Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 27 September 2015

వయసూ మనసుల ఆరాటం

వయసూ మనసుల ఆరాటం

ఏం కోరుకున్నది నా మనసు
మణులు మాణ్యాలు కోరినదా
రత్నాలు రాశులు ఆశించినదా
అపారమైన ధన సంపదను అభిలషించినదా
చిన్న చిరునవ్వు కోరుకున్నది
సంపదను మించిన ఆనందం ఆశించినది
జీవనయానంలో దొరకని అనుభూతిని
జీవన సంధ్యలో వరముగా అడిగినది
ఏ నిమిషంలో ఆగిపోతుందో తెలియని గుండెకు
మమతల ప్రాణవాయువు కానుకగా ఇమ్మన్నది
ఇది వయసూ మనసుల విరోధమా
తరాల మధ్య అంతరమా
ఏ మనసు ఎదిగినదో
ఏ మనసు ఇంకా ఎదగాలో
తెలిసీ తెలియని సమరమా
ఎందుకు ఈ అర్థం కాని అయోమయం
ఎప్పటిదాకా అంతులేని ఈ అగాధం
లక్ష జన్మలు ఎత్తినా నేనొక
అర్థం కాని పజిల్ నే
మనస్వినీ

భయమేస్తోంది మనసా

భయమేస్తోంది మనసా

భయమేస్తోంది మనసా
ఎప్పుడూ లేని విధంగా
కొత్తగా ఏదో తెలియని భయం
మెల్లగా మనసును ఆక్రమిస్తోంది
చల్లని చందమామ మైనపు ముద్దలా
కరిగిపోతున్నట్లు
కొండల మధ్య జారుతున్న సూరీడు
ఇక రానే రానని మారాం చేస్తున్నట్లు
పాదాల కింద పుడమి
కదిలిపోతున్నట్లు
గుండె సీమలో తెలియని
భూకంపమేదో వస్తున్నట్లు
అంతా భయం భయంగానే ఉంది
ఎందుకో మనసు మధనపడుతోంది
తప్పే చేయని మనసు కలవరపడుతున్నది
తెలుస్తోంది మనసుకు అంతం తప్పదని
తాను చేసిన నేరమేదో తెలియక
మనసు వేదన పడుతోంది
నిజంగా ఎవరికీ అర్థం కాని నా మనసుదే పాపమా
అర్థం చేసుకునే స్థాయికి ఎదగని లోకానిది నేరమా
బ్రహ్మ పదార్ధం వంటి మనసును
ఈ దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడు
మనస్వినీ

మనసు పంజరం

మనసు పంజరం

ఆకాశ వీధిలో హాయిగా విహరించే
పక్షులపై కవితలు రాసుకున్నా
విహంగ వీక్షణంలో
నన్ను నేను చూసుకున్నా
సాయం సంధ్యలో ఎంతో దగ్గర నుంచి
రివ్వున ఎగురుతూ సవ్వడి చేసే
చిలకమ్మలను చూసి
అనుభూతులే నెమరు వేసుకున్నా
వాన చినుకుల ఒత్తిడికి
లయబద్దంగా కదులుతున్న
పెరటిలోని గులాబీలను చూసి
ఏమి రాజసమని మురిసిపోయా
చల్లని తిమ్మెరలకు
నాట్యం చేసే నీ కురులను చూసి
భావాలను అల్లుకున్నా
విరిసే నీ పెదాల మెరుపుల్లో
నా ప్రతిబింబమే చూసుకున్నా
ఎగిరే పక్షుల పయనాన్ని ఆపాలని అనుకోలేదు
గులాబీ సోయగాన్ని చిదిమేయాలనుకోలేదు
పెదాల మెరుపులపై నల్లపూత పూయలేదు
నీలాల కురులతో
స్వప్నాల జడలు అల్లాలని ఆరాటపడ్డా
సవ్వడి చేసే చిలకమ్మలో
అనంతమైన స్వేచ్ఛనే చూశా
చిలకమ్మను
పంజరంలో బంధీని చేయాలని అనుకోలేదు
మనసునే పంజరంలా మలిచి
అనుభూతులను బంధీ చేసుకున్నా
లోహపు కడ్డీల పంజరంలో నివసించేది
లోహవిహంగమేనని నాకు తలుసు
మనస్వినీ

