Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 31 July 2016

మనసులోనే పదిలమేమో

మనసులోనే పదిలమేమో

కవితలు వాణిజ్యప్రకటనలుగా
భావాలు పదాల జిమ్మిక్కులుగా
అక్షరాలు ప్రదర్శన శాలలుగా
అక్షర విన్యాసాలు చేస్తూ
పదాలతో సర్కస్ ఫీట్లను మరిపిస్తూ
ఎందుకు ఇంత ఆరాటం
అర్థమే లేని అక్షరపోరాటం
నిజమేనేమో
భావమాలికలన్నీ గాలి కబుర్లేనేమో
మనసు భావాలను మనసులో దాచుకోక
ఒద్దికైన అక్షరాలను కూర్చడం
ఎవ్వరికోసమో
మనసైన మనసును తాకని భావాలు
అక్షర పుష్పాలై పది మందిని అలరిస్తే  
రాసుకున్న భావాలన్నీ
వాసనే లేని ప్లాస్టిక్ పువ్వులేనేమో  
ఫిరదౌసులూ
కాళిదాసులూ
కృష్ణ శాస్త్రి కవితలూ
బహాదూర్ షా రాతలూ
పదిమందిని కదిలించినా  
అవి వికసించని పుష్పాలేనేమో
మనసులో భావానికి అక్షర రూపం ఎందుకో
నిజమేనేమో
భావాలు మనసులోనే పదిలమేమో
మనస్వినీ

భావ సంగమం

భావ సంగమం

తరగని దాహానికి
చిరు చినుకువై నిలిచావు
పెరిగిన తమకానికి
సాంత్వనవై పలకరించావు
ఒరుగుతున్న సూరీడుని
చల్లని వెన్నెలవై పలకరించావు
కనురెప్పలలో దాగిన స్వప్నాలను
అందమైన పువ్వులుగా మలిచావు
మోసం చేస్తున్న ఎండ మావులపై
పన్నీటి వాన కురిపించావు
నువ్వెప్పుడూ అంటూ ఉంటావు
నిన్ను చూస్తే నా భావాలన్నీ మారిపోతాయని
నిజమే నిను చూడగానే
పురివిప్పే నా భావాలు చదివితే
మనసు మతలబులు తెలుస్తాయి
మనసు బాసలూ తెలుస్తాయి
ఆవేదనలు చుట్టు ముట్టినా
ఆవేశాలు అలుముకున్నా
ఎద సీమలో కంపనాలు రేగినా
నా భావాలు నిత్యం పదిలమే
మనుసును తాకిన అనుభవాలతో
నా భావాలు నిత్యం సంగమిస్తూనే ఉంటాయి
మనస్వినీ  

Saturday, 30 July 2016

చీకటి పుష్పం

చీకటి పుష్పం
చల్లని గాలి సైతం
ముల్లులా గుచ్చుకునే వేళ
చిరుజల్లుల సవ్వడి సైతం
జడివానై బెదిరించే వేళ
చందమామ వెన్నెల సైతం
సూర్య రశ్మిని తలపించే వేళ
అల్లకల్లోల మానసం
సునామీలు పొంగించే వేళ
గజిబిజి భావాలను నిద్దురపుచ్చి
మౌనమనే చీకటిలోయలోకి
జారిపోతాను నేను...
నల్లని చీకటి పరదాల నీడన
సేదతీరటం నాకు మామూలే...  
కళ్ళు చెదిరే వెలుగు రేఖలు అక్కడ లేవు
గుండెను పిండి చేసే పిడుగులూ కానరావు
చల్లని వెన్నెల లేదు
మంటలు రేపే సూరీడూ లేడు
విశాలమైన నల్లని లోయ అది
అంతే లేని అగాధమది...
ఆది ఎక్కడో అంతం ఏమిటో తెలియని
చీకటి లోకంలో
నన్ను నేను మచ్చిక చేసుకోవడం
నా కెంతో ఇష్టం...
మౌనమనే లోయలో
చివుర్లు తొడిగిన చీకటి పుష్పమే నేను
మనస్వినీ...

