Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 31 May 2020

అన్నీ తెలుసు


అన్నీ తెలుసు
కాలి నడక తెలుసు
పాదాలకు పూసిన గాయాలు తెలుసు
జోరువానలో తడవటం తెలుసు
మండే ఎండలో సొమ్మసిల్లి పడిపోవడం తెలుసు
ఆకలి మంటలు తెలుసు
కన్నీళ్లు తాగి బతికిన వైనం తెలుసు
అవమానం తెలుసు
అవమానం మాటున దాచుకున్న అభిమానం తెలుసు
బతుకుపోరాటం తెలుసు
పోరాడి ఓడిన ఆవేదనా తెలుసు
చేయూతలేని సమరంలో
నా గెలుపులూ తెలుసు
స్నేహం తెలుసు
స్నేహం ముసుగులో ద్రోహం తెలుసు
ఒక్కో మెట్టూ ఎక్కడం తెలుసు
కాలు జారి కిందపడటమూ తెలుసు
పడుతూ లేస్తూ ముందుకు నడవటం తెలుసు
ఒడ్డును తాకి వెనక్కి పడినా ముందుకే సాగే కెరటాన్ని నేను
ఈ చరిత్రలో ఒక మామూలు మరకను కాదు
ఒక బలమైన ముద్రను నేను

ఏమో ఏమగునో...


ఏమో ఏమగునో...
వయసుకు మించిన వైరాగ్యం అణువణువునా ఆవరించినదేమో
మెదడును చీల్చిన నిస్తేజం
గుండెలో తిష్ఠ వేసినదేమో
నలు దిక్కులా గూడు కట్టిన
నిశబ్ధం దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తున్నదేమో
చీకటి గుండెలను కోస్తున్న వెలుతురు బాకుపై నల్లని మరకలు ఎన్నటికీ తడియారవేమో
ఏమో మౌనమునిలా
నిలిచిన శిఖరం
అగ్నిపర్వతమై రగులుతున్నదేమో...

Friday 29 May 2020

సిన్నబోయిన కలువకోసం..


సిన్నబోయిన కలువకోసం..
.
నింగి చుక్కల నడుమ వెలిగే జాబిల్లికోసం
చకోరానికి ఎంత ఆరాటం...
శశిని చేరాలనే మైకంలో
రెక్కలలో ప్రేమ ఇంధనం పోసి ఎగిరే ఆ పక్షిది
ఎంత ఉబలాటం...
పుడమి చాటున కుంగిన సూరీడు మరలా ఉదయించగానే అందంగా నవ్వే పొద్దుతిరుగుడు పువ్వులో ఎంత పరవశం...
మేఘాల పరదాల మాటున నక్కి దోబూచులాడుతున్న
చందమామను చూసి చిన్నబోయే కలువలది ఎంత ఉడుకుమోతుతనం...
చకోరమైకంలో
సూర్యముఖి పువ్వు ఆరాటంలో
చిన్నబోయిన కలువబాల మోములో దాగిఉన్న ఆరాధన
అంతులేని నిరీక్షణ
మానవమాత్రుడినైన నాలో ఉండదా...
వేచి ఉండనా ఆ చల్లని వెన్నెలకోసం
చేరగరానా ఆ నవ్వుల పువ్వులకోసం
నిరీక్షించదా నా మనసు
వికసించే నీకోసం
మనస్వినీ...

