Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, 28 August 2018

కరాళనృత్యమా

కరాళనృత్యమా

మెదడు సంకేతమా
మనసు సందేశమా
అల్లకల్లోల సంద్రమా
నిశివేళ కనురెప్పల విన్యాసమా
మనసును ఛిద్రం చేసే కరవాలమా
స్వప్నమా అది కరాళనృత్యమా

Monday, 27 August 2018

హృదయవిలాసం

హృదయవిలాసం 


ఒక భావం చిగురు వేసింది
ఆరని మంటలా
కన్నీరు ఉబికింది
మనసుకు అభిషేకంలా
ఒక అక్షరం ఊపిరి పోసుకుంది
ఎగిసిపడే కెరటంలా
అది కవితా
కన్నీటి వేదనా
కాదేమో అది అక్షరం
అవునేమో అది హృదయవిలాసం

మనమెలా మంచోళ్ళం?

మనమెలా మంచోళ్ళం?

అలవోకగా అబద్ధాలు
ఏమీలేకున్నా ఉన్నట్టే డాంభికాలు
కుట్రలు కుతంత్రాలు
అదిగో స్వర్గమంటూ అరచేతిలో వైకుంఠాలు
తిమ్మిని బమ్మి చేసే మాయాజాలాలు
తెల్లారి లేస్తేనే దగాకోరు మాటలు
మహాపతివ్రతల ముసుగులో
తెరచాటు సరసాలు
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలు
ఇన్నిలోపాలు మనలోనే ఉండగా రాజకీయులను
ఆడిపోసుకోవడమెందుకూ
ఐదేళ్ళకోసారి అబద్ధాలు చెప్పేవారికన్నా
అబద్ధాలతోనే జీవితం మొదలుపెట్టే మనమెలా మంచోళ్ళం???

మదిలో అలజడి

మదిలో అలజడి


అక్కడెక్కడో పడమటి కనుమల్లో 

పొద్దువాలుతున్నది
మెల్లమెల్లగా....
బద్దకంగా ఒళ్ళు విరుచుకున్న
నిశికన్య కనులు తెరుస్తోంది
మత్తు మత్తుగా...
అవి సూరీడు విసిరేసిన
ఎరుపు ఛాయల మాయలా
వెచ్చని కోర్కెలతో ఎరుపెక్కిన
చెలియ సిగ్గు దొంతరలా
మధుకలశాలైన జవరాలి 
కన్నుల మొలిచిన ఎర్రని జీరలా
ఏమో తెలియదు గానీ 
సాయం సంధ్య పరువాలన్నీ
నా మనస్విని సోయగాలై 
సెగలు రేపుతున్నాయి
మదిలో రేగుతున్న అలజడిలా...

Sunday, 19 August 2018

జీవనతరంగాలు

జీవనతరంగాలు
కాగితం పువ్వుల తోటలు
మాయామర్మాల లోగిళ్ళు
పెదవి విరుపు పలకరింతలు
అనుబంధాల లోగుట్టులు
బంధనాల బంధీఖానాలు
దగాకోరు కార్ఖానాలు
మనసుల విక్రయశాలలు
మేడిపండు నమ్మకాలు
కలిమిలేముల చదరంగాలు
అర్థంకాని విషవలయాలు
ఈ జీవనతరంగాలు


Wednesday, 15 August 2018

దేశమా ఎక్కడుంది నీకు స్వాతంత్ర్యం?

దేశమా ఎక్కడుంది నీకు స్వాతంత్ర్యం?

ఎర్రబడిన ఆకాశంలో వేగుచుక్కలు నవ్వాలి
అడవి బిడ్డల గుండెల్లో
బందూకు దాడులు ఆగాలి
ఆదివాసీ పెదిమపై
ఎర్రమల్లెలు పూయాలి
పచ్చని పైరులు విరబూసి
రైతన్న నవ్వాలి
కుసుమపువ్వులు నా ఆడబిడ్డలు
నిర్భయులైబతకాలి
నా వేశం నా భాష
నా సొంతం కావాలి
నచ్చిన తిండి తినే అధికారం కావాలి
సగటు మనిషి బతికేందుకు
స్వాతంత్ర్యం రావాలి
దేశమా నీ స్వేచ్ఛకై సమరం ఇంకా ముగియనే లేదు
అప్పుడే ఈ దినోత్సవాల
డాంభికాలు ఎందుకు

Friday, 10 August 2018

సజీవమృతదేహం

సజీవమృతదేహం


ఇక్కడ మనుషులు కానరారు
అంతా బతికున్న శవాల సమూహమే
ఆధునిక నగరిలా కనిపించేది
మృతదేహాలను కలిగిన స్మశానమే
మానవుడు లేడిక్కడ
అంతటా మనిషినిపోలిన
మరయంత్రాలే
మనసులు లేవిక్కడ
విపణివీధిలో విలువైన
బొమ్మలే
తీయని పలుకులు చెవులకు తాకినా
మనసుకు తగిలేవి చేదుగుళికలే
బంధాల పుష్పాలు విరబూసినా
వెనుకచాటు అంతా వ్యాపారమే
కుళ్ళి కృషించిన ఈ లోకం వీడి
నా మనసెప్పుడో పారిపోయింది
ఇక్కడున్నది జీవమున్న
నా మృతదేహమే

Friday, 3 August 2018

నీలోనే....

నీలోనే...

నమాజుల రివాజులను
చవిచూసాను
రామయ్య చరితంలో తరించాను
జీసస్ వచనాలనూ ఆలకించాను
ఎక్కడా దొరకని అలౌకికత్వాన్ని నీలోనే చూసాను
అందుకే
నీలోనే కలిసిపోతున్నా
నిన్ను నాలోనే కలుపుకుంటున్నా