Thursday, 28 July 2016

ఏ రాగమో అది ఏ భావమో...

ఏ రాగమో అది ఏ భావమో...
కొన్ని నిమిషాలు
జస్ట్..కొద్ది సేపు మాత్రమే
చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని
సెల్ ఫోన్ లో మ్యూజిక్ బాక్స్ ఆన్ చేసుకున్నా...
నేను ఎప్పుడూ వినే పాటలే అవి
సరదాగా వింటూ
ఏదో తెలియని భావలోకంలో విహరించటం
నాకు అలవాటే...
చాలా కాలం తర్వాత
ఆ గీతాలు చెవులను తాకాయి మంద్రంగా ...
కోల్పోయిన లోకమేదో కనులముందు
తారాడింది
ఆ భావాలన్నీ కలగలిసి
అమృతవర్షమై మనసుపై వర్షిస్తున్నట్టు అనిపించింది
నా నుంచి దూరమైన జీవితమేదో
నా చెంత నిలిచినట్టు అనిపించింది...
అందరికీ తెలిసిన భావాలే
చాలా మంది పాడుకునే పాటలే
సంగీత ప్రియులకు అవి ప్రియ సరాగాలే...
అవి నువ్వూ నేనూ పాడుకున్నాం
ఆ పాటల పదనిసలతో అల్లరి ఆటలు ఆడుకున్నాం
యుగళ గీతాలుగా అల్లుకున్నాం
శృతి లయలను పూల బంతులుగా విసురుకున్నాం...
శివరంజని రాగమా
హంసధ్వని గానమా
మనకు తెలియదు
పాటల పల్లకిలో ఊరేగిందీ మనమే
భావాల పల్లకీలకు బోయీలమూ మనమే...
తిరిగిరాని ఆ జ్ఞాపకాల పుష్పాలు
గుండెకు పువ్వుల్లా గుచ్చుకుంటే
మనసు తీయని బాధతో మూలిగింది
కనుల కొలనులను దాటేందుకు సిద్ధమైన
కన్నీటి చుక్కను బలంగా అదుముకున్నా
కనురెప్పల మాటున...
ఆ జ్ఞాపకాల సౌరభాలే
నా జీవన ఘడియలు
మనస్వినీ...

Wednesday, 27 July 2016

నా నుంచి నేను పారిపోతున్నా

నా నుంచి నేను పారిపోతున్నా

నాకు నాకూ మధ్య దూరం పెంచుకుంటున్నా
అప్రయత్నంగానే అగాధం పెరిగింది మరి...
నానుంచి నేను పారిపోతున్నా
ఇప్పుడు నేనంటేనే నాకు భయం మరి...
నన్ను నేనే తరుముతున్నా
ఆగిపోతే నడక ఉండదేమో మరి...
నన్ను నేను కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నా
నన్ను నేనే చంపేస్తానేమో మరి...
అద్దంలో నన్ను చూసి నేనే కలవరపడుతున్నా
లోపాలన్నీ నాలోనే కనిపిస్తున్నాయి మరి...
నా బొమ్మను నేనే ప్రశ్నిస్తున్నా
సమాధానాలన్నీ నా మనసులోనే ఉన్నాయి మరి...
నా బొమ్మ నన్నే తిడుతోంది
తప్పులన్నీ నావేగా మరి...
అందుకే నన్ను నేను తరిమేస్తూ
నానుంచి నేను పారిపోతున్నా
ఎప్పుడో ఒక చోట
 నాకు నేనే దొరికిపోతానేమో
మనస్వినీ....

Tuesday, 26 July 2016

అడ్రస్ గల్లంతయ్యింది...


అడ్రస్ గల్లంతయ్యింది...


