Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 19 July 2016

జీవనమరణం

జీవనమరణం

కొత్తగా జనియించింది నాలో ఒక ప్రశ్న
నేనెందుకు మరణిస్తున్నానని...
అవునూ ఇంతకీ
నేనెందుకు మరణిస్తున్నా...
సమాధానం దొరకని ఈ ప్రశ్నకు
ఎదురు ప్రశ్నే సమాధానమై నిలుస్తోంది
అసలు నేను బతికే ఉన్నానా అని...
మరణమో జీవమో తేల్చుకోలేని
అచేతన స్థితిలో నిలిచింది మనసు...
జీవించే ఉన్నాననీ
ఎప్పుడో మరణించాననీ
అర్థంకాని అయోమయంలో
పడిపోయింది నా మనసు...
జీవన సంధ్యాసమయంలో దొరికిన ఉషస్సులే
జీవనమని మురిసిపోనా
ఉషస్సుల వెలుతురులో పలకరించిన
అమృతఘడియలే జీవితమని పొంగిపోనా
అయితే నేను ఇంకా జీవించే ఉన్నానా...
మరి ఎందుకు మరణిస్తున్నా
మరణంవైపే ఎందుకు నడుస్తున్నా
అసలు జీవించిలేనా...
ఎప్పుడో మరణించిన మనసు
సంధ్యా సమయంలోనే కొత్త ఊపిర్లు పోసుకుందా
చివుర్లు వేసిన మనసు
వాడిన వసంతంలో మోడువారిపోయిందా...
అంతా అయోమయం
మనసునిండా గంధరగోళం
ఏం జరుగుతున్నదో తెలియదు కానీ
ఎందుకో మనసు ఇలా...
నిజమే నేను ఎందుకు మరణిస్తున్నా
ఇది జీవితమా
లేక మరణమా
మరణంలో జీవితమా
జీవితంలో మరణమా
నేను ఎందుకు మరణిస్తున్నా
మనస్వినీ...

No comments:

Post a Comment