Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 8 October 2016

నీ కాలిమువ్వనై రాలిపోవాలనీ...

నీ కాలిమువ్వనై రాలిపోవాలనీ... 

నువ్వు నమ్మవుగానీ
నాకెప్పుడూ ఇలా అనిపిస్తూ ఉంటుంది
చల్లని సాయంత్రంలో
సాగర తీరంలో ఇసుకతిన్నెలపై
నీతో కలిసి నడుస్తూ
పాదాలు ఇసుకలో కూరుకుపోతూ ఉంటే
నీ భుజాలను ఆసరా చేసుకుంటూ
నీ నడుము పై సుతారంగా మీటుతూ
నడకలో నీకు సహారా కావాలని అనిపిస్తుంది
సముద్రుడిపై మోహం తగ్గి
నీవైపు దూసుకువచ్చే పిల్లగాలులు
నీ కురులతో సయ్యాటలు ఆడుతూ ఉంటే
విరిసిన మోము అందాలను తనివితీరా చూస్తూ
ఘడియలు తెలియకుండా గడిపేయాలని అనిపిస్తుంది
ఎగసిపడే కెరటాల హోరులో
నీ పలుకులు చెవులను తాకకపోతే
నీ మాటలను మనసులో నింపుకుని
నా పలుకులుగా వినిపించాలని అనిపిస్తుంది
పచ్చదనాల తోటలో విరిసిన పూబాటలో
వసంతమై నువ్వు నడుస్తూ ఉంటే
నీ చిరునవ్వులకు పువ్వులతో పోటీ పెట్టాలని అనిపిస్తుంది
కిలకిలా నువ్వు నవ్వుతూ ఉంటే
బోసినవ్వుల పాపాయినై నీ గుండెను హత్తుకోవాలని అనిపిస్తుంది
నీ కన్నుల వెన్నెల కురుస్తూ ఉంటే
జలతారు స్నానం చేయాలని అనిపిస్తుంది
నీతో పయనంలో మధురమైన గమనంలో
నీ గొంతుక గానమై కురిసిపోవాలని అనిపిస్తుంది
మధుమాసమై నువ్వు పలకరిస్తే
రాలుపూల మకరందమై నిన్ను అభిషేకించాలని అనిపిస్తుంది
యాంత్రికత నన్ను ఆవహించిందని అనిపించినా
నిత్య వసంతుడినై వికసించాలని అనిపిస్తుంది
 వెలిగే దీపమై నువ్వు నవ్వుతూ ఉంటే
కరిగే చీకటిలో అస్తమించాలని అనిపిస్తుంది
భావనల్లో కాదు మెరిసే నీ నవ్వుకు
చకోరమై ఎగరాలని అనిపిస్తుంది
నిత్యం నీ నవ్వే నాట్యమాడితే
నీ కాలిమువ్వనై రాలిపోవాలని అనిపిస్తుంది
నువ్వు నమ్మినా నమ్మకపోయినా
నాకెప్పుడూ ఇలాగే అనిపిస్తుంది
మనస్వినీ 

No comments:

Post a Comment