శోధన దిశగా అడుగులు వేసాను
పరిశోధన లక్ష్యంగా నడక సాగించాను
తనెక్కడో వెతకాలని
తన చిరునామా తెలుసుకోవాలనీ...
నేను నడిచే బాటలో
ఒకరిని చూసాను
నుదుటన తిలకం
తేజస్సు నిండిన ముఖారవిందం
ఎవరు నీవని అడిగాను
మూర్ఖుడా ఇదికూడా తెలియదా
నేను హిందూవుని అని గర్జించాడు
నిజమేననుకుని చల్లగా జారుకున్నాను
అక్కడి నుంచి...
ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న
ఓ పెద్దాయనను పలకరించా
ఎవరు స్వామీ నీవు అని...
కళ్ళు కనిపించటం లేదా నీకు
నేను ముసల్మాన్ అని రుసరుసలాడాడు
బాబోయ్ అంటూ పరుగులు తీసా...
ఎదురుగా ఓ దివ్యమూర్తి
తెల్లని వస్త్రాలతో ధగదగా మెరిసిపోతున్నాడు
చేతులు జోడించి అడిగా
మీరెవరు ప్రభూ అని...
బిడ్డా నన్ను గుర్తు పట్టలేదా
నేను దేవుని బిడ్డను
రా కుమారా అంటూ
చాచిన చేతుల్లోనుంచి తప్పించుకున్నా...
పరుగులాంటి నడకే
పయనమయ్యింది
అలసిన అడుగులకు సాంత్వన కోసం
కొంచెం ఆగాను...
అక్కడేదో విద్యాలయమని అనుకుంటా
నూనుగు మీసాల కుర్రాళ్ళకు పాఠాలు
చెబుతున్నాడు  ఓ పెద్దాయన
సర్వమానవాళిలో తమదే గొప్ప జాతియని
తమపురాణాలే శాసనాలనీ...
కొద్ది దూరం నడిస్తే
అతిపెద్ద మదర్సా
విశ్వంలో విశ్వాసులకు ప్రతినిధులం మనమే
గొప్పమీద గొప్ప చెప్పుకుంటున్నారు...
ఓ ప్రాంగణంలో శిలువ
వారికి మాత్రమే విలువ
ప్రపంచాన్ని శాసించే దేవుని బిడ్డలం
బోధనలు చెవికి నచ్చలేదేమో
ముందుకే నడిచాను..
నా శోధన మాత్రం ఆగలేదు
నడుస్తూనే ఉన్నా
తన కోసమే వెతుకుతున్నా...
ఎక్కడ చూసినా
హిందూవులు ముస్లింలు
క్రైస్తవులు లేదా సిక్కులు
మనిషి మాత్రం దొరకలేదు
మనస్వినీ...

Monday, 25 July 2016

ఫిరంగీ గడియారం

ఫిరంగీ గడియారం
 పరుగులు తీసే కాలం
మానని గాయాలకు లేపనం
ఎవరో చెప్పగా విన్నాను
ఏదీ ఆ కాలం రానే రాదేమీ...
పలకరించే నవ్య క్షణం
గడిచిన క్షణం వేదనను తీర్చునని అంటారు
ఏదీ ఆ క్షణం పలకరించదేమీ...
మానని గాయం మంటలు ఆరకముందే
కొత్త కాలమేదో ముల్లులా దిగబడితే
గడిచిన క్షణం ఆనవాళ్ళు మరవకముందే
మరో క్షణం శరములా గాయం చేస్తే
ఏ సమయం ఉపశమనం...
గడిచిన ఘడియల ఘాతములు
తడి ఆరకముందే
కరిగిన క్షణాల జ్ఞాపకాలు
మదిలో చెరగక ముందే
కొత్త ఘడియలు వేదనల పల్లకీలు మోస్తే
గడియారం చేసే శబ్దం
గుండెల్లో ఫిరంగీలు మోగించదా
మనస్వినీ...

