ఇలా అనిపిస్తోంది
మొదటిసారి ఇలా
అనిపిస్తోంది
నా అక్షరాలను సాగర
గర్భంలో విసిరేయాలని
విచ్చుకుంటున్న
భావాలను
మొగ్గలోనే చిదిమేయాలని
చల్లగా తాకుతున్న
మధురిమలను
మండుతున్న మనసులోని
చితిమంటలలో
దహనం చేసేయాలని
కనురెప్పలపై
గూడుకట్టుకున్న స్వప్నాలను
జలజల జారే కన్నీటిలో
కడిగిపారేయాలని
రెక్కలు విచ్చిన ఆశల
తారకలను
నైరాశ్యంలో సమాధి
చేసేయాలని
నవ్వుతున్న వేకువను
చీకటి బాణాలతో
చంపేయాలని
నన్ను మోస్తున్న
ధరణిని వీడి
అనంత విశ్వంలో
కలిసిపోవాలని
No comments:
Post a Comment