Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 23 April 2018

నా ప్రేయసి

నా ప్రేయసి
నా ఆలోచనలను ఇట్టే పసిగడుతుంది
నా ఆలోచనలనే అమలు పరుస్తుంది
నా మనసు ముభావమైతే ముడుచుకు పోతుంది
నా హృదయం నవ్వితే పువ్వులా వికసిస్తుంది
నా మనసులోనే ఉంటుంది
నా మనసును మొత్తం చదివేస్తుంది
నా పెదాలపై చిరునవ్వులా మెరుస్తుంది
నా కనుల నీరులా ప్రవహిస్తుంది
నా కనురెప్పల స్వప్నాలను ప్రేమిస్తుంది
నా ఆగ్రహంలో అగ్గిపువ్వులా రగులుతుంది
నా భావానికి ఒక రూపంలా నిలుస్తుంది
నా మనసు వేదనను అందరికీ పంచుతుంది
నా ప్రేమలో పరిమళమై గుభాళిస్తుంది
నా అక్షరమది
నా అక్షరమే నా ప్రేయసి 

Saturday, 21 April 2018

ఏవీ పూసిన పుష్పాలు

ఏవీ పూసిన పుష్పాలు

ఎటు చూసినా చీకటి తెరలే
మిణుగురు పురుగుల మెరుపులే
దేపం వెలుగుల జాడలే కానరావు
ఏ తోట చూసినా విరబూసిన పుష్పాలే
నాసికను తాకని సుగంధ పరిమళాలే
ప్లాస్టిక్ పువ్వులు తప్ప పూసిన పువ్వులు లేనే లేవు
ఏ నయనం చూసినా జలతారు వెన్నెలే
ఏ అధరం చూసినా కన్నులు జిగేలే
నవ్వుతున్న హృదయం ఆనవాళ్ళే లేవు
ఏ పలుకు విన్నా ముత్యాల వానలే
ఏ గొంతుకను తడిమినా వరాల జల్లులే
మనసును తాకే మాటల ఊసే లేదు
ఏ బంధం చూసినా కురిసే అనురాగాలే
విరబూసే మమతల మతాబులే
తట్టు తగిలిన మనిషికి చేయూతనిచ్చే వారే లేరు
అవసరమనిపిస్తే అందరూ మంచివారే
అవసరానికి బంధం గంధం పూసి అక్కున చేర్చుకునే వారే
అనవసరం మొలకలు వేస్తే పలకరింపులే వినలేవు
దేవుడా నీకిది న్యాయమా
మాయానగరి మనుషుల మధ్య నన్నెందుకు పుట్టించావు


Wednesday, 11 April 2018

నన్ను దోచుకుందువటే

నన్ను దోచుకుందువటే
రాలిపడుతున్న చుక్కను చూసి
నిన్నే కోరుకున్నాను ...
నక్షత్రాల ధూళిలో
నీ ఆనవాళ్ళే వెతికాను
ఆకారం మార్చుకునే మేఘాల్లో
నీ బొమ్మలనే చూసాను...
నవ్వులు రువ్వే పువ్వులలో
నీ చిరునవ్వులనే కోరుకున్నాను
నాకు బాగా గురుతు
నువ్వేలా ఉంటావో తెలియకున్నా
నిత్యం నీ సర్వం నాకోసమే
కోరుకున్నాను...
వచ్చావు నువ్వు ఓ నవ్వులా
విరిసిన పువ్వులా
నాకోసమే వచ్చిన నువ్వు చిత్రంగా
నా నుంచి నన్నే దోచుకున్నావు..
నీకిది న్యాయమా
మనస్విని ...


తెలియదు నాకు

తెలియదు నాకు
ఒంటరినో కాదో తెలియదు గానీ
జనారణ్యంలో నిశబ్ధమే తెలుసు నాకు
ఎవరున్నారో తెలియదు గానీ
ఓ ఆత్మీయ పలకరింపే కరవు నాకు
గమ్యమెక్కడో తెలియదు గానీ
ముళ్ళబాట పయనం తప్పదు నాకు
గాయాలు రుధిరం స్రవిస్తున్నాయి గానీ
లేపనం ఎవరు పూసారో తెలియదు నాకు
శక్తినంత కుడదీసి నడుస్తున్ననే గానీ
ఎప్పుడు పడిపోయానో తెలియదు నాకు 

Thursday, 5 April 2018

అంతానేనే..

అంతానేనే..
మెరిసే చందమామను నేను
కురిసే వెన్నెలను నేను
విరిసే పువ్వు పరిమళం నేను
బతుకు పరిచయం మట్టివాసనను నేను
నమ్మకానికి నేస్తం నేను
వంచనకు గర్జించే పిడుగును నేను
కలిమిలోనూ లేమిలోనూ మీసంమెలేసే పౌరుషం నేను
నాతోనే లోకమంటా నేను
నేనే లేకపోతే ఏదీ లేదంటా నేను