Sunday, 24 July 2016

అభిమానమై మెరిసిపోవాలనీ...

అభిమానమై మెరిసిపోవాలనీ...

సమిధగా మారాను
మమతల ప్రమిదలు వెలిగించాలని...
చేతులు చాచాను
ప్రేమపుష్పాలు దోసిట పట్టాలని...
కన్నీరునై ఒలికిపోయాను
అమృతమై కురిసిపోవాలని...
జీవంలేని నవ్వునయ్యాను
అందరి పెదాలపై నవ్వులు పూయించాలని...
ఆకాశంలో మెరిసే తారకలు
నా చుట్టూ నవ్వులపువ్వులు
అన్నీ నావే అనుకున్నాను
అందరివాడిలా మిగిలిపోవాలని...
నాకంటూ ఏదీ దాచక
పరులదేదీ దోచక
అనుబంధాలనే నమ్మాను
అభిమానమై మెరిసిపోవాలని...
నింగిలో తారకలు నవ్వుతున్నాయి
నవ్విన పెదాలు మూతి విరుస్తున్నాయి
ఒక మిథ్యలా మిగిలిపోయానని...
నేను నాటిన గులాబీ మొక్కలే
ఇప్పుడు ముళ్ళను విసురుతున్నాయి
మనస్వినీ...

Saturday, 23 July 2016

నిశాచరుల లోకం

నిశాచరుల లోకం

నిశ్చల నిర్జీవ తటాకమై
సుడిగాలికీ చెదరని నల్లని వస్త్రమై
వెరవక బెదరక నిలిచిన
నిశి తెరలను చీల్చుకుంటూ
ముందుకు నడుస్తున్నా
జీవమెక్కడో తెలుసుకుందామని
జీవితమంటే ఏమిటో నేర్చుకుందామని...
వడివడిగా నడిచిన పాదాలు ఎందుకో ఆగిపోయాయి
అంత చీకటిలోనూ ఏదో గుడ్డివెలుతురు
పూరిగుడిసెలో ఓ తల్లి
తనబిడ్డకు ముద్దలు పెడుతోంది
బక్కచిక్కిన ప్రాణానికి ఊపిరి నింపుతోంది
మాసినబట్టలు వాడిన పెదాలు
అది చితికిన బతుకేనని తెలుస్తూనే ఉంది...
ఇది కాదేమో జీవితమని అడుగులు కదిపాను
కటికచీకటిలో బాటలు తెలియకున్నా
రాళ్ళూ రప్పలు మానని గాయాలవుతున్నా
ఆగిపోలేదు నా నడక...
పూరి గుడిసెల మరో వాడ పలకరించింది
అక్కడేదో ఉత్సవంలా ఉంది
అందరూ ఒకే చోట చేరి పండగ చేసుకుంటున్నారు
ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు
తాగుతున్నారు తూలుతున్నారు
సరసాలూ విరసాలూ
బావామరదళ్ళ సరాగాలు
పూరి గుడిసెల విరిగిన తలుపులను తొంగి చూస్తే
ఎండిన గిన్నెలు ఈగల మోతలు
దమ్ము ఆపుకోలేక దగ్గుతున్న ముసలమ్మ
ఇదికూడా జీవితం కాదేమోనని
అక్కడినుంచి కదిలాను...
క్రమంగా చీకట్లు తొలిగిన భావన
ఇంకా తొలిపొద్దే పొడవలేదు
వెలుగులేమిటా అని చూసా
దూరంగా ఏదో నగరం మెరుస్తూ కనిపించింది
నవ్వులు కేరింతలు
ఆనందోత్సాహాలు
ఇంద్రధనుస్సు తోరణాలు
మనసు పురివిప్పింది
భారమైనపాదాలలో తెలియని సత్తువ చేరింది
అడుగుల వేగం పెరిగింది...
రంగురంగుల ప్రపంచం
ఎవరిని చూసినా పొంగిపొరలే ఆనందం
సందడే సందడి
జీవనమజిలీని చేరుకున్న అనుభూతి నాలో...
విలాసమైన భవనాలు
కళ్ళు జిగేల్ మనిపించే సదుపాయాలు
సుగంధ పరిమళ ద్రవ్యాలు
కన్నీరు ఒలకని నయనాలు
వేదనే కానరాని వదనాలు...
నగరంతా కలియతిరిగాను
అన్ని వీధులనూ పలకరించాను
ఈ నగరంలో కన్నీళ్ళే లేవా
ఎవరికీ బాధలు లేవా
ఇంత ఆనందం ఎలా
ఇదేనా అసలైన జీవితం...
గజిబిజి నడకలతో ఎదురుగా వస్తున్న
ఓ పెద్దమనిషిని అడిగేసాను
భళ్ళున నవ్వేసాడు ఆ మనిషి
అసలు మాకు బాధలెందుకు
కన్నీరెందుకు
మేము మనుషులమైతేగా అంటూ
తూలుతూ ముందుకు వెళ్ళిపోయాడు
అప్పుడు తెలిసింది నాకు
ఇది ప్రాణమున్న శవాలు తిరిగే లోకమని
మనసూ మమతలకు తిలోదకాలిచ్చి
ఒకరిని మరొకరు చంపుకున్న నిశాచరుల స్థానమని...
భారమైన అడుగులను
బలవంతంగా కదిలిస్తూ
వెనక్కి నడిచాను
ఇక జీవితం దొరకదని  
మనస్వినీ...

