Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 23 March 2021

యాక్ట్ ఆఫ్ గాడ్

 

యాక్ట్ ఆఫ్ గాడ్



నువ్వు కిరాతకుడివా

రోజూ పాపాలే చేస్తున్నావా

చింతవలదు

బెంగపడకు...

నువ్వు మహా పుణ్యాత్ముడివా

మిడిసి పడకు

సంతసించకు...

కిరాతకం నీది కాదు

నువ్వే పాపమూ చేయలేదు

పుణ్యమూ నీది కాదు

నువ్వే ఘనకార్యమూ చేయలేదు...

నువ్వు హిందువువైనా

ముస్లింవి అయినా

క్రైస్తవమే నీదైనా

ఒక్కసారి నీ మతగ్రంధం తెరిచి చూడు

నువ్వు కర్తవు కాదు

క్రియవీ కాదు

సర్వం నేనే అని

ఆ దేవుడు

అభయమిస్తున్నాడు చూడు...

చింత ఏల నీకు

తోచింది చేసేయ్

నచ్చినట్లు బతికేయ్

పాపపుణ్యాల భారం దేవుడిమీదకు తోసేయ్

యాక్ట్ ఆఫ్ గాడ్ అని సరిపెట్టేయ్...

Monday 22 March 2021

నవోదయం కోసం

 

నవోదయం కోసం



అదిగో

అక్కడేదో చుక్కల లోకం

రమ్మని పిలుస్తోంది

నవ వసంత కోయిలలా...

ఇంతలోనే ఏమయ్యింది

ఆ మెరిసే అగ్నిశిఖ

నావైపే దూసుకువస్తోంది...

చుక్కల నీడలో వెన్నెలదుప్పటి కప్పుకుని

సేదతీరాలని అనుకున్నా

ఇప్పుడు నిప్పుకణికలను

ముద్దాడాలా...

ఆ పక్కన ఏదో చిరుగాలి సవ్వడి చేస్తోంది

ఎదను తాకి గిలిగింతలు రేపుతోంది

అప్పుడే పూసిన వసంతంలా...

ఏదని నమ్మను

ఎలా నమ్మను

ఈ క్షణానికి

ఆ క్షణానికి

పొంతనే లేదెలా...

అయినా

నడుస్తున్నా

నడుస్తూనే ఉన్నా

పెదాలపై చిరునవ్వులు అద్దుకుని

కనులనిండా వెన్నెల నింపుకుని

గుండె గుడిలో చిరుదీపం వెలిగించుకుని

నవోదయం కోసం అడుగులు వేస్తున్న  బాటసారిలా....

Wednesday 17 March 2021

నీకంత దమ్ముందా?

 

నీకంత దమ్ముందా?



నా స్థితిగతులను మార్చగలవు

నా వేశభాషలను మార్చగలవు

నన్ను ఆకాశానికి ఎత్తగలవు

నేలపై విసిరేయగలవు

నిమిషంలో నా జీవితాన్ని ఎలాగైనా మార్చగలవు

ఓ కాలమా

నా మనసుని మార్చగలవా

నీకంత దమ్ముందా?

Saturday 13 March 2021

గడసరి మల్లెలు

 

గడసరి మల్లెలు

మల్లికా నువ్వెంత గడసరివే

పాలమీగడ వర్ణంతో

మృధువైన దేహంతో

ఆకుచాటు సోయగాలతో

పుష్పవనానికి రాకుమారిలా కనిపిస్తావు...

దేవుని పాదాల చెంతన ఒదిగి వరాలిచ్చే దేవతవై

గుభాళిస్తూ ఉంటావు...

మరి జవరాలి కొప్పున చేరగానే నీలో ఎంత మార్పు

కురుల తీగలను సవరిస్తూ

మన్మదవీణను పలికిస్తావు

కొంటెగా కన్ను గీటుతూ

పరిమళాల ఆయుధాలు సంధిస్తావు

సమరానికి సై అంటూ సవాలు విసురుతావు

మల్లికా నువ్వెంత గడసరివే...

Friday 5 March 2021

ఏమయ్యింది?

 

ఏమయ్యింది?



హఠాత్తుగా ఏమయ్యింది

సునామీ వచ్చింది

సునామీ ఎందుకు వచ్చింది

కడలి ఎగిసింది

ఎందుకు ఎగిసింది

ఏదో ఒత్తిడి ఏర్పడింది

అయితే ఏమయ్యింది

సునామీ తీరం దాటింది

నువ్వేం చేస్తున్నావ్

షెల్టర్ కోసం వెతుకుతూనే ఉన్నా

షెల్టర్ దొరికిందా

దొరకదని తెలిసినా పరుగులు తీస్తూనే ఉన్నా

మరేమయ్యింది

సునామీ అంతా ఊడ్చేసింది

ఇప్పుడెక్కడున్నావ్

మిగిలిన అవశేషాల మధ్య నిలిచి ఉన్నా

అక్కడేం చేస్తున్నావ్

మరో సునామీకి స్వాగతం పలికేందుకు

బలాన్ని కూడదీసుకుంటున్నా