Saturday, 26 September 2015

నీ అనుమతి దానికి కావాలి

నీ అనుమతి దానికి కావాలి

నాతో నీవు ఎప్పుడు లేవని
ఎప్పుడూ నాతోనే ఉంటావు
నిత్యం నాలోనే ఉంటావు
నిన్ను నేను చూస్తూనే ఉన్నా
రోజూ చూస్తూనే ఉన్నా
నాకు నీవు కనిపిస్తూనే ఉన్నావు
ప్రతిక్షణం నేను
నీ అనుభూతిని పొందుతూనే ఉన్నా
నీ ఉనికిని గమనిస్తూనే ఉన్నా
నీ స్పర్శను తెలుసుకుంటూనే ఉన్నా
అవును
నేను నిన్ను చూస్తూనే ఉన్నా
కనురెప్పల పరదాలపై
భారంగా కదిలే కన్నీటి చుక్కలో
నవ్వులు రువ్వే పెదాలమాటున
చీకటిని అలుముకున్న వేదనలో
గుండె గుడిలో జుగ్నూ పురుగులా మెరిసే
ఎర్రని వెలుతురులో
మనసు పులకరింతలో
మనసుకు తగిలే ప్రతిగాయంలో
నన్ను ముద్దాడే అనురాగంలో
నర్మగర్భ పలుకుల్లో
ముల్లులా గుచ్చుకునే నిందలలో
ఆకాశానికి ఎత్తేసే ప్రశంసల జల్లులో
పడమటి కొండల్లో
కుంగిపోయే సూరీడులో
మబ్బులచాటు సేదతీరే చందమామలో
ఎగసిపడే కడలి కెరటాలలో
కురిసే ప్రతి చినుకులో
మనసును తాకే మట్టి వాసనలో
ఒకటేమిటి
నా ప్రతి అడుగులో
అడుగులజాడలో
నాకెప్పుడూ నీవు
కనిపిస్తూనే ఉంటావు
మనిషిని వీడి నీడ మాయమైనా
నువ్వు మాత్రం నాతోనే ఉంటావు
నాకు తెలుసు
నీకు నేను కావాలి
తెలుసు నాకు నీకు నేనే కావాలి
నీకు అంత తేలికగా
దొరికిపోతానా మరణమా
మరణానికి ఏం తెలుసు
నేను ఓడిపోవాలంటే
నీ ఆనతి కావాలని
మనస్వినీ

Friday, 25 September 2015

ఇలా అనిపిస్తుంది

ఇలా అనిపిస్తుంది

గుండెలో చెయ్యి పెట్టి
ప్రాణం తోడేసినట్టు
శ్వాసలో ఊపిరి
గాలిలో కలిసిపోతున్నట్టు
దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నా
కంటి దివ్వెలు గుడ్డి దీపాలుగా
ప్రభలు కోల్పోయినట్టు
మధురమైన సవ్వడులు కూడా
గుండె పొరను తాకనట్టు
చల్లని సమీరంలో
వేడి సెగలు మండినట్లు
జాబిలమ్మ వెన్నెలలో
ఎండమావులు విచ్చుకున్నట్లు
విరిసే పెదవిలోనూ
వాడిన గులాబీలే కనిపించినట్లు
అవును
నాకు ఇలాగే అనిపిస్తుంది
పువ్వులా నవ్వులు రువ్వే నువ్వు
మౌనదేవివైతే
వికసించే వదనం
ముభావమే అయితే
మనోప్రాంగణంలో నర్తించే మనసు
వేదనాభరితమైతే
నాకు
ఇలాగే అనిపిస్తుంది
మనస్వినీ