Friday, 22 July 2016

మనసుముద్రికలు

మనసుముద్రికలు


ఎవరికీ అంతుచిక్కని నా అంతరంగాన్ని  
తడిమిచూసుకోవానిపించింది...
ఆరోపణల జడిలో తడుస్తున్న నా మనసును
సమీక్షించాలనిపించింది...
అంతర్మథనంనుంచి పుట్టిన ఆలోచన
మనసు పుస్తకాన్ని తట్టిలేపింది...
ముభావంగానే మనసు రచనల పేజీలను
తిరగవేసాను...
నేను రాసుకున్న అక్షరాలను
నిజాయితీగా తాకి చూసాను
మనసుపై కమ్ముకున్న ముభావం
పరదా జారిపోయింది...
గూడుకట్టుకున్న నిర్లిప్తత
మంచులా కరిగిపోయింది...
ఒక్కో భావాన్నీ తడిమాను
ఒక్కో అక్షరాన్నీ నిద్రలేపాను
ఒక అక్షరం కన్నీటి పుష్పమై
కనురెప్పలను చుంబిస్తే
ఒక భావం చీకటిలో చిరు దీపమై
కన్నులలో మెరుపులు నింపింది...
మారుతున్న పేజీలతోపాటు
కొత్త రెక్కలు విప్పుకుంటున్న భావాలు...
ఒక భావం పువ్వులా పలకరిస్తే
మరో భావం నేస్తమై తోడు వస్తానని అంది...
ఒక భావం మకరందమై పెదాలను తాకితే
మరో భావం కత్తిలా గుండెకు గుచ్చుకుంది...
ప్రతి అక్షరంలో శోధించాను
ప్రతిభావంలో కాగడాలు పెట్టి వెతికాను
మతలబేదైనా దాగి ఉందేమోనని
కపటమేదైనా మిగిలిఉందేమోనని
భేషజాలేమైనా పొంచిఉన్నాయేమోనని...
ఒక అక్షరం అలిగింది
మరో అక్షరం గుండెలు పగిలేలా ఏడ్చింది
నీ మనసు ముద్రికలమైన మమ్ములనే
అనుమానిస్తావా అని...
జారిపడుతున్న కన్నీళ్ళలో
అక్షరాలు కరిగిపోకముందే
మనసు పుస్తకం మూసివేసా
మనస్వినీ...