Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 28 October 2016

ఎరుపెక్కిన శాంతి కపోతం

ఎరుపెక్కిన శాంతి కపోతం
ఎర్ర సూరీడుకీ మనసుంటుంది
అరుణ తార వెన్నెల కురిపిస్తుంది
దారితప్పారని ఒకరంటారు
రాదారి మాదని మరొకరంటారు
ఎవరి దారి ఏదైతేనేం
మంట కలిసేది మానవత్వమే...
ఖాకీ గుండెలోనూ మనసే ఉంటుంది
పోలీసు వనంలోనూ మనిషే ఉంటాడు
ఎవడు మనిషైతేనేం
రాలిపడేది మనిషి దేహమే...
పచ్చని అడవిలో గుభాళించేది ఎర్రమందారమే
వాగుల్లో వంకల్లో
ఎరుపెక్కిన కొండల్లో
మనుషుల పదఘట్టనల్లో
నలిగిపోయిన పుష్పాలు జీవన మందారాలే
నలిపేసేది ఎవరైతేనేం
మరణించేది మనిషే...
ఆదివాసి జీవితాల విరిసిన పెదాలలో
చాలీ చాలని బతుకుల ఆక్రందనలో
రాజ్యహింసకు రగిలి ఎరుపెక్కిన కన్నులలో
తూటాలను ముద్దాడి నేలకొరిగిన కళేబరాలలో
కరాళ నృత్యం చేసేది మరణమే
మరణించేది మనిషే...
మనసు నిండా తనవారు
కనులలో మెదిలే చిన్నారుల కేరింతలు
అయినవారికి దూరంగా
పుట్టలు గుట్టలు దాటుతూ
మందుపాతరలకు దేహం తునా తునకలైతే
కన్నీరు మున్నీరుగా విలపించేది మనుషులే
పగిలిన ఆ హృదయాలూ మనుషులవే...
ఒక తూటా విప్లవమని గర్జిస్తే
మరో తూటా బాధ్యత అని రగిలితే
మండుతున్న అడవిలో
రుధిరం ప్రవహించే సెలయేరులో
ఓ శాంతి కపోతం విలపిస్తోంది
ఎరుపెక్కిన తన రెక్కలను చూసి...

No comments:

Post a Comment