Thursday, 24 September 2015

ఒక్క వరమివ్వు చాలు


ఒక్క వరమివ్వు చాలు


విరిసిన వసంతాన్ని వీడాలని లేదు
పచ్చని పొదరింటిని దాటి వెళ్లాలని లేదు
ఎన్నాళ్ళో వేచిన ఉదయమిది
ఎండిన కనుల కొలనులో
ఉబికిన అమృత ధార ఇది
ఈ అమృతధారను నేలపాలు చేయాలని లేదు
అమృతంలోని ప్రతి చుక్కనూ
ఆస్వాదించాలని ఉంది
వసంత హేళలో
విరిసిన ప్రతిపువ్వులో
మెరిసే నవ్వును కావాలని ఉంది
పువ్వు పువ్వులో
మెరిసే నవ్వులో
నేనే కనిపించాలని ఉంది
అవును
ఈ అందమైన పూదోటను
వీడాలని లేదు
ఎండిన చెలమలు
ఎగసిపడే ధూళి మేఘాలు
జాడలే కానరాని బాటలు
కనుచూపు మేరలో కానరాని
వెలుగు రేఖలు
నీడలా వెన్నాడిన వేదనలూ
అంతులేని రోదనలు
నిత్యం ఆవేదనమయం
నా హృదయం
ఇప్పుడే వికసించిన వసంతానికి
సలాము చేస్తోంది
గులామునంటోంది
ఈ నవ్వులపువ్వుల వసంతానికి
మనసు ప్రణమిల్లుతోంది
దేవుడా
ఈ వసంతాన్ని నాకు
శాశ్వతంగా ఇవ్వు
ఈ ఒక్క వరమివ్వు చాలు నాకు
వరమియ్యని వేళ
వసంతం వాడిపోయే ఘడియ
నాకు
మరణమే ప్రసాదించు
ఇంకా నాకు
ఎడారి పయనం
చేతకాదు
మనస్వినీ

Monday, 21 September 2015

చెలి ఒడి దేవుని గుడి

చెలి ఒడి దేవుని గుడి

నమాజు రివాజుల
దైవత్వం నీలో చూసాను
రాముని దివ్య చరణాల
మెరుపులు నీలో గాంచాను
జీసస్ ప్రేమ తత్వం
నీ పలుకుల్లో విన్నాను
అమ్మలోని కమ్మదనం
నీలోనే రుచి చూసాను
కనుల కొలను ఎగసిపడిన వేళ
నీలో అపార కరుణను పొందాను
మనసు మూగబోతే
నీ గుండె గానం విన్నాను
కారు చీకటి అలుముకుంటే
నిన్ను కాగడాగా మలుచుకున్నాను
మసీదు గోడల చల్లదనం
గుడిలోని పారవశ్యం
క్రీస్తు ఇంటి ప్రేమమయం
ఒకటి కాదు
సృష్టి లోని సర్వస్వం
నీలోనే చూసాను
ప్రవక్తల ప్రేమ తత్వం
మహారుషుల ముక్తి మార్గం
సమస్త దైవత్వం
నీలోనే పొందిన నేను
గుడి కంటే నీ ఒడి
మోక్షమని అనుకుంటే
సృష్టికర్తకు కోపం రావచ్చు
నన్ను దైవద్రోహి అని ఎవరైనా నిందించవచ్చు
మతవ్యతిరేకి అంటూ శాపాలు పెట్టవచ్చు
దివ్యమైన ఆ గ్రంథాలను
బట్టిపట్టి చదివిన వారికి కాదు
ఆ స్వర్ణ అక్షరాలను
మనసుపై ముద్రించుకున్న వారికి
చెలి ఒడి కూడా దేవుని గుడియేనని
తెలుస్తుంది
మనస్వినీ

