మామూలు మనిషిని నేను
వయ్యారి తారకలకు
ప్రేమికుడిని నేను
వెన్నెలరాజు నెలవంకకు
నేస్తానిని నేను
నీలినింగిపై తేలియాడే
మేఘమాలికలకు ఆప్తుడిని నేను
గిలిగింతలు రేపే
చిరుగాలిలో సవ్వడిని నేను
వికసించే పువ్వులో
మెరిసే నవ్వును నేను
మైమరిపించే
ప్రకృతికాంతకు దాసుడిని నేను
నక్షత్రాల మెరుపులో
అక్షరాలను ఏరుకుంటా
చందమామ వెన్నెలలో
భావాలను దోచుకుంటా
అక్షర విన్యాసాలు
తెలియదు నాకు
యాసప్రాసాల ప్రాకులాట
రానేరాదు నాకు
పామరులకు తెలియని పదాలు
రావునాకు
భాషాకోవిదుల పాండిత్యం
అబ్బలేదు నాకు
మనసుపువ్వులను
అక్షరాలుగా
అప్పుడే పుట్టిన
ఆలోచనలు భావాలుగా
నాదైన లోకంలో
విహరిస్తూ
తెలిసిన భాషలో పదాలు
అల్లుకునే నేను
కవిని కానే కాను
ఓ మామూలు మనిషిని
No comments:
Post a Comment