Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 15 July 2016

దయ్యాల అసెంబ్లీ

దయ్యాల అసెంబ్లీ

అది భూలోకమేనేమో...కానీ ఎవరికీ తెలియని ప్రాంతం. అది ఒక పురాతన భవంతి. గోడలు బీటలు వారి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. సాలెపురుగులు తమ పరదాలతో భవంతి మొత్తాన్ని కబ్జా చేసినట్టున్నాయి. భవంతి చుట్టూ దట్టమైన అడవి. ముళ్ళపొదలను, అడవి జంతువులను తప్పించుకుంటూ ఆ భవనంవైపు అడుగులు వేసాను. అక్కడున్నవారెవరూ నన్ను చూసే మూడ్ లో లేరు. కనీసం ద్వారపాలకులూ నన్ను అడ్డగించలేదు. అందరి చూపులూ అటువైపే. మెల్లగా లోపలికి ప్రవేశించాను. ఒక్కసారిగా చెవులు బద్దలయ్యేలా రణగొణధ్వనులు. ఒకవైపు ఏవేవో ఆర్తనాదాలు... ఏవో కేకలు, గుడ్లగూబల రెక్కల సవ్వడులు, నక్కల ఊళలు, వికట్టాహాసాలు, గుండెలు పగిలే రోదనలు... అంతా గందరగోళం. అంతలోనే పిన్ డ్రాప్ సైలెన్స్.. అందరూ లేచి నిలబడ్డారు. ప్రధాన ద్వారం వద్ద అలికిడి. అవును ఆయన వస్తున్నారు. భూత, ప్రేత, పిశాచ గణాధీశ సైతాన్ రాజు వచ్చేస్తున్నారు సపరివార, మంత్రి గణ సమేతంగా. గాలిలో తేలుతున్న ఒక రాతి సింహాసనంపై రాజావారు ఆసీనులయ్యారు సభ మొదలుపెట్టమని ఆదేశిస్తూ...

అప్పుడు అర్థమయ్యింది నాకు ఇక్కడ దయ్యాల అసెంబ్లీ అత్యవసర సమావేశం జరుగుతోందని.. అప్పుడే గాలిలో ఏదో మార్పు. చెవులు పగిలే హోరు.. గాలిదయ్యం లేచింది సభికుల తలలపై విలయ తాండవం చేస్తూ.. గుండెలుపగిలేలా రోదిస్తూ.. రాజావారు అడిగారు ఉరుములాంటి గొంతుకతో ఏమయ్యింది నీకు అని.. అయ్యా రాజావారూ ఏమని చెప్పను నా బాధ అంటూ గాలిదయ్యం తన గోడు చెప్పుకుంది.. ఒంటి కన్నుతో సమస్త వాయుమండలాన్ని శాసించే నాకు ఇప్పుడు మనుగడే లేకపోయింది. ఏదో గాలిసోకిందని ఏడుస్తూ మనుషులుపడే ఇబ్బందిని చూసి కడుపునింపుకునే నేను ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నా.. ఈ మాయదారి మనిషి నాకంటే తెలివి మీరాడు. మనిషి చేసే గారడీలు మాయలు చూసి నాగుండె కూడా జలదరిస్తోంది. మనిషి మోసానికి అలవాటుపడిన సాటి మనిషి నన్ను చూసి నవ్వుతున్నాడు నువ్వొక లెక్కా అంటూ.. గాలి దయ్యం వేదన చూసి ఇతర దయ్యాలూ కంట తడి పెట్టాయి..