Friday, 18 September 2015

విజయవైభవం

విజయవైభవం

ఇదేనా
నా మనసు కోరుకుంది
అవునేమో
ఇదేనేమో
మనసు అభిలషించింది
చీకట్లో చిరుదివ్వెలా
కడలి కెరటాలను నిద్రపుచ్చే
సవ్వడి చేయని మారుతంలా
వికసించిన కుసుమంలా మారిన
నింగిలోని తారకలా
చందమామలోని
చల్లని వెన్నెలలా
వయ్యారాలు ఒలికించే
కొలనులోని కలువలా
మనసు పుష్పం వికసిస్తోంది
ఎన్నడూ లేని ధైర్యం
ఎప్పుడూ లేని నమ్మకం
ఏనాడూ కనిపించని విజయదరహాసం
మనసు వేదికపై నర్తిస్తోంది
నిజమేనా
ఇది నమ్మకమేనా
ఒక మెట్టు దిగిన మనసు
వంద మెట్లు పైకి ఎక్కిందా
ఇది విజయమే
మనసు సాధించిన మహా విజయమే
ఈ విజయమే
అంతిమం
ఈ పరిణామమే శాశ్వతం
విజయం తుది మెట్టును
ముద్దాడిన మనసు
శిఖరంలా
తల ఎగురవేస్తోంది
ఇక వెనుకడుగు వెయ్యదు మనసు
వెనక్కి తిరిగి చూడదు మనసు
ఇక విజయమే చేజారితే
గెలుపు మెట్టు జారిపోతే
మనసు పుష్పం వాడిపోతే
అది నా ఓటమి కాదు
అదీ నా గెలుపే
మరణంతోనే విజయాన్ని
గుండెల్లో పదిలంగా దాచుకుంటా
మనస్వినీ

అనుబంధంలోనే అనుభవం

అనుబంధంలోనే అనుభవం

భావ యుక్తం నా మానసం
ఉద్విగ్న భరితం నా అంతరంగం
రసరమ్యం నా ఆలోచనం
కడలి కల్లోలం నా హృదయం
మనసు కేరింతలలో
వికసించే పుష్పం నా రచనం
జారిపడే కన్నీటిలో
రోదించే కావ్యం నా భావం
అన్ని ఘడియల్లో ఒకేలా ఉండదు
నా అక్షరం
పూదోటలో పుష్పికను చూసి ప్రణమిల్లే
చిరుగాలి నా కవిత్వం
పూవులపై వాలి తేనీయను
దొంగిలించే భ్రమరం కాదు
నా గీతం
కుసుమించే వనంలో
కవ్వించే పూబాలలు ఎందరున్నా
అందంగా ఆకట్టుకున్నా
వయ్యారంగా చిందేసినా
మాటల మాయలు చేసినా
వలపు బాణాలు సంధించినా
స్పందించని జడపదార్థమే
నా తత్వం
నా మనసు ఒక భ్రమరమే
అనుకుంటే
ఈ భ్రమరం అనుభవానికి కాదు
అనుబంధానికే
ప్రణమిల్లుతుంది
మనస్వినీ

Tuesday, 15 September 2015

♣♣♣ HAPPY BIRTHDAY PRINCE ♣♣♣

♣♣♣ HAPPY BIRTHDAY PRINCE ♣♣♣

నా కంటి చూపుల వెలుగులు ఆరిపోతాయి
నా పలుకులు శాశ్వతంగా మూగబోతాయి
నా శ్వాస నన్ను వీడి అనంతవాయువుల్లో కలిసిపోతుంది
నా దేహం పుడమి గర్భంలో కలిసిపోతుంది
నేనుండను
ఎవరికీ కనిపించను
నా మరణం నన్ను మాయం చేస్తుంది
అయినా నేనుంటాను
నా మాటలు వినిపిస్తాయి
నా కన్నులు వెలుగుతూనే ఉంటాయి
నా అడుగుల జాడలు సజీవంగానే కనిపిస్తాయి
నా ప్రతిరూపంగా నీవు
నేలపై నడియాడుతూనే ఉంటావు
నిన్ను చూసిన ఎవరైనా నన్నే తలుచుకుంటారు
నాజన్మకు సార్ధకం నీవు
నా శ్వాసకు ఊపిరే నీవు
నా మాట నీవు
నా నడక నీవు
నా నడత నీవు
నా విజయంలో నీవు
పరాజయంలో నీవు
నా ఒప్పులో నీ చిరునవ్వే
నా తప్పును సరిదిద్దేదీ నువ్వే
నేను మరణించినా
నన్ను చిరంజీవిగా మార్చేదీ నీవే
అంతంలోనూ
నాకు ఆరంభాన్నే కానుకగా ఇచ్చే
మై డియర్ ప్రిన్స్ కు
నా మనసునిండా
జన్మ దిన శుభాకాంక్షలు
మనస్వినీ
{16 సెప్టెంబర్ మా ఇంటి యువరాజు, మా ప్రిన్స్, ఆరిఫుద్దీన్ షేక్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు }