Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 1 October 2016

నిశిరాతిరి అన్వేషణ

నిశిరాతిరి అన్వేషణ

ఓ నిశి రాతిరి కన్నులు తెరిచాను
చీకటి గుహలోనుంచి లేచి
బడలికగా ఒళ్ళు విరుచుకున్నాను
నా దేహానికి అంటుకున్న మట్టి మరకలను
చేతులతో దులుపుకున్నాను
అక్కడక్కడా పొదిగినట్టుగా ఒంటికి అంటుకున్న
ఎండుటాకులను ఏరి విసిరేసాను
చుట్టూ నిర్మానుష్యం
ఎక్కడా అలికిడి లేదు
ఏవో జీవులు కదులుతుంటే
రాలిపడిన ఎండుటాకుల వింత సవ్వడి
గాలిలో తేలినట్లుగా లేచి నిలుచున్నా
ఎంత చిత్రమో
నా అడుగులకు ఎండుటాకులు సవ్వడి చేయనే లేదు
రోజూ ఇలాగే అనుకుంటా
అయినా ముందుకే సాగుతా
ఆగిపోయిన నా అన్వేషణను మరలా మొదలు పెడుతూ
ఓ విశాలమైన భవంతి
ఎలాగూ నన్నెవరూ చూసే అవకాశమే లేదు
లోపలి దూరిపోయా
ఆ పెద్దాయన ఎంత మంచోడో
తన కొడుకు పుట్టిన రోజని భారీగా విందు ఇస్తున్నాడు
అందరూ తాగుతున్నారు తింటున్నారు
అంతలోనే ఒక ప్రకటన
పుట్టిన రోజు సందర్భంగా తన కొడుకుకి
మెర్సిడెజ్ బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు
అందరూ చప్పట్లు కొడుతూ
ఎంత ప్రేమో కొడుకంటే అని చెవులు కొరుక్కున్నారు
అవునేమోలే అనుకుంటూ మరో చోటికి వెళ్ళా
వివాహ దినోత్సవ వేడుకలు
సూటు బూటులో ఉన్న పెద్దమనిషి హడావిడిగా కనిపించాడు
అందరి సమక్షంలో తన సతిని ముద్దాడి
కోటి రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్
కానుకగా మెడకు తొడిగాడు
మళ్ళీ అదే ముచ్చట
అదే చెవులు కొరుకుడు
ఎంత ఘాటు ప్రేమయో
గడియారం ముళ్ళు వేగం పెంచుకున్నాయి
నా అన్వేషణ ఇంకా మిగిలే ఉంది
వెలుతురు పరుచుకోక ముందే గమ్యం చేరాలి
ఆలోచిస్తూనే తిరుగు ప్రయాణం చేస్తున్నాను
నిజంగా ప్రేమంటే ఇదేనా
నా అన్వేషణ పూర్తయ్యిందా
నా దేహంలో జీవమున్నవేళ
నేను బతికే ఉన్న ఘడియల్లో
ఇలాంటి వేడుకలు నన్నూ పలకరించిన వేళ
రిక్త హస్తాలతో నేను
మనసులోనే కుమిలిన క్షణాన
నాలో రగిలిన వేదన
కన్నుల నుంచి కారిన వైరాగ్య భాష్పాలు
అన్నీ మదిలో మెదలుతున్నాయి
ఈ వేదనకు రూపమేమిటి
ఈ ఆక్రందనకు అర్థం ఏమిటి
ఇది ప్రేమా
జీవన వైఫల్యమా
అవునేమో
ఇది వైఫల్యమేనేమో
మరి ప్రేమంటే
సమాధానం ఇంకా దొరకలేదని పిస్తోంది
అన్వేషణ ఇంకా మిగిలే ఉందనిపిస్తోంది
భారమైన మనసుతో నా శయనమందిరం చేరుకున్నా
ఎక్కడో పొద్దు పొడుస్తున్న వెలుతురు ఛాయలు
బలంగా కళ్ళు మూసుకున్నా
మనసు నిండా చీకటి నింపుకుంటూ
మరో నిశిరాతిరి కోసం నిరీక్షిస్తూ 

No comments:

Post a Comment