అయ్యా మహారాజా అంటూ రక్తపిశాచి లేచినిలబడింది తడారిన నాలుకను లోపలి నెట్టుకుంటూ.. అవును ప్రభో నాకు మనుషుల రక్తం దొరకటం లేదు. ఈ మనిషే తోటి మనిషి రక్తం తాగేస్తున్నాడు. కనీసం నాలో ఉన్న దయకూడా వాడికి లేదు. తనవారు పరాయివారు అన్న బేధమే లేకుండా రక్తం తాగుతున్న మనిషిని చూస్తే నాకే చెమటలు పడుతున్నాయి అంటూ రక్తం కక్కుకుంది ఆ దెయ్యం.. అన్ని దయ్యాల గోల ఒకటే మనిషి... తనను మించిన మాయలు మనిషికి ఉన్నాయని మాయావి మొరపెడితే... తననే తలదన్నే మాయాలేడీలు పుట్టుకొచ్చారంటూ మోహిని దయ్యం ముక్కు చీదుకుంది. అంతలోనే కొరివి దయ్యం కెవ్వుమని అరిచింది నా గోల వినరా అంటూ... ఏమిటీ నీకొచ్చిన కష్టం అంటూ హూంకరించాడు సైతాన్ కింగ్. నా కష్టం ఏమని చెప్పాలి సామీ ఒకటా రెండా కడుపు చించుకుంటే మంటే బయటికి వస్తోంది. మనషుల కొంపల్లో నిప్పు పెట్టే డ్యూటీ నాది కదా,అక్కడేమో మనుషులే ఒకరి కొంప మరొకరు కాల్చుకుంటున్నారు. ఎవరి కొంపకు ఎవరు నిప్పు పెడుతున్నారో తెలియక చస్తున్నా.. నా అక్కలూ చెల్లెళ్ళూ పనిలేక కాలుతున్న చితిమంటలలో తలదాచుకుంటున్నాం...ఈ కష్టకాలంలో తమరే ఏదో ఒక ఉపాయం చెప్పాలి ప్రభూ అంటూ దయ్యాలన్నీ కోరస్ పాడాయి..

కొద్ది సేపు మౌనంగా ఉన్న పిశాచరాజు గొంతు ఖంగుమన్నది.. నా ప్రియమైన భూత ప్రేత పిశాచాల్లారా... మీ కష్టం నాకు తెలుసు. మనిషి బాగా మారిపోయాడు. నేనూ గమనిస్తూనే ఉన్నా... అప్పుడప్పుడూ మనుషులు తిరిగే ప్రాంతంలో ఎవరి కంటా పడకుండా తిరిగివస్తున్నా.. మారిన మానవజాతిని చూస్తే నాకూ గుండెలు జారిపోయాయి. మనజాతికే తెలియని విద్యలు ఇప్పుడు మనిషి నేర్చుకున్నాడు. మతం పేరుతో మారణహోమం చేస్తున్నాడు. కులం పేరుతో రాజకీయం చేస్తున్నాడు.. డబ్బు అనే ఆయుధంతో సాటి మనిషిని తొక్కేస్తున్నాడు. బంధాలను,అనుబంధాలను డబ్బు కోసం తాకట్టుపెడుతున్నాడు. వాడికి తెలిసిన మాయలు మంత్రాలు మన జాతిలో ఎవరికీ తెలియవు. మౌనమైపోయింది రాజుగారి స్వరం... ఆయన కన్నుల్లో కారుతున్న రక్తం చుక్కలను దయ్యాలు గమనించాయి. ఇప్పుడు ఏం చేద్దాం ప్రభూ అని భయం భయంగా అడిగింది ఒక ప్రేతాత్మ.. ఏమీ చేయలేం మనిషి మనలను మించిపోయాడు. అతని కంటికి కనపడనంత దూరంగా మనమంతా పారిపోవాలి. ఈ లోకంలో మనకిక స్థానం లేదు, మరో లోకం చూసుకుందాం అక్కడా మనుషులు లేకపోతే అని ముగించారు రాజుగారు. అంతలోనే ఓ దయ్యం నన్ను చూసింది. బాబోయ్ మనిషీ అని కెవ్వు మనటం మిగతా దయ్యాలు రాజుగారితో సహా అక్కడినుంచి హాహాకారాలు చేస్తూ మాయమవడం ఒకే సారి జరిగిపోయాయి.

No comments:

Post a Comment