Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 29 July 2015

అనురాగ దేవత నీవే

అనురాగ దేవత నీవే

అనురాగ దేవతనీవే
నా ఆమని పులకింత నీవే
ఎవరి అక్షరాలో
ఎవరి భావాలో
ఆ గళం నుంచి జాలువారాయి
మంద్రమైన ఆ గీతం ఇరు హృదయాలను
పులకింపజేసింది
ఆనందపరవశమైన
కనులు చెమర్చాయి
ఆనంద భాష్పాలు చెక్కిళ్ళను
ముద్దాడాయి
పల్లవించవా నాగొంతులో
అంటూ మనసులు
యుగళగీతాలు పాడుకున్నాయి
ఇప్పుడూ
అదే భావం
అదే రాగం
అదే గానం
అదే సంగీతం
చెవులను తాకగానే
గుండె ఎందుకు మెలియపడుతోంది
మనసు ఎందుకు విలపిస్తోంది
జలజలా కన్నీరెందుకు ఉబికివస్తోంది
తల ఎందుకు భారమవుతోంది
నీకు నేనూ
నాకు నీవూ
అంకితమిచ్చుకున్న
ఆ పాటల పుష్పాలు
ఎందుకు ముళ్ళలా గుచ్చుకుంటున్నాయి
నీతో కలిసి నేను
విహరించిన పాటల పూదోట
ఎందుకు నాకు స్మశానంలా కనిపిస్తోంది
తెలుసా మనసా నీకు
నీవు లేని సంగీత పుష్పికలు
నీవుంటేనే వికసిస్తాయి
నీవు లేని ఆ పువ్వులు
నా గుండెకు గుచ్చుకునే ముళ్ళే
మనస్వినీ

మాయల మరాఠీని కాదు నేను

మాయల మరాఠీని కాదు నేను

రారాజుని కాదు నేను
మాయానగరిలో లేను నేను
మాయలు నాకు రావు
మాటల మరాఠీని కాదు నేను
అవసరం కోసం ఆపేక్షలు కలగవు నాకు
మాటల్లో మతలబులే లేవు నాకు
మనసు నగర విహారిని నేను
నిరంతర ప్రేమ పిపాసిని నేను
మనసు బాటలో గాయపడ్డ ఆవేదన నేను
క్షణం క్షణం తూట్లు పడుతున్నా
మౌనంగా మిగిలిన నిర్వేదం నేను
ఊసులన్నీ కరిగిపోయి
నిశబ్దంగా జారిపడి
ఘనీభవించిన కన్నీటి చుక్కను నేను
మనసు బాటలో దిక్కు తోచక
పేజీలు చిరిగిపోయిన
మనసు పుస్తకం నేను
మనో సంద్రంలో మునిగిపోయిన
నావనే నేను

Tuesday, 28 July 2015

మహర్షికి సలాం

మహర్షికి సలాం


ఓ మహర్షీ
జాతి మరువదు నీఖ్యాతిని
ఓ దార్శనికుడా
నీ అడుగుజాడలే మాకు కరదీపికలు
ఓ మేధావీ
నీ మహోన్నత ఆలోచనలే మా లక్ష్యాలు
ఓ స్వాప్నికుడా
నీ స్వప్నాలే భరతమాత సిగలో పుష్పాలు
ఓ వైజ్ఞానికుడా
నీ ఆవిష్కరణలే మాకు ఆయుధాలు
ముకుళిత హస్తాలతో మనసు
ప్రణమిల్లుతోంది
మహాత్మా నీవు మాలో లేకున్నా
నీ ఆలోచనలు నిత్యం మాతోనే ఉంటాయి
భారతజాతి చరిత్రలో
నువ్వు నిత్యం వికసిస్తూనే ఉంటావు
నా దేశ భవితను నీవు
చేయి పట్టుకుని నడిపిస్తావు
నా జాతి విజయంలో
మళ్ళీ మళ్ళీ పుడుతావు
కలాం నీకు నాదేశం
అందిస్తోంది సలాం

Monday, 27 July 2015

సింహం నవ్వితే?

సింహం నవ్వితే?

మీరు బతికి ఉన్న చోట
అదే ప్రపంచమని అనుకుంటారు
బావిలో కప్పలు మీరు
అరకప్పునీటీనే సునామీ అనుకుంటారు
పిల్ల కాలువలో ఈదుతూ
సముద్రాన్నే దాటేసామని పొంగిపోతారు
కుక్కమూతి పిందెలు మీరు
సింహం గురించి ఆరా తీస్తారు
కుక్కలను వేటాడదు సింహం
సింహం కలలోకి వస్తేనే ఉలిక్కిపడే
పిరికిబందలు
ఎలా ఉన్నానో అని ఆరాలు తీయటం కాదు
గుండె దిటవు చేసుకుని
సింహం ముందుకు రండి
ఎవరినో అడిగి తెలుసుకోవటం దేనికి
సింహాన్నే అడగండి
సింహం నవ్వితే
ఆ గర్జన కే గుండెపగిలి చస్తారు
నీతి జాతి లేని మీరు
చీకటి పనులే జీవితమని నమ్మే మీరు
అమాయకుల జీవితాలతో
చెలగాటమాడే మీరు
మృగరాజు గురించి ఆలోచించటం
ఆకాశంలో నక్షత్రాలు లెక్కించటమే
మనసు ముందు మ్రోకరిల్లిన సింహం
తట్టి లేపితే సింహ స్వప్నమే అవుతుంది
నిజానికి సివంగి పంజాకే
నిద్రలేని రాత్రులు గడుపుతున్న కుక్కలు
సింహం జోలికి వస్తే ...
సివంగి చాలురా
మీ కుక్క బతుకులకి

Saturday, 25 July 2015

కరిగిపోవాలని ఉంది

కరిగిపోవాలని ఉంది

జీవం కోల్పోయిన అక్షరాలను
సంస్కరించాలని ఉంది...
ఉప్పొంగే లావాలో
కడగాలనిఉంది...
మండుతున్న అగ్నిశిఖల్లో
ఆరేయాలని ఉంది...
మనసును తాకని భావాలను
విసిరేయాలని ఉంది...
జాలువారే మనసు గీతాలను
మూగవీణలో పాడాలని ఉంది...
తిరస్కరణ పురస్కారాన్ని
అందుకున్న అక్షరాలెందుకు...
మనసును గెలవని భావాలెందుకు
కన్నీటిని కానుకగా ఇచ్చే
మనసు గీతాలెందుకు...
మనసే లేని మనిషిని
రాగమే లేని పాటని
రాలిపడుతున్న అక్షర కవితని
లయలేని నృత్యాన్ని
వెలుతురే లేని నిశిరాతిరిని
ఇంకా నాకు ఈ దేహం ఎందుకు
కరిగిపోయిన గతంలా
నాకూ మాయమవ్వాలని ఉంది...

Friday, 24 July 2015

రాలిపడిన కన్నీటి చుక్క

రాలిపడిన కన్నీటి చుక్క

నిశ్శబ్ద వీణ తంత్రుల సవ్వడిలో
వినిపించింది ఒక మౌనరాగం
గుండె గొంతుకను చీల్చి
గాలిలో కలిసిపోయింది ఒక ఆర్తనాదం
కన్నుల మైదానంలో వికసించి
గుండె లోయల్లో జారిపడింది
ఒక సుందర స్వప్నం
ఎదలోయలలో అగ్నికి కాలిపోయి
బూడిదగా రాలిపోయింది
ఒక కలల సౌధం
కూలిన సౌధంలో ఆరిపోయింది
ఒక ఆశాదీపం
ఆవిరవుతున్న జ్ఞాపకాల వెల్లువలో
మౌనంగానే జారిపడింది
ఒక కన్నీటి చుక్క
నిశ్శబ్దంగా పరుచుకుంటున్న
నిశిరాతిరిలా....

Monday, 13 July 2015

మరో ప్రస్థానంమరో ప్రస్థానం


విడివడిన అడుగులు నడువలేకున్నవి
ఒంటరి అడుగుల పయనం
వల్ల కాదని అంటున్నవి
జతగూడి నడిచిన అడుగుల జాడలను
మరలా వెతుకుతున్నవి
తీరాల ముంగిట నిలిచిన అడుగులు
జాడలనే పిలుస్తున్నవి
ఒంటరి నడకలో పువ్వులైనా
ముళ్ళనే మారాం చేస్తున్నాయి
ముళ్ళ కంచెలో నడకైనా
జతకలిస్తే పూలబాటే అంటున్నవి
మనసెరిగిన అడుగులు
జాడలను చేరుకుంటాయా
చేరువైన అడుగులు
కొత్త జాడలను సృష్టిస్తాయా
నవ్య బాటలో పయనం
తీరాలను దాటుతుందా
అనుభవాల సుడిలో పాఠం నేర్చిన
అడుగులు మరలా వసంతాన్ని ముద్దాడుతాయా
వాడిన వసంతంలో మారాకులు పలకరిస్తాయా
జతగూడిన అడుగులు
మరో ప్రస్థానానికి తెర లేపుతాయా

Sunday, 12 July 2015

మట్టిలోనే కలిసిపోతా

మట్టిలోనే కలిసిపోతా

నేను నేనేగా
మరొకరిని ఎలా అవుతాను
నాలో లేనిది నాలో ఎలా కనపడుతుంది
నాలో ఉన్నదే నాతో ఉంటుంది
సిరి సంపదలు నాకు లేవు
ఉన్నతమైన భావాలూ నాకు లేవు
ఇంద్రులు చంద్రులు ఎందరైనా ఉండవచ్చు
మట్టి మనిషిని నేను
మట్టి వాసనే వస్తుంది
గుభాళింపులు నాకెక్కడివి
మట్టి ఆలోచనలు తప్ప
సుగంధాలు ఎక్కడివి
భోగ భాగ్యాలు నాకు లేవు
వాటికోసం ఆరాటమూ లేదు
మనసులోనే సిరిని చూసుకున్నా
మనసులోనే బతుకును వెతుక్కున్నా
అక్షరాలను అల్లుకున్నా
భావాలను రాసుకున్నా
నా మనసుకే అన్నీ అంకితమిచ్చుకున్నా
పరాయి మనసులను తాకలేదు
ఏ మనసునూ కదిలించలేదు
నా గోడు నా మనసుకే చెప్పుకున్నా
నా మనసుకే పట్టని నా వేదన
ఎవరికీ అర్ధం కాని ఆవేదన
గజిబిజి మనసుల తులాభారంలో
జారిపడిన మట్టి మనిషిని
మట్టిలోనే కలిసిపోనా

Friday, 10 July 2015

అంతిమయాత్ర

అంతిమయాత్ర

నిశీధి రాజ్యానికి అధినేతను నేను
కుప్పకూలిన శిఖరంలో ఒంటరిగా
విలపిస్తున్న పునాదిరాయిని నేను
కూలిన సౌధంలో ఎగసిపడిన
మట్టిధూళిని నేను
ఉప్పెనలా కమ్ముకున్న నీటి కెరటాలకు
కొట్టుకుపోయిన పూదోటను నేను
వాడిన వసంతంలో
రెక్కలు విరిగిన పువ్వునే నేను
కనులముందు స్వప్నాలు కరిగిపోతుంటే
ఏమీ చేయలేక
ఘనీభవించిన కన్నీటి చుక్కను నేను
అడుగుజాడలు వెతుక్కుంటూ
బురద మట్టిలో దిగబడిన
పాదమును నేను
కలల పుష్పాలు
ధూళిలో కొట్టుకుపోతుంటే
నిర్వేదంగా చూస్తూ నిలిచిన
మోడువారిన మానుని నేను
ఊహల నగరిలో విహరించి
ఎదురేలేదు నాకంటూ పొంగిపోయి
అయినవారందరినీ దూరం చేసుకున్న
అనాధనే నేను
నాదన్నది నాదే
అదే ధర్మమని హద్దులు దాటిన
భంగపాటును నేను
గుండె నిండా అనురాగాన్ని
మనసునిండా మమకారాన్ని
ప్రతిశ్వాసలో అనుబంధాన్ని
దాచుకున్నా
పిచ్చి పిచ్చి భావాలతో
ఎవరికీ అర్థంకాని అంతరంగంతో
మనసు భాష చెప్పలేని
వైఫల్యంతో
అంతిమయాత్రకు పయనమైన
బాటసారిని నేను

