Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 2 September 2015

అక్షయపాత్ర

అక్షయపాత్ర

అంతమే లేని ఆరంభం నా అక్షరం
అక్షయపాత్రను మరిపించే
అమృత కలశం నా భావం
కరిగిపోతాయా నా అక్షరాలు
ఎగిరిపోతాయా నా భావాలు
కనులనుండి జారి
పుడమిని ముద్దాడిన
కన్నీటి చుక్కలో మెరిసేది
నా అక్షరమే
పెదాల మెరుపుల్లో
రంగులు అద్దుకునేదీ
నా అక్షరమే
మనసు పుష్పం వికసించి
విరజిమ్మే సుగంధంలో
పరిమళించేదీ నా భావమే
మనోసంద్రం అల్లకల్లోలంలో
సుడిగుండమై
ఎగసిపడేదీ నా అక్షరమే
ఎలా ఆగుతుంది నా భావం
ఎలా అదిమిపెట్టగలను నా అక్షరాన్ని
ఎలా దాచుకోగలను
నా అంతరంగాన్ని
విరబూసే చిరునవ్వులో
మెరిసే కన్నుల కాంతిలో
రాలిపడే కన్నీటి చుక్కలో
దోబూచులాడే
ఆశా నిరాశల్లో
ఎత్తులు పైఎత్తుల్లో
నక్క జిత్తుల చదరంగంలో
ఓటమి గెలుపుల్లో
ఒంటరి నడకల్లో
చేయూతనిచ్చే స్నేహంలో
మైమరిపించే మనసులో
మండే ఎండలో
చల్లని సమీరంలో
ఇంద్ర ధనుస్సు రంగుల్లో
నీలాల నింగిలో
ఎగిరే పక్షిలో
కోయిల రాగంలో
మనసును తాకే వసంతంలో
నా శ్వాసలో
నా హృదయ స్పందనలో
నా అక్షరం
మారాకులు వేస్తూనే ఉంటుంది
మనస్వినీ

No comments:

Post a Comment