Thursday 28 May 2020

జర్నలిజమా నీకు వందనం


జర్నలిజమా నీకు వందనం

అక్షరం అన్నం పెడ్తలేదు
అభిమానం చేయి చాచలేదు
ఆకలి ఆగనంటోంది
గుండె మంట రగులుతోంది
అయినా దిక్కు తోచదు
ఏం చేయాలో పాలుపోదు
ఆకలి తీర్చని అక్షరమే దిక్సూచి
ఏదో చెప్పాలి ఈ లోకానికి
అలుపెరుగని ఆలోచనలు
అంతరంగంలో సమరాలు
లోకంలో అరాచకాలపై వార్తలు
తమ యజమానుల ఆగడాలపై నిట్టూర్పులు
తమ బతుకింతేనంటూ ఓదార్పులు
సమాజంలో జర్నలిస్టులు
జీవితంలో భికారులు
ఎర్నలిస్టులు కొందరు ఉండవచ్చు గాక
అసలైన జర్నలిస్టుల బతుకులు
చితిమంటల ఆనవాళ్లు
అక్షరాల వ్యసనానికి బానిసైన మనిషిని
ఒక అందమైన శవంలా మార్చిన జర్నలిజమా
నీకు వందనం.

తెలియనే తెలియదు


తెలియనే తెలియదు
 
యుద్ధం చేయాలనే కసి ఉంది
చేతిలో ఆయుధమే లేదు...
గెలిచితీరాలనే తపన ఉంది
లక్ష్యం ఏమిటో తెలియదు...
ఆకాశానికి నిచ్చెన వేయాలనే కాంక్ష ఉంది
పునాదులు ఎప్పుడు జారిపోయాయో తెలియదు...
పరుగులు తీయాలనే ఆశ ఉంది
మార్గమేమిటో నా పాదాలకు తెలియదు...
మనసునిండా నవ్వాలని ఉంది
నా చిరునవ్వులను ఎక్కడ జారవిడుచుకున్నానో తెలియదు...
జీవించాలనే కోరిక ఉంది
ఎప్పుడు మరణించానో
తెలియనే తెలియదు... 

Tuesday 19 May 2020

ఏమైంది ఈ వేళ.


ఏమైంది ఈ వేళ.
గుండె పెట్టెలో దాచుకున్న భావాలన్నీ
ఎవరో ఎత్తుకెళ్లినట్టు
కనిపిస్తోంది...
మనసులో మాటలన్నీ
స్వరపేటికలో మూటలైనట్టు అనిపిస్తోంది...
నా నేస్తం మౌనం
వేయి ఏనుగుల ఘీంకారమై
గుండెను బద్దలు కొడుతున్నట్టు అనిపిస్తోంది...
వెన్నెల కాసే నా కన్నులు
చీకటి రంగులను
పులుముకున్నట్టు కనిపిస్తోంది...
గాంభీర్యం వదనం నాది
బేలగా మారి
దిక్కులు చూస్తున్నట్టు ఉంది...
ఏమయ్యిందో ఈ వేళ
నా మనసుకు
ఊహకందని భావాలకు
సతమతమైపోతున్నది...

Saturday 16 May 2020

నాతోనే నేను..


నాతోనే నేను..

నన్ను నేను అభిమానిస్తూ

నాతో నేను విభేదిస్తూ
నాతో నేను తగువు పడుతూ
నన్ను నేను సమర్ధిస్తూ
నా అడుగుజాడలు తుడిచేస్తూ
ఆ జాడలనే మరలా సవరిస్తూ
నానుంచి నేను విడివడుతూ
నాలో నేను కలిసిపోతూ
నన్ను నేనే అనుసరిస్తూ
నా మార్గంలో నేను నడుస్తూనే ఉన్నా
అంతకంటే
గొప్ప మార్గం ఏదీ లేదు గనుక..


Friday 8 May 2020

మరణిస్తున్నది నా దేశమే..


మరణిస్తున్నది నా దేశమే..

