Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 21 July 2020

బాధ్యత మరిచిపోలేదు (PART-13)


బాధ్యత మరిచిపోలేదు (PART-13)
నా జర్నలిజం కెరీర్ గురించి రాస్తుంటే కొంతమంది నుంచి విమర్శలు వస్తున్నాయి. వాటిని విమర్శలు అనడం కంటే సందేహాలు అని అనుకుంటున్నా. ఎందుకంటే నా రాతలు ఓపికగా చదువుతున్నారంటే అందుకు నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సహజంగానే కొన్ని సందేహాలు పుట్టుకువస్తాయి. చదివే వారు బోర్ గా ఫీల్ కావద్దని నేను విషయాన్ని కుదించి రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఫలితంగా కొన్ని విషయాలకు లింక్ తెగిపోవడమో, మరికొన్ని విషయాలు మరుగున పడటమో జరుగుతోంది... సందేహాలు పుట్టుకువస్తున్నాయి... అయితే ప్రముఖ బ్లాగర్ శ్యామలీయం గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. చాలా సమంజసమైన ప్రశ్నలే అవి. మిగిలినవారిలోనూ ఈ తరహా డౌట్లు ఉండవచ్చు.
సిటీకేబుల్ నాటి విషయం ముందుగా చెప్పుకుందాం. ఓల్డ్ సిటీ మక్కామసీదు దగ్గర అల్లర్లు జరుగుతాయని ముందే తెలిసినప్పుడు ముందుగా ఆ విషయం పోలీసులకు చెప్పకుండా లైవ్ ఏర్పాట్లు చేసుకోవడం ఏంటి జర్నలిస్టులకు కనీస సామాజిక బాధ్యత ఉండొద్దా అని ఒక సందేహం.. నిజమే ఎంత తోపు జర్నలిస్టులకైనా సామాజిక బాధ్యత ఉండాల్సిందే. నాకూ ఉంది ఆ బాధ్యత. నాకు సమాచారం అందిన వెంటనే ఆ విషయం మా బాస్ రవిప్రకాష్ కు చెప్పేసాను. అంతటితో చేతులు దులుపుకోలేదు. విషయం చార్మినార్ పోలీసులకు చెప్పాను. సార్ నాకు ఇలాంటి సమాచారం ఉంది ఒకసారి తెలుసుకోండి అని చెప్పా.. సదరు ఇనస్పెక్టర్ గారు ఏమన్నారో తెలుసా... మాకు ఇలాంటివి అలవాటే బై... నమాజు కాగానే కొందరు వస్తారు రాళ్లు రువ్వుతారు, మేము లాఠీ ఛార్జ్ చేస్తాం ఇది కామనే కదా అని కొట్టిపారేశారు. కానీ మా మేనేజ్ మెంట్ ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంది. మా ఆఫీసు కెమెరాలతోపాటు దూద్ బౌలీలో ఉన్న ఓల్డ్ సిటీకేబుల్ కెమెరాలను కూడా లైవ్ కోసం వాడాము. ఓల్డ్ సిటీకేబుల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి నా మాట మీద చాలా నమ్మకం ఉండేది. (ఆయన తర్వాత కేబుల్ వార్ లో భాగంగా హత్యకు గురయ్యారు ). పోలీసులు మాత్రం ఈ సమాచారాన్ని లైట్ తీసుకున్నారు. ఫలితం సర్వనాశనం. చార్మినార్ దగ్గర చెలరేగిన ముష్కర మూకలు, బస్సుల దగ్ధం గంటల తరబడి కొనసాగింది. ఒక దశలో ముష్కర మూకలు పోలీసులనే తరిమికొట్టిన దృశ్యాలు మా కెమెరాకు చిక్కాయి. పోలీసులు నిజంగానే అక్కడికి అదనపు బలగాలను రప్పించి ఉంటే ప్రాణనష్టం ఆస్తి నష్టం తప్పేది కదా.. తీరా అంతా అయ్యాక సిటీకేబుల్ కు ముందే ఎలా తెలుసు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుకున్నారు గానీ ముందు జాగ్రత్త పడలేకపోయారు. అసలిక్కడ అడగాల్సిన ప్రశ్న ఇంటలిజెన్స్ ఏం గడ్డి పీకుతోందని.. సరే చివరికి మేము తీసిన విజువల్స్ ఆధారంగానే పోలీసులు చాలామందిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారమే నా కొంప ముంచిందనే విషయం తెలిసిందే. నిజానికి టీవీల్లో చూపే సంఘటనల ఆధారంగానే చాలా చోట్ల ఉద్రిక్తతలు పెరుగుతాయనే విషయం కూడా నాకు అప్పుడే అర్ధమయ్యింది. కానీ పోటీ ప్రపంచం, అందరిలాగే మేమూ చూపాల్సిందే కదా. అయితే జీ 24 గంటల్లో ఉన్నప్పుడు ఈ పద్ధతిని అరికట్టేందుకు గట్టిగానే కృషి చేసా. బేగం బజార్ లోని ఒక మసీదు పై దాడిని మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది మాతో సహా.. ఫలితంగా పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఎంత వారించినా ఎవరూ ప్రసారాలు ఆపలేదు. అప్పుడు నేను మా బాస్ శైలేష్ రెడ్డికి విషయం వివరించి ముందుగా మనమే ఒక అడుగు వేద్దాం అన్నా అని అడిగాను. ఆయన ఒప్పుకున్నారు. వెంటనే మతపరమైన గొడవల ప్రసారాలు ఆపేస్తున్నట్లు tv లో స్క్రోలింగ్ వేసాం. కమిషనర్ ఏకే ఖాన్ గారికి కూడా మా నిర్ణయం చెప్పాం. తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో ప్రముఖంగా మా ఛానెల్ పేరు ప్రస్తావిస్తూ అన్ని ఛానల్స్ కూడా ఇలా స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కొంత తగ్గారు కానీ tv9 మాత్రం అప్పుడు యధావిధిగా అన్నీ ప్రసారాలు చేసేది. తర్వాత అందరిలో మార్పు వచ్చింది బాగా మేజర్ అయితే తప్ప చిన్న చిన్న గొడవలను పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఆ బాధ్యతను భుజాన మోస్తోందనేది వేరే విషయం.

2 comments:

  1. >> అయితే ప్రముఖ బ్లాగర్ శ్యామలీయం గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. చాలా సమంజసమైన ప్రశ్నలే అవి....
    భలేవారు. నేను ప్రముఖ బ్లాగరు నేమిటి!? నా బ్లాగుకు రోజుకు పట్టుమని పదిమంది వస్తే అదే గొప్ప విషయం! ఇకపోతే నా ప్రశ్నలు సమంజసమైనవి అని భావించి విపులంగా సమాధానాలను వివరించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. సర్.. నేనైతే అలా అనుకోను... వీక్షకులు రోజుకు పది మంది వస్తున్నారా వెయ్యి మంది వస్తున్నారా అనే దాన్ని బట్టి బ్లాగర్ ప్రముఖులు అవుతారని నేను అనుకోను. కంటెంట్ ముఖ్యం. మీరు గతంలోనూ నాకు కామెంట్స్ పెట్టారు. నేను మీ బ్లాగ్ చూసాను.. ఈమధ్యే కొద్దిగా తగ్గింది... మీ ముందు నేనెంత సార్ పిల్లకాకిని

      Delete