
ఇప్పుడు నా ఆవేదనలో నువ్వు లేవు
నా తలపుల తలుపులకు నువ్వే తాళం వేసివెళ్లావు
నీకోసం నేను కన్నీరు కార్చిందీ నిజమే
ఇప్పుడు నా కన్నీటి తెరలపై నీ రూపం కానరాదు
కురిసిన నా కన్నీటివానలో నీ జ్ఞాపకాలను
నువ్వే కడిగేసుకుపోయావు
హృదయకోవెలలో నీరూపం నిలిచిందీ నిజమే
ఇప్పుడు మనసు గర్భగుడి వెలవెలబోతోంది
అక్కడినుంచి నువ్వే తరలిపోయావు
నా కనురెప్పల మైదానంలో కలల పొదరిల్లు
ఇంకా కదలాడుతూనే ఉంది
నువ్వే విడిచివెళ్లావు అడుగుజాడలను చెరిపేసుకుంటూ
నీ ఆలోచనలను విసిరేసి
కాలమనే నేస్తంతో ముందుకు సాగుతున్నా
నీకు ఎప్పటికీ అందనంత దూరంగా 

Wednesday, 13 December 2017

ఇలా అయితే ఎలా

ఇలా అయితే ఎలా

ఎంత వారించినా విననే విననంటావు
అదిలించినా అదుపే లేదని అంటావు
బెదిరించినా భయమే లేదని అంటావు
ఒక్క క్షణం కుదురుగా ఉండలేనని అంటావు
ప్రతినిమిషం అటో ఇటో వెతుకుతూనే ఉంటావు
వేకువలో వెన్నెలను కోరుకుంటావు
నింగిలో తారకలను ఏరుకుంటానని మారాం చేస్తావు
 ఒక పువ్వు నచ్చిందని వాలిపోతానని ఉబలాటపడతావు
పువ్వు పువ్వుకూ ముల్లున్నదని తెలుసుకోలేనంటావు
ఒక గాయం మాననే లేదు మరో గాయం కోసం ఆరాటపడతావు
మనసా నీతో ఎలా వేగమంటావు
నిన్నే కారాగారంలో దాచుకోమంటావు


Wednesday, 6 December 2017

మామూలు మనిషిని నేను

మామూలు మనిషిని నేను

వయ్యారి తారకలకు ప్రేమికుడిని నేను
వెన్నెలరాజు నెలవంకకు నేస్తానిని నేను
నీలినింగిపై తేలియాడే మేఘమాలికలకు ఆప్తుడిని నేను
గిలిగింతలు రేపే చిరుగాలిలో సవ్వడిని నేను
వికసించే పువ్వులో మెరిసే నవ్వును నేను
మైమరిపించే ప్రకృతికాంతకు దాసుడిని నేను
నక్షత్రాల మెరుపులో అక్షరాలను ఏరుకుంటా
చందమామ వెన్నెలలో భావాలను దోచుకుంటా
అక్షర విన్యాసాలు తెలియదు నాకు
యాసప్రాసాల ప్రాకులాట రానేరాదు నాకు
పామరులకు తెలియని పదాలు రావునాకు
భాషాకోవిదుల పాండిత్యం అబ్బలేదు నాకు
మనసుపువ్వులను అక్షరాలుగా
అప్పుడే పుట్టిన ఆలోచనలు భావాలుగా
నాదైన లోకంలో విహరిస్తూ
తెలిసిన భాషలో పదాలు అల్లుకునే నేను
కవిని కానే కాను
ఓ మామూలు మనిషిని