ఒక ముద్ద అన్నం లేక

పేగులు చుట్టుకుపోయి
గాలిలో కలిసిపోయిన
ప్రాణాలు ఎన్నో...
బయిటికి పొతే కొట్టి సంపుతారని
నాలుగు గోడల నడుమ కొన ఊపిరితో చావలేక
బతకలేక డీలా పడుతున్న
బతుకులు ఎన్నో...
మండుటెండలో కాలినడకలో
కోరలు చాస్తున్న సూరీడునుంచి తప్పించుకోలేక
గుక్కెడు నీళ్లు కరువై
కళ్ళు తిరిగి సొమ్మసిల్లి
అసువులు బాస్తున్న నిర్భాగ్యులు ఎందరో...
నిండీ నిండని డొక్కలతో
రైలు పట్టాలే దిక్సూచిగా
నడిచీ నడిచీ అలసి సొలసి
ఇనుప చక్రాల కింద నలిగిపోయిన బతుకులెన్నో..
పాలకుల ప్యాకేజీలు
ఉన్నోడికి జిలేబీలై
లేనోడికి అందని ద్రాక్షలై
గాలిలో కలిసిపోతున్న
బడుగు జీవుల ఆశలెన్నో...
ఎవడురా చెప్పింది పేదలు చస్తున్నారని
చస్తున్నది నా భారత ప్రగతి చిహ్నాలే....
అవును ఇప్పుడు చస్తున్నది
పేదలు ఎంత మాత్రం కాదు
ఆకలికి అలమటిస్తూ
మరణిస్తున్నది
నా భారత దేశమే...


Saturday 2 May 2020

ఓడిన కల


ఓడిన కల
మౌనమై రగిలే ఘోషకు అంతం ఎక్కడ

ఎగసిపడే మనసు కెరటాలకు సాంత్వన ఎప్పుడు
చీకటికి పట్టిన చెమటల తడియారేది ఎన్నడు
మూసుకపోయిన కనురెప్పలకు గవాక్షాలు ఎవ్వరు
బంధీగా మారిన మనసు
సంకెళ్లు తెంచేది ఎప్పుడు
స్వేచ్ఛకోసం కదిలే పాదాలకు బాటలు చూపే ధైర్యం ఎక్కడ
ఆంక్షల తలుపులు బద్దలయ్యేది ఎప్పుడు
ఏమో ఒకనాడు అడుగుపెడతానేమో
జనారణ్య ఆవాసాలవైపు
ఆకాశహర్మ్యాలన్నీ శిథిల సమాధులై స్వాగతం
పలుకుతాయేమో
శిథిల శకలాల మడుగున
ఓడిపోయిన నా కలలను
వెతుకుతుంటానేమో
అవి ఎన్నడూ దొరకవని తెలిసినా...

Friday 1 May 2020

సినీతారను కాదుగా...


సినీతారను కాదుగా...

దూరంగా కూర్చుని
నాపై అంచనాలు ఎందుకు
వెండితెరపై వెలిగే తారను
కాదు కదా చూపులతోనే
మెప్పించేందుకు...
నా పలుకులతోనే
నేనేంటో చెప్పేయడమెందుకు
శ్రావ్యమైన గళమున్న
గాయకుడిని కాదుగా
గానామృతంతో అలరించేందుకు...
నా స్థితిగతులతో వక్తిత్వ నిర్ధారణ ఎందుకు
సర్వసకల సదుపాయాలు
లేవుగా ఉత్తముడిగా నిలిచేందుకు...
అంత దూరం ఎందుకు
ఒక్కసారన్నా నా గుండె గుడి తలుపులను తెరిచి చూడు
హంసతూలికా తల్పంపై
వయ్యారంగా శయనిస్తున్న
నువ్వే నీకు పరిచయమవుతావు...

నాకెంతో ఇష్టం


నాకెంతో ఇష్టం
ఇసుక తిన్నెలపై నడుస్తూ

అడుగుజాడలు విడువటం
నాకెంతో ఇష్టం...
ఎగసిపడే అలల విన్యాసాలకు
పోటీ పడటం
నాకెంతో ఇష్టం...
సముద్రుడి హోరులో
చెవులకు తాకే సంకేతాలను
ఆస్వాదించటం
నాకెంతో ఇష్టం...
దేహాన్ని పెనవేస్తూ
వినిపించీ వినిపించనట్టు
గుసగుసలాడే పిల్లగాలుల
కబుర్లంటే నాకెంతో ఇష్టం... మనసును దోచే ప్రకృతి కన్య ఒడిలో సేదతీరడం
నాకు చచ్చేంత ఇష్టం...