Thursday, 9 July 2015

ప్రశ్నిస్తున్న పువ్వులు

ప్రశ్నిస్తున్న పువ్వులు

గాలీ వాన
దిక్కులు కానరాని జడివాన
నింగీ నేలను ఒకటి చేస్తున్న హోరుగాలి
జీవన తంత్రంలో
కుట్రలు కుతంత్రాల చదరంగంలో
మాయాలోకపు పోకడలో
మనుగడకోసం
బ్రతుకు సమరంలో
ఓడిపోయిన మనసు
ప్రశాంతత కోసం
అంతిమ అడుగులు వేస్తుంటే
కాళ్ళకు ఏదో తగిలింది
ఏవో రెండు లతలు
పాదాలను పెనవేసుకున్నాయి
ఒక్కసారి చూసాను ఏమిటా అని
రెండు లతలకు రెండు పువ్వులు
వాన నీటికి తడిసి ముద్దయ్యాయి
హోరుగాలికి వణికిపోతున్నాయి
ఆర్తిగానూ
భయంగానూ
ఆవేదనగా నా వైపే చూస్తున్నాయి దైన్యంగా
మేమేం పాపం చేశామన్నట్టుగా
అవును ఆ పసి పుష్పాలు ఏం చేసాయి
ఎందుకింత శిక్ష ఆ పసిమనసులకు
నేను చేసిన తప్పిదాలకేగా అవి బలయ్యాయి
నా జీవనవనంలో విరిసిన పుష్పాలవి
భ్రమల్లో విహరించిన నేను
ఆ పువ్వులను గాలికి వదిలేసాను
ఆ లేత పువ్వులు
ఎండకు ఎండాయి
వానకు తడిచాయి
నా ఆనందంలో
నా వేదనలో
నా ప్రతి గమనంలో
నా అడుగులలో
నా తప్పుటడుగులలో
నా వెంటే ఉంటూ నిత్యం పరిమళించాయి
కన్నులున్నా కబోధిలా నేను
ఆ పువ్వులలో వాడుతున్న రెక్కలను చూడలేదు
ఆ కడుపుల ఆకలి కేకలు వినలేదు
మనసంటూ ఒకసారి
సిద్దాంతాలంటూ మరోసారి
నా బాటలోనే సాగిపోయా తప్ప
పసి మొగ్గల ఆవేదన ఆలకించలేదు
కూలిన శిథిలాల కింద
ఆ పువ్వుల బతుకు కేకలు నాకు వినిపించనే లేదు
తూఫాను ఎందుకు వచ్చిందో
వసంతం ఎందుకు వాడిందోనని
సాకులు వెతికానే గాని
నా పువ్వులు వాడిపోతున్నాయన్న ధ్యాసే రాలేదు నాకు
ఇప్పుడు వణుకుతున్న ఆ పువ్వుల రూపంలో
జవాబులేని ప్రశ్నలే కనిపిస్తున్నాయి
దేవుడా
నా పాపాలకు
ఆ పసిమొగ్గలను శిక్షించకు

Wednesday, 8 July 2015

మనసు మరణించింది

మనసు మరణించింది

చెయ్యెత్తిన మనసుకు
శిరస్సు వంచి ప్రణమిల్లా
ఘాతములు విసిరిన పిడికిలికి
దేహాన్ని అంకితమిచ్చా
గొంతు నులిమిన కరములకు
కంఠాన్ని కానుకగా ఇచ్చా
జలజలా కురిసిన కన్నీటిలో
మనసును పునీతం చేసుకున్నా
కర్ణభేరి లోతులనుంచి పొంగిన
రుధిరంతో మస్తిష్కం తుడుచుకున్నా
పుండైపోయిన గొంతుకలో మాటలు భారమై
మనసుతోనే పలకరించుకున్నా
గొంతుకలో చల్లని నీరే మంటలు రేపినా
మనసునే శుద్ధి చేసుకున్నా
మానసిక దాడుల వెల్లువలో
భౌతిక దాడి ఏపాటిదని
మనసుకు నచ్చ జెప్పుకున్నా
గొంతుపై మెరిసే రక్తపు చారలు
మనసు గాయాలకంటే పెద్దవా
రెండు పదుల వసంతసౌధం కుప్పకూలినా
మనసు బాటలోనే నడిచిన నేను
ఆ మనసు ఘాతాలను భరింపజాలనా
అబద్దాల నగరిలో విహరించిన మనసు
ఆవేశాన్నే శరములుగా సంధిస్తే
ఆ మాటల తూటాల గాయాల మంటలకంటే
దేహానికి తగిలిన గాయాలు తేలిక కాదా
దేహపు గాయాలు కుదుటపడతాయ్
ఆ మంటలూ చల్లారతాయ్
మనసుకు తగిలిన గాయాలు
అంత తేలికగా మానునా
పగిలిన మనసు మరలా వికసించునా
ఇది జరిగేనా
జరగదు
ఎందుకంటే మనసు పగలలేదు
మనసు మరణించింది
మిగిలింది దేహమే
దేహమూ
మరణిస్తుంది