Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Thursday, 30 March 2017

ఇలా అనిపిస్తోంది

ఇలా అనిపిస్తోంది  

మొదటిసారి ఇలా అనిపిస్తోంది
నా అక్షరాలను సాగర గర్భంలో విసిరేయాలని
విచ్చుకుంటున్న భావాలను
మొగ్గలోనే చిదిమేయాలని
చల్లగా తాకుతున్న మధురిమలను
మండుతున్న మనసులోని చితిమంటలలో
దహనం చేసేయాలని
కనురెప్పలపై గూడుకట్టుకున్న స్వప్నాలను
జలజల జారే కన్నీటిలో కడిగిపారేయాలని
రెక్కలు విచ్చిన ఆశల తారకలను
నైరాశ్యంలో సమాధి చేసేయాలని
నవ్వుతున్న వేకువను
చీకటి బాణాలతో చంపేయాలని
నన్ను మోస్తున్న ధరణిని వీడి
అనంత విశ్వంలో కలిసిపోవాలని

Sunday, 26 March 2017

మంచుకొండల్లో మనస్వినీతో

మంచుకొండల్లో మనస్వినీతో


ఎదను తాకిన చల్లని గాలులు
గుండె గడ్డ కట్టిందేమోనని కలవరం
బిగుసుకుపోయిన దేహంలో
అదుపుతప్పిన ప్రకంపనలు
విప్పారిన కనులముందు
హిమవన్నగ సోయగాలు
వెండి కొండలపై పాల నురగలా
తెల్లని పరదాల దుప్పటి కప్పిన చందంలా
కనురెప్పలకే పరిమితమైన స్వప్నాలు
కనుల ముందు నిలిచిన వైభవంలా
అది మాయాలోకపు విహారమా
సృష్టికర్త కుంచె నుంచి జారిపడిన
మంచుపూల వసంతమా
దేవుడు దివినుంచి భువికి దింపిన
స్వర్గలోక సౌందర్యమా
దైనందిక జీవన బంధనాలు విసిరేసి
మంచుపూల మనస్సుతో
పెంగ్విన్ పక్షుల జంటలా
అప్పుడే కురిసిన హిమ వర్షంలో
మనస్వినీ సహిత విహారం
కిలకిల రావాల సోయగం  
వెచ్చని కోర్కెల సాంగత్యం
మరలా మరలా కోరదా మనసు
ఆ అందమైన అనుభవం  

Friday, 17 March 2017

జాబిలి


చల్లని లోగిలి
వెచ్చని నెచ్చెలి
బిగిసిన కౌగిలి
నేలమీదకు జారెను
నిండు వెన్నెల జాబిలి ....

Sunday, 12 March 2017

మనసుంది నాకు

మనసుంది నాకు
నా అడుగుల జాడలను శోధించకు
అడుగులో అడుగేయాలని తపన చెందకు
నా కనురెప్పల కూడలిలో నడియాడే నీవు
నాకు తోడూనీడగానే నడుస్తావు
సురక్షిత పయనానికై కలత చెందకు
మరు నిమిషానికి ఆలోచన చేయకు
భద్రమైన నా గుండె గుడిలో కొలువుదీరిన నీవు
అనుక్షణం సురక్షితమై నిలుస్తావు
నీలికన్నుల పరదాలపై తడి చేరనీయకు
కంటి ముత్యాలను నేలపాలు చేయకు
నా కంటిపాపలో చిరునవ్వువైన నీవు
నిత్యం వేగుచుక్కలా మెరుస్తావు
అలాంటి వాడినో
ఇలాంటి వాడినో
నాకైతే తెలియదుకాని
నీకోసం మరణించే మనసున్న మనిషినే నేను
మనస్వినీ...

Thursday, 9 March 2017

జలపుష్పం

జలపుష్పం

మాటలకందని భావాలు
మనసును మెలియపెడుతున్న వేళ
ఎక్కడో నక్షత్రాల గుంపునుంచి
ఓ తారక మౌనంగా జారిపడుతూ ఉంటే
వేకువను చూసి బెదిరిపోతున్న వేగుచుక్కలా
మనసు కలవరమైపోతూ ఉంటే
చీకటిని పులుముకున్న హృదయం
కంటి కాటుకలా కరిగిపోతూ ఉంటే
మనసుసంద్రంలో పుట్టింది ఓ భరోసా
నేనున్నానంటూ ఇచ్చింది ఆసరా
మనసు వీధుల్లో చక్కర్లు కొడుతూ
కనుల తలుపును దాటింది నులివెచ్చని నేస్తం
ఎంత ఆత్మీయమా నేస్తం
మాటలు రాని మౌనంలో
వికసించిన జలపుష్పం
సదా తోడు నిలిచే వేదనా పుష్పం
మనసున్న మనసుకు
మనసైన నేస్తమే కదా
మనస్వినీ 

Thursday, 2 March 2017

దేవకన్య

దేవకన్య

తలవాల్చి ప్రణమిల్లుతున్నట్లు
తీరానికి చేరి సలాము చేస్తున్న కడలి కెరటాలు
పాదాలను మృదువుగా కడుగుతూ ఉంటే
ముద్దాడుతున్న ఇసుక తిన్నెలలో
అడుగుతీసి అడుగులు నేను వేస్తూ ఉంటే
నా పాదములు జారవిడిచిన ముద్రలలో
నీవు అడుగులు వేస్తూ నా వెంట నడుస్తూ ఉంటే
సప్త పదములు పూర్తి చేసిన
పెళ్లికూతురువి నీవై నడియాడగా
ఇసుక రేణువులు నీ పాదాలకు పారాణిలా
సముద్రుడి ఘోష వేదమంత్రాలు జపించగా
అలలపై నర్తించే పిల్లగాలులు
మంగళ వాయిద్యాలు మోగించగా
పకృతి అందాలు దీవెనలు అందించగా
ఎంత మధురం ఆ దృశ్యం
ఎంతగా పులకించింది నా మానసం
ప్రకృతి కాంత ఒడిలో చిన్నారి దేవకన్యలా
నీవు చిందించిన నవ్వులు
నీవు రువ్విన పువ్వులు
మరువగలనా ఆ అనుభవం
నిలిచి ఉండదా కలకాలం
